మొద‌టిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నారా? ఈ త‌ప్పులు చేయ‌కండి

మీరు మొద‌టిసారి క్రెడిట్‌కార్డు తీసుకున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా వ్య‌వహ‌రించండి. మోసాల‌కు పాల్ప‌డే వారు మీకు చేరువ‌లోనే ఉండ‌చ్చు. 

Published : 19 Aug 2021 16:47 IST

ఈ మ‌ధ్య కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఎక్కువ‌గానే కార్డుల‌ను జారీ చేస్తుండ‌టంతో, క్రెడిట్ కార్డులు వినియోగించే వారి సంఖ్య మ‌న దేశంలో రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దీని ప్ర‌కారం మొద‌టి సారి కార్డు వినియోగించి వారి సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. 

కొత్త‌గా క్రెడిట్ కార్డు ఉప‌యోగించే వారే ల‌క్ష్యంగా..
క్రెడిట్ కార్డుల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించాలి. క్రెడిట్ కార్డుల లావాదేవీలు జ‌ర‌పడంలో మోస‌గాళ్ళ బారిన ప‌డి న‌ష్ట‌పోయిన కేసులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా తొలిసారిగా క్రెడిట్ కార్డు ఉప‌యోగించేవారిని ల‌క్ష్యంగా చేసుకుని మోస‌గాళ్ళు ప‌లు ర‌కాల స‌బైర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు.  అందువ‌ల్ల క్రెడిట్ కార్డు ఉప‌యోగించేప్పుడు మిమ్మ‌ల్ని మీరు కాపుడుకోవ‌ల‌సి అవ‌స‌రం ఉంది. 

డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్ పెట్టండి..
క్రెడిట్ కార్డు మోసాల‌కు పాల్ప‌డేవారు  అధిక శాతం డిజిట‌ల్ లేదా ఆన్‌లైన్‌ను వేదిక‌గా చేసుకుని మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. మోస‌గాళ్ళు బ్యాంకు నుంచి గానీ, ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి కాల్ చేస్తునట్లు న‌మ్మించి క్రెడిట్ కార్డు నెంబ‌రు, ఎక్స‌పైరీ తేదీ, సీవీవీ వంటి కార్డు వివ‌రాల‌ను అడుగుతారు. ఒక‌వేళ మోస‌గాళ్ళ‌ను న‌మ్మి కార్డు వివ‌రాలు చెబితే ఇక న‌ష్ట‌పోక త‌ప్ప‌దు.  మోస‌గాళ్ళ‌కు ఒక్క‌సారి మీ స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ తెలిస్తే కార్డును ప‌లు చోట్ల ఉప‌యోగిస్తారు. ఇలాంటి మోసాలను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకు స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌కి బ‌దులుగా డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ స్థిరంగా ఉంటుంది. మీరు చేసే ప్ర‌తీ లావాదేవీకి ఒకే పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగిస్తుంటే దానిని స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ అంటారు. నేర‌గాళ్ళు  మీరు చెప్పే కార్డు వివ‌రాల‌తో ఒక‌సారి పాస్‌వ‌ర్డ్ తెలుసుకుంటే ఇక మీరు వారి ఉచ్చులో చిక్కుకున్న‌ట్లే. అందువ‌ల్ల స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ స్థానంలో డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగిస్తే ఈ నేరాల సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్ లావాదేవీలు నిర్వహించిన ప్ర‌తీసారీ మారుతూ ఉంటుంది. ఈ విధానంలో మీరు  ప్ర‌తీసారి ఒక కొత్త పాస్‌వ‌ర్డ్‌ను పొంద‌చ్చు. 

ఇత‌రుల‌కు స‌మాచారం ఇవ్వ‌కండి:
మీ కార్డు వివ‌రాల‌ను ఇత‌రుల‌కు తెలియ‌నివ్వ‌కూడ‌ద‌ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ, వినియోగ‌దారులు వారి మాట‌ల‌ను విని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డంతో మోసాల భారిన ప‌డుతూనే ఉన్నారు. ప్ర‌జ‌లు వారికి సంబంధించిన స‌మాచారాన్ని ఫోటో కాపీస్ రూపంలో, ఈమెయిల్ ఐడీ  మొద‌లైన విధానాల ద్వారా షేర్ చేస్తున్నారు. సాధార‌ణంగా మోస‌గాళ్ళు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ద్వారా పాస్‌వ‌ర్డ్‌ను యాక్సిస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు కొంద‌రు ఆదాయ‌పు శాఖ నుంచి రిఫండ్ కోసం కాల్ చేస్తున్నాం అని చెప్పి మీ కార్డు వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్ తెలుప‌వ‌ల‌సిందిగా కోర‌తారు. బ్యాంకులు, బీమా సంస్థ‌లు, ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారు గానీ మ‌రి ఏ ఇత‌ర ఆర్థిక, ఆర్థికేత‌ర  సంస్థ‌లు, మీ కార్డు వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్, ఒన్‌టైమ్ పాస్‌వ‌ర్డ్‌(ఓటీపీ) వంటివి తెలుప‌మ‌ని కోర‌రు.  

కార్డు స్వైప్ చేస్తున్న‌ప్పుడు జాగ్ర‌త్త‌:
కొన్ని సార్లు మీరు కార్డు ఉప‌యోగించిన‌ప్పుడు స‌మాచారం దొంగిలించ‌బ‌డ‌చ్చు. ఏదైనా సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్ లేదా ఇత‌ర రీటైల్ స్టోర్స్‌లో చెల్లింపులు చేసేందుకు కార్డును మిషన్‌లో ఒక్కసారి మాత్ర‌మే స్వైప్ చేయాలి. ఒక‌వేళ‌ రెండు సార్లు స్వైప్ చేసి మిషన్‌కు మీ కార్డును ఉంచినట్ల‌యితే, అనుమానం వ్య‌క్తం చేసి చెల్లింపులు నిలిపివేయ‌డం మంచిది. కార‌ణం రెండో సారి కార్డు స్వైప్‌ చేసినప్పుడు మీ కార్డ్ మీద వుండే మాగ్నెట్ స్ట్రిప్‌ ద్వారా మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని బ్యాంకు ప‌రిశ్ర‌మ నిపుణులు అంటున్నారు. 

చివ‌రిగా..
క్రెడిట్ కార్డు మోసాల భారిన ప‌డ‌కుండా,  మీ కార్డు ద్వారా జ‌రిగే లావాదేవీల‌కు ఒక ప‌రిమితి విధించుకోవ‌డం మంచిది.  కార్డును జారీ చేసే సంస్థ‌లు నెట్ బ్యాంకింగ్ వేదిక‌గా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. క్ర‌మ‌మైన వ్యవ‌ధిలో స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చుకుంటూ ఉండాలి. లావాదేవీల గురించి మీ మొబైల్‌కు వ‌చ్చే ఎస్ఎమ్ఎస్‌ల‌ను త‌రుచూ చూస్తుండాలి. మీ కార్డుకు సంభందించిన వివ‌రాల‌ను ఫోనులో ఉంచ‌డం మంచిది కాద‌ని గుర్తుంచుకోండి. కార్డు ద్వారా జ‌రిగే మోసాల‌కు గురికాకుండా మీ వంతు జాగ్ర‌త్త‌లు తీసుకుని అప్ర‌మ‌త్తంగా ఉండండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని