మ‌హిళ‌ల ‌ఆర్థిక స్వేచ్ఛ‌కు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌

ఒంటరి మ‌హిళ‌ల ఆర్థిక అవ‌స‌రాలు వేరు. వారికంటూ ప్ర‌త్యేక ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం. 

Published : 11 Feb 2021 17:02 IST

దేశంలో విద్య‌, అవ‌గాహ‌న‌, స్వ‌తంత్రంగా ఉండాల‌నే కాంక్షతో స్వతంత్రంగా జీవించే మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. సాధార‌ణ ఆర్థిక ప్ర‌ణాళిక …స్వ‌తంత్రంగా ఉండే మ‌హిళ‌ల అవ‌స‌రాల‌కు స‌రిపోదు. వాళ్ల‌కంటూ ప్ర‌త్యేకంగా ప్ర‌ణాళిక అవ‌స‌రం. సంప్ర‌దాయ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో జీవితంలోని వివిధ ద‌శ‌ల‌ను బ‌ట్టి ల‌క్ష్యాల‌ను సులువుగా గుర్తించొచ్చు. వివాహం, పిల్ల‌ల చ‌దువులు, ఇల్లు, కారు కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక ఇలాంటి ల‌క్ష్యాలే ఉంటాయి. కానీ సామాజిక మార్పులకనుగుణంగా స్వతంత్ర మహిళల అభిరుచులూ లక్ష్యాలూ వేరుగా ఉన్నాయి.
చాలా మంది ఆర్థిక ప్ర‌ణాళిక‌దారుల ప్ర‌కారం పెళ్లికాని స్వ‌తంత్ర మ‌హిళ‌లు త‌మ‌ ల‌క్ష్యాలు మార్చుకుంటూ ఉంటారు. అంద‌రూ ఇలాగే ఉంటార‌ని కాదు. కొంద‌రు స్థిర‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా న‌డుచుకుంటారు. మరో వైపు మృణాళిని త‌న ఉన్న‌త చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చును త‌నే స్వ‌యంగా భ‌రించాల‌నుకునేవారు కొంద‌రైతే, రుణం తీసుకొని ఈఎమ్ఐల‌తో ఇంటిని కొనుగోలు చేయాల‌నుకునేవారు ఇంకొంద‌రు. దీంతోపాటు స్వ‌ల్పకాల ల‌క్ష్యం స్నేహితుల‌తో క‌లిసి విహార యాత్ర‌లకు వెళ్ల‌డం కోసం పొదుపు చేసుకుంటున్న‌వారు కూడా ఉన్నారు. ఆర్థికంగా స్వ‌తంత్రంగా జీవించ‌డంలో ఎంతో తృప్తి ఉంద‌ని మ‌హిళ‌లు ముఖ్యంగా యువ‌త అభిప్రాయ‌ప‌డుతున్నారు. విద్యార్థి దశ నుంచే ఫ్రీలాన్స‌ర్ వంటి చిన్న ఉద్యోగాలు చేస్తూ వారి ఖ‌ర్చుల‌కు స‌రిపోయేలా పొదుపు చేసుకుంటున్నారు. 

ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాలి: ఆర్థిక స‌ల‌హాదార్లు
ఆర్థిక ప్ర‌ణాళిక‌దారులు గ‌మ‌నించిన దానిని బ‌ట్టి స్వ‌తంత్రంగా జీవించే మ‌హిళ‌ల ల‌క్ష్యాల్లో ఆర్థిక భ‌ద్ర‌త‌, ఇంటి కొనుగోలు, విహార యాత్ర‌లు, ఉన్న‌త చ‌దువులు లాంటివి ఉన్నాయి. ఒంట‌రిగా జీవిస్తున్న‌ మ‌హిళ‌లు త‌మకంటూ ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాల‌ని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు. దీని వ‌ల్ల జీవితం నిస్స‌త్తువ‌గా మార‌దు అని వారు అంటున్నారు.

రెండు ర‌కాల ల‌క్ష్యాల‌ను పెట్టుకోవాలి. ఒక‌టి ఆర్థిక విష‌యాల‌తో ముడిప‌డేవి. రెండోది ఆర్థికేత‌ర‌.
రెండు ర‌కాల ల‌క్ష్యాల‌ను కాగితం పై రాసిపెట్టుకోవాలి. ఆ ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ఎలా ముంద‌డుగు వేయాలో, అందుకు ఎంత సొమ్ము, స‌మ‌యం కేటాయించుకోవాలో నిర్దేశించుకోవాలి. స‌మ‌యాన్ని బ‌ట్టి స‌మీక్ష చేస్తూ ఉండాలి.

అత్య‌వ‌స‌రాల‌కు కొంత సొమ్ము;
స్వ‌తంత్రంగా జీవించే మహిళలు త‌మ‌ను తాము ర‌క్షించుకునేందుకు త‌గిన ఏర్పాట్లు చేసుకోవాలి. అనుకోకుండా వైద్య అత్య‌వ‌స‌రం ఏర్ప‌డితే ఖ‌ర్చు బాగానే అవుతుంది. అందుక‌ని ముందు జాగ్ర‌త్త‌గా మెడిక‌ల్ క‌వ‌ర్ తీసుకొని ఉంటే ఇలాంటి స‌మ‌యంలో ర‌క్ష‌ణగా ఉంటుంది.

కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు ఉద్యోగం కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చు. లేదా మ‌రి కొన్ని కార‌ణాల‌తో ఆదాయం కొంత కాలంపాటు ఆగిపోవ‌చ్చు. ఇలాంటి వాటికి ముంద‌స్తుగా సిద్ధ‌మ‌వ్వాలి.

సాధార‌ణంగా ఒంట‌రిగా జీవించే మ‌హిళ‌ల‌కు… భ‌ర్త‌, త‌ల్లిదండ్రుల నుంచి ఆర్థిక చేయూత అంద‌దు. వారి ఆర్థిక భ‌ద్ర‌త వారే చూసుకోవాలి. అందుకే అత్య‌వ‌ర‌స‌ర నిధి జ‌మ‌చేసుకోవ‌డం మంచిది. 9 నుంచి 12 నెల‌ల ఖ‌ర్చులకు స‌రిపోను అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటుచేసుకోవ‌డం శ్రేయ‌స్క‌రం అని నిపుణులు సూచిస్తున్నారు.

ల‌క్ష్యాల కాల‌వ్య‌వ‌ధికి అనుగుణంగా పెట్టుబ‌డులు:
ముఖ్య‌మైన అవ‌సరాల‌కు డ‌బ్బు ప‌క్క‌న తీసిపెట్టుకున్న త‌ర్వాత‌… పెట్టుబ‌డుల‌ను, సంప‌ద సృష్టిపై దృష్టి సారించాల‌ని స‌ల‌హాదార్లు చెబుతున్నారు. దీర్ఘ‌కాల ల‌క్ష్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక భ‌ద్ర‌త‌ను పెట్టుకోవాలి. ఇందుకోసం ఈక్విటీలో పెట్టుబ‌డులు చేయాలి. ఇక మ‌ధ్యకాల ల‌క్ష్యంగా ఇంటి కొనుగోలు లాంటివాటికి ఈక్విటీ, డెట్‌లో స‌మానంగా పెట్టుబ‌డులు చేయాలి. స్వ‌ల్ప కాల ల‌క్ష్యాలైన విహార యాత్ర‌ల కోసం డెట్ ప‌థ‌కాల్లో పెడితే బాగుంటుంద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ల‌క్ష్యం లేక పోయినా… పొదుపు మానొద్దు
ఆర్థికంగా స్వ‌తంత్రంగా ఉండి, ఒంట‌రిగా జీవించే మ‌హిళ‌లు స్థిర‌మైన ల‌క్ష్యమంటూ లేకపోయినా ఫ‌ర్వాలేదు. అయితే ఇది అడ్డుగా పెట్టుకొని అస‌లంటూ పొదుపు చేయ‌కుండా ఉండ‌డం మంచిది కాదని అంటున్నారు ఆర్థిక నిపుణులు. స‌మీప భ‌విష్య‌త్‌లో ఎలాంటి ల‌క్ష్యం లేక‌పోతే… దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌ను ఎంచుకోవాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ‌, ఇంటి కొనుగోలు లాంటివి ఈ కోవ‌లోకి వ‌స్తాయి. ఈ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు పెట్టుబ‌డుల‌ను ఆరంభించ‌డం మంచిది.

ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా రూపొందించుకోవాలో తెలియ‌క‌పోతే స‌ల‌హాదార్ల‌ను సంప్ర‌దించ‌డం మేలు. చిన్న వ‌య‌సులోనే ఇన్వెస్ట్ చేయ‌డం అల‌వాటు చేసుకుంటే మీకే మంచిది. త‌క్కువ‌గా ఖ‌ర్చు చేయ‌డం, ఎక్కువ‌గా మ‌దుపు చేయ‌డం వ‌ల్ల ఆర్థికంగా భ‌ద్ర‌త పొందేవారిలో మీరు ఒక‌ర‌వుతారు. మీకంటూ ఆర్థిక స్వ‌తంత్రత ఉంటే అది మీకు కొండంత భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌దు!

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని