IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి 15 రోజుల్లో రూ.27 వేల కోట్ల సమీకరణ

దాదాపు ఒక నెల విరామం తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల జోరు మళ్లీ కొనసాగనుంది. నవంబరు తొలి 15 రోజుల్లో ఐదు సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి....

Published : 31 Oct 2021 17:55 IST

దిల్లీ: దాదాపు ఒక నెల విరామం తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల జోరు మళ్లీ కొనసాగనుంది. నవంబరు తొలి 15 రోజుల్లో ఐదు సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి. వీటిలో ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌; పాలసీ బజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌; కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌లను నిర్వహిస్తున్న సఫైర్‌ ఫుడ్స్ ఇండియా‌; సౌందర్య ఉత్పత్తుల తయారీ, సరఫరా సంస్థ ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సెల్యూలోజ్‌ తయారీ కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బ్యూటీ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌ కొనసాగుతోంది. నైకా సబ్‌స్క్రిప్షన్‌ నవంబరు 1న ముగియనుండగా.. ఫినోపేమెంట్స్‌ రెండో తేదీన ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా నైకా రూ.5,352 కోట్లు, ఫినోపేమెంట్స్‌ రూ.1,200 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం ఈ ఏడు కంపెనీలు రూ.33,500 కోట్లు సమీకరించనున్నాయి.

2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.66,915 కోట్లు సమీకరించాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ఐపీఓ ద్వారా రూ.లక్ష కోట్ల సమీకరణ జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2017లో 36 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లను సమీకరించాయి. ఒక ఏడాదిలో ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తంలో ఇదే ఇప్పటి వరకు అత్యధికం. 2020లో మొత్తం 15 కంపెనీలు ఐపీఓకి రాగా.. అవి రూ.26,611 కోట్లను సమీకరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని