
అమెరికాలో లిస్టింగ్‌కు ఫ్లిప్‌కార్ట్ కసరత్తు!
విలీనం సహా పలు మార్గాల అన్వేషణ
దిల్లీ: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ అమెరికా స్టాక్‌ఎక్స్ఛేంజీలో నమోదుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు విలీనం సహా పలు మార్గాలను అన్వేషిస్తోందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. విలీనం నిమిత్తం ఫ్లిప్‌కార్ట్ సలహాదారులు ఇప్పటికే పలు స్పెషల్ పర్పస్ అక్వయిజేషన్ కంపెనీలతో (ఎస్‌పీఏసీలు) సంప్రదింపులు జరిపారని తెలిపాయి. రెండేళ్లలో ఏదేని వ్యాపారాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంతో మదుపర్ల నుంచి ఎస్‌పీఏసీలు నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా ఎస్‌పీఏసీలతో విలీనం కావడం వల్ల సాధారణ మార్గం కంటే వేగంగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా.. ఫ్లిప్‌కార్ట్ తన విలువను 3500 కోట్ల డాలర్లుగా చెబుతోందని, ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఎస్‌పీఏసీలతో జట్టుకట్టడం ద్వారా అమెరికాలో లిస్టింగ్ అవకాశాలను పరిశీలిస్తున్న ఫ్లిప్‌కార్ట్, భారత్‌లోనూ గ్రోఫోర్స్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తద్వారా తన విలువను మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది.