ఒకేదానిలో ఎఫ్‌డీ, బీమా, మ్యూచువ‌ల్ ఫండ్లు.. స‌రైన‌దేనా?

ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌పై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది. అదేవిధంగా రిస్క్ లేకుండా స్థిర రాబ‌డిని కోరుకునేవారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటున్నారు. స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాల కోసం ఇవి అంద‌రికీ అనుకూలమైన‌వి. ఇటీవ‌ల ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ ఎక్స్‌ట్రా అనే కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీనికి మూడు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్..

Published : 16 Dec 2020 21:20 IST

ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌పై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది. అదేవిధంగా రిస్క్ లేకుండా స్థిర రాబ‌డిని కోరుకునేవారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటున్నారు. స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాల కోసం ఇవి అంద‌రికీ అనుకూలమైన‌వి. ఇటీవ‌ల ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ ఎక్స్‌ట్రా అనే కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీనికి మూడు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్ తో ఉచిత టర్మ్ జీవిత బీమా, మ్యూచువల్ ఫండ్ సిప్ లోకి ఆటో-ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లు, మెచ్యూరిటీ మొత్తాన్ని వాయిదాలలో తీసుకునే స‌దుపాయం క‌లిగి ఉన్నాయి. ఎఫ్డీ ఎక్స్ట్రా ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్, రిక‌రింగ్ డిపాజిట్లను అందిస్తుంది. అయితే ఆర్థిక నిపుణులు ఇలా అన్ని ఒకేదానిలో క‌లిపి ఉన్న ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌డం అంత స‌రైన నిర్ణ‌యం కాద‌ని చెప్తున్నారు. ఎందుకంటే మ్యూచువ‌ల్ పండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే మీకు స‌రిపోయే ఫండ్‌ను ఎంచుకోవాలి. అదేవిధంగా బీమా పాల‌సీ కూడా మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌దై ఉండాలి. అంతేకాని అన్ని క‌లిపి ఉన్నాయ‌ని ప‌రిమితుల‌తో కూడిన పెట్టుబడుల‌ను ఎంచుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నేది వారి సూచ‌న‌.

ఎఫ్‌డీ లైఫ్:

ఎఫ్‌డీ ఎక్స్ట్రా డిపాజిట్లలో మొదటిది ఎఫ్‌డీ లైఫ్ . ఇది 18-50 సంవత్సరాల వ‌య‌సున్న వారు తీసుకునే ఎఫ్‌డీ పై ఒక సంవత్సరం ఉచిత జీవిత బీమా అందిస్తారు. కనీసం రెండు సంవత్సరాల వ్యవధికి క‌నీసం రూ. 3 ల‌క్ష‌ల ఫిక్సిడ్ డిపాజిట్ చేసే వారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.3 ల‌క్ష‌ల ఉచిత టర్మ్ బీమా అందిస్తారు. ఖాతాదారులు త‌రువాతి సంవ‌త్స‌రాల‌కు బీమా పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. ఈ విధంగా ఎఫ్‌డీతో బీమా ఉచితంగా క‌లిపి అందించే తొలి ప‌థ‌కం ఇదేన‌ని ఐసీఐసీఐ బ్యాంకు అధికారి ప్ర‌ణ‌వ్ మిశ్రా పేర్కొన్నారు.

అయితే ఇది ఏడాది మాత్ర‌మే ఉచితంగా ఉంటుంది. రెండో ఏడాది నుంచి రూ.250 తో రినివ‌ల్ చేసుకోవాలి. ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైప్ ఇన్సూరెన్స్ కంపెనీ పాల‌సీ. అంటే ఎంత‌కాలం ఎఫ్‌డీలో పెట్టుబ‌డులు పెడ‌తారో అంత‌కాలం పాల‌సీ కొన‌సాగుతుంది. ఈ గ్రూపులో చేరితేనే ఈ స‌దుప‌యాలు ల‌భిస్తాయి.

ఎఫ్‌డీ ఎక్స్ట్రా - ఎఫ్‌డీ ఇన్వెస్ట్:

ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ నిర్వ‌హించే మ్యూచువల్ ఫండ్ల‌లోకి నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ‌దుపు చేయోచ్చు. కనీసం రెండు సంవత్సరాల వ్యవధికి క‌నీస మొత్తం రూ. 2 లక్షల ఎఫ్‌డీ చేస్తే ఇది లభిస్తుంది. కాల‌ప‌రిమితి ప‌ది సంవ‌త్స‌రాలు. పెట్టుబ‌డుదారుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నుంచి రెగ్యుల‌ర్ మ్యూచువ‌ల్ ఫండ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సిప్ మొత్తం నెల‌కు క‌నీసం రూ.1000.

ఎఫ్‌డీ ప్రారంభించిన త‌ర్వాత రెండో నెల నుంచి సిప్ ప్రారంభ‌మ‌వుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.2 ల‌క్ష‌ల ఎఫ్‌డీ ప్రారంభిస్తే వ‌డ్డీ రేటు 7.5 శాతం అయితే, వార్షికంగా వ‌డ్డీ ఆదాయం రూ.15000 అవుతుంది. నెల‌కు రూ.1,250 మీ బ్యాంకు ఖాతాకు క్రెడిట్‌ అవుతాయి. అందులో నుంచి సిప్ కోసం తిరిగి డెబిట్ అవుతాయి.

విశ్లేష‌ణ‌:

ఎఫ్‌డీ, బీమా, మ్యూచువ‌ల్ ఫండ్లు క‌లిపి ఉన్నాయంటే అవి బ్యాంకుకు చెందిన గ్రూప్ కంపెనీల పాల‌సీల‌కు సంబంధించిన‌వే ఉంటాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. ఇది మీ పెట్టుబ‌డుల ఎంపిక‌ను నియంత్రిస్తుంది. అయితే ఇటువంటి సాద‌నాలు ఒక‌దానితో మ‌రొక‌టి ఆధార‌ప‌డి ఉంటాయి. దీర్ఘ‌కాలికంగా కొన‌సాగితేనే లాభాలు వ‌చ్చేవిధంగా పాల‌సీ విధానాలు ఉంటాయ‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

దీనికి బ‌దులుగా పాల‌సీని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు వ్య‌యాలు త‌గ్గడానికి ఆన్‌లైన్ ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేయాలి. పెట్టుబ‌డుల కోసం డెట్, ఈక్విటీ క‌లిపి ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం మంచిది. దీనికోసం కేవ‌లం ఫిక్స్‌డ్ డిపాజిట్ మాత్ర‌మే స‌రిపోదు. డ‌బ్బు త్వ‌ర‌గా కావాల‌నుకుంటే ఐదేళ్ల‌లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా డెట్ ఫండ్ల‌ను ఎంచుకోవాలి. వారి ప‌న్ను శ్లాబు ప్ర‌కారం ఏది ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుదో దానిని చూసుకోవాలి. మిగ‌తాది దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం అయితే మొద‌ట‌ డెట్ ఫండ్లలో పెట్టి ఆ తర్వాత కొన్ని నెల‌ల త‌ర్వ‌త‌ ఈక్వీటీల‌లోకి సిస్ట‌మేటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్ ద్వారా చేరేవిధంగా ఎంచుకోవాలి.

రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేనివారు సుల‌భంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకోండి అంతేగాని ఎఫ్‌డి బీమా, మ్యూచువ‌ల్ ఫండ్లు అన్ని క‌లిపి ఉన్న వి స‌రైన‌వి కాదు అని విశ్లేష‌కుల సూచ‌న‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని