మార్చిలో ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు!

 మార్చిలో సొంత క్రెడిట్‌ కార్డు సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తొలుత ప్రస్తుత ఖాతాదారులకు అందిస్తామని ఫెడరల్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శ్యామ్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎస్‌బీఐ కార్డ్స్‌తో కలిసి ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను అందిస్తోంది.

Published : 23 Jan 2021 01:44 IST

ముంబయి:  మార్చిలో సొంత క్రెడిట్‌ కార్డు సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తొలుత ప్రస్తుత ఖాతాదారులకు అందిస్తామని ఫెడరల్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శ్యామ్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎస్‌బీఐ కార్డ్స్‌తో కలిసి ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను అందిస్తోంది. క్రెడిట్‌ కార్డు సేవల ప్రారంభానికి ఫిసెర్వ్‌తో ఫెడరల్‌ బ్యాంక్‌ జట్టుకట్టింది. కార్డుల జారీ, బిజినెస్‌ ప్రొసెస్‌ సొల్యూషన్లను ఫిసెర్వ్‌ అందించనుంది.
తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు
ముంబయి: విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు జనవరి 15తో ముగిసిన వారానికి 1.839 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14000 కోట్లు) తగ్గి 584.242 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.43.85 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు 284 మిలియన్‌ డాలర్లు తగ్గి 541.507 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.40.5 లక్షల కోట్ల)కు చేరాయి. బంగారు నిల్వలు 1.534 బిలియన్‌ డాలర్లు తగ్గి 36.06 బిలియన్‌ డాలర్లకు చేరాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 4 మి.డా. కోల్పోయి 1.512 బి.డా. వద్ద ఉన్నాయి. ఐఎంఎఫ్‌లో దేశ నిల్వల స్థానం 17 మి.డా.తగ్గి 5.163 బి.డా.కు చేరినట్లు ఆర్‌బీఐ వివరించింది. జనవరి 8తో ముగిసిన వారంలో నిల్వలు 758 మిలియన్‌ డాలర్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 586.082 బి.డాలర్లుగా నమోదైన సంగతి విదితమే.
ఫిలిప్పీన్స్‌ విమాన టెర్మినల్‌ పూర్తి: జీఎంఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌, మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఉమ్మడిగా ‘క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయం’లో నిర్మించిన టెర్మినల్‌ భవనాన్ని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వానికి అప్పగించాయి. ఆ దేశంలోని ఏంజెలెస్‌, మబాలాకాట్‌ నగరాల మధ్య ఈ టెర్మినల్‌ భవనాన్ని ఈ సంస్థలు 24 నెలల్లో నిర్మించాయి. దీన్ని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే బేసెస్‌ కన్వర్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బీసీడీఏ)కి శుక్రవారం అప్పగించినట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. ఈ భవనం విస్తీర్ణం 40వేల చదరపు మీటర్లు. ఈ టర్మినల్‌ ద్వారా ఏడాదికి 80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీన్ని మరింత విస్తరించి ఏడాదికి 1.2 - 1.6 కోట్ల మంది ప్రయాణికులకు సేవలనందించే వీలూ ఉందని జీఎంఆర్‌ గ్రూపు వెల్లడించింది.
డుకాటీ బీఎస్‌-6 స్క్రాంబ్లర్‌
దిల్లీ: ఇటలీ సూపర్‌బైకుల సంస్థ డుకాటీ భారత్‌లో బీఎస్‌-6 స్క్రాంబ్లర్‌ శ్రేణిని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు. స్క్రాంబ్లర్‌ ఐకాన్‌ ధర రూ.8.49 లక్షలుగా, ఐకాన్‌ డార్క్‌ ధర రూ.7.99 లక్షలుగా, 1100 డార్క్‌ ప్రో ధర రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, కోచి, కోల్‌కతా, చెన్నైల్లోని విక్రయశాలల్లో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, ఈనెల 28 నుంచి డెలివరీలు ఇస్తామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని