మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మేలైన రాబ‌డుల‌కు మంచి మార్గాలు

మీరు ఎంతో క‌ష్ట‌ప‌డి ఆర్జించిన సొమ్మును నిశ్చ‌లంగా ఉంచితే మీకు ఎలాంటి ప్ర‌తిఫ‌లాలు ల‌భించ‌వు. కారు కొన‌డం, పిల్ల‌ల చ‌దువులు, పెళ్లిళ్లు, ప‌దవీ విర‌మ‌ణ నిధి లాంటి ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి మ్యూచువ‌ల్ ఫండ్లు మేలైన మార్గం.....

Published : 17 Dec 2020 16:44 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేట‌ప్ప‌డు ఏ విధ‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసుకుందాం.​​​​​​​

మీరు ఎంతో క‌ష్ట‌ప‌డి ఆర్జించిన సొమ్మును నిశ్చ‌లంగా ఉంచితే మీకు ఎలాంటి ప్ర‌తిఫ‌లాలు ల‌భించ‌వు. కారు కొన‌డం, పిల్ల‌ల చ‌దువులు, పెళ్లిళ్లు, ప‌దవీ విర‌మ‌ణ నిధి లాంటి ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి మ్యూచువ‌ల్ ఫండ్లు మేలైన మార్గం. మీ ఆర్థిక ల‌క్ష్యాలు స్వ‌ల్ప కాలికమా లేదా దీర్ఘ‌కాలిక‌మా అన్న విష‌యంతో సంబంధం లేకుండా, అవ‌స‌ర‌మైన మొత్తంలో నిధిని ఏర్పాటు చేసుకోవ‌డంలో ఇవి మీకు స‌హాయ‌ప‌డ‌తాయి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల ద్వారా పెద్ద మొత్తంలో నిధిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో మొద‌లైన వ్యూహాత్మ‌క అంశాల‌ను చ‌ర్చిద్దాం.

  1. క్ర‌మ‌మైన పెట్టుబ‌డుల కోసం సిప్‌ల‌ను ఎంచుకోండి

చిన్న చిన్న మొత్తాల‌తోనే దీర్ఘ‌కాలంలో పెద్ద నిధిని ఏర్పాటు చేసుకోవ‌డానికి క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల విధానం(సిప్‌) తోడ్ప‌డుతుంది. వీటిలో క్ర‌మం త‌ప్ప‌కుండా(నెల‌కు, మూడు నెల‌ల‌కు) పెట్టుబ‌డులు చేయాల్సి ఉంటుంది. మీ ఖాతా నుంచి నిర్ధేశిత స‌మ‌యంలో డ‌బ్బులు వాటంత‌ట అవే ఉప‌సంహ‌రించుకునే స‌దుపాయం ఏర్పాటు చేసుకుంటే మీకు పెట్టుబ‌డుల విష‌యంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాట‌వుతుంది. కేవ‌లం రూ.500 నుంచి కూడా సిప్‌ల‌లో పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

మార్కెట్లో ఒడుదొడుకులున్న‌ప్పుడు, మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల కొనుగోలులో మ‌దుప‌రుల‌కు రూపీ కాస్ట్ యావ‌రేజింగ్‌తో ప్ర‌యోజ‌నం ఉంటుంది. చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌భావంతో మ‌దుప‌రులు అధిక రాబ‌డుల‌ను కూడా పొందే వీలుంది.

  1. పెట్టుబ‌డుల‌లో వైవిధ్య‌త‌ను పాటించండి

పెట్టుబ‌డుల‌ను ఒకే ద‌గ్గ‌ర కాకుండా వేర్వేరు మార్గాల‌లో పెడుతూ వ్యూహాత్మ‌కంగా వైవిధ్య‌త‌ను పాటిస్తే, త‌క్కువ న‌ష్ట‌భ‌యంతో ఎక్కువ రాబ‌డుల‌ను అందుకోవ‌చ్చు. మీరు ఎంచుకునే ఫండ్ల‌ను మీ న‌ష్ట‌భ‌య సామ‌ర్థ్యం, ఆర్థిక ల‌క్ష్యాల ప్రాతిప‌దిక‌న ఎంచుకోవ‌డం మ‌రవ‌వ‌ద్దు.

చాలా మంది మ‌దుప‌రులు ఒకే ర‌క‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు(డూప్లికేష‌న్‌). ఇది మీ పోర్ట్‌ఫోలియో అస‌మ‌తుల్యంగా ఉండేలా చేస్తుంది. పెట్టుబ‌డుల‌లో వైవిధ్య‌త పాటిస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా మంచి రాబ‌డుల‌ను అందుకోవ‌చ్చు.

  1. డైరెక్ట్ ప్లాన్ల ద్వారా మ‌దుపు చేయండి

మ్యూచువ‌ల్ ఫండ్ల ఏజెంట్లు, బ్రోక‌ర్ల‌కు క‌మీష‌న్ రూపంలో డ‌బ్బుల‌ను చెల్లిస్తూ పోతూ ఉంటే, అది మీ రాబ‌డుల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అందుకే డైరెక్ట్ ఫ్లాన్ల ద్వారా మ‌దుపు చేయ‌డం మంచిది. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు లేదా ఏఎమ్‌సీల వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

డైరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్లు త‌క్కువ వ్య‌య నిష్ప‌త్తితో ఎక్కువ రాబ‌డులు, అధిక నిక‌ర విలువ స‌గటు(ఎన్ఏవీ)ల‌ను అందిస్తాయి. మార్కెట్ల‌లో ఏ ఫండ్లు మంచివ‌న్న స‌మాచారం అందించ‌డానికి ప్ర‌స్తుతం ఎన్నో ర‌కాల వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మ‌దుప‌రులు వాటిని సంద‌ర్శించి త‌మ ల‌క్ష్యాల‌కనువైన ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

  1. పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షిస్తుండండి

ఆర్థిక ల‌క్ష్యాల‌ను నెరవేర్చుకునేందుకు పెట్టుబ‌డులలో వైవిధ్య‌త‌ను పాటించాల్సి ఉంటుంది. మార్కెట్ల క‌ద‌లిక‌ల‌క‌నుగుణంగా మీ పెట్టుబ‌డుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తుండండి. కేవ‌లం పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవ‌డంతోనే మీ ప‌ని అయిపోయిన‌ట్లు కాదు. మీ పెట్టుబ‌డులు మీకు స‌రైన రాబ‌డులు ఇస్తున్నాయా లేదా అన్న విష‌యాల‌ను తెలుసుకోవ‌డం కోసం వాటిని క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాలి. అలాగే జీవితంలో అనుకోకుండా సంభ‌వించే ప‌రిణామాల‌క‌నుగుణంగా మీ పెట్టుబ‌డుల‌ను స‌ర్దుబాటు చేసుకుంటూ ఉండండి.

ఫండ్ ప‌నితీరును విశ్లేషించేందుకు, ఆ ఫండ్ ప్ర‌స్తుత ప‌నితీరును, ప్రామాణిక సూచీల‌తో పోల్చి చూస్తూ ఉండండి. గ‌త 2-3 ఏళ్లుగా ఒక ఫండ్ ప‌నితీరు త‌క్కువ‌గా ఉందా లేదా ఫండ్ నిర్వాహ‌కులు/మేనేజ‌ర్ల‌ను మార్చారా అన్న విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోండి. మీ ప్ర‌స్తుత ఫండ్ ప‌నితీరు ఆశాజ‌న‌కంగా లేక‌పోతే మంచి రాబ‌డుల‌నిచ్చే వేరే ఫండ్ల‌లోకి మారండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని