Insurance: ఫ్రీ-లుక్ పిరియ‌డ్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి? 

 పాల‌సీ కొనుగోలు చేసిన త‌రువాత కూడా స‌మీక్షించుకునేందుకు ఇదొక మంచి అవ‌కాశం

Updated : 04 Sep 2021 16:33 IST

ఇటీవ‌లె జీవిత‌/ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్నారా? బీమా సంస్థ అందించే సేవ‌ల‌తో సంతృప్తిగా ఉన్నారా? లేదు అంటే పాల‌సీ తిరిగి ఇచ్చేయ‌చ్చు. బీమా నియంత్ర‌ణ ప్రాదికార సంస్థ‌.. ఐఆర్‌డీఏ బీమా పాల‌సీల‌పై ఫ్రీ-లుక్ పిరియ‌డ్ ఆప్ష‌న్‌ను పాల‌సీదారుల‌కు అందిస్తుంది. పాల‌సీ కొనుగోలు చేసిన త‌రువాత కూడా స‌మీక్షించుకునేందుకు పాల‌సీదారుల‌కు ఇదొక మంచి అవ‌కాశంగా చెప్ప‌చ్చు. పాల‌సీ కొనుగోలు చేసిన త‌రువాత పాల‌సీ న‌చ్చ‌క‌పోయినా, బీమా సంస్థ అందించే సేవ‌ల‌తో సంతృప్తిగా లేక‌పోయినా నిర్థిష్ట స‌మ‌యంలో పాల‌సీని ర‌ద్దు చేసుకోవ‌చ్చు. 

ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంది?
పాల‌సీని ప‌త్రాల రూపంలో అందుకున్నా లేదా డిజిటల్ రూపంలో ఈ-మెయిల్ ద్వారా అందుకున్నా.. ప‌త్రాలు మీకు చేరిన త‌ర్వాత నుంచి ఫ్రీ-లుక్ పీరియ‌డ్ ప్రారంభ‌మ‌వుతుంది. పాల‌సీ డాక్యుమెంట్ అందిన త‌ర్వాత 15 రోజుల్లో రిట‌ర్న్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో పాల‌సీ తీసుకుంటే 30 రోజుల్లోపు తిరిగి ఇవ్వ‌చ్చు. వినియోగ‌దారుల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏ ఈ కాలాన్ని ఫ్రీ లుక్ పీరియ‌డ్‌గా ప్ర‌క‌టించింది. బీమా నిబంధ‌న‌ల్లో దీనిని త‌ప్ప‌నిస‌రి చేసింది.

ర‌ద్దు చేసుకుంటే ఛార్జీలు..
ఫ్రీ లుక్ పీరియ‌డ్‌లో పాల‌సీని ర‌ద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో చెల్లించిన ప్రీమియంను తిరిగి చెల్లిస్తుంది. అయితే కొన్ని ఛార్జీల(రిస్క్ ప్రీమియం, వైద్య ప‌రిక్ష‌ల‌కు అయిన ఖ‌ర్చులు, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు) ను ప్రీమియం నుంచి మిన‌హాయించి మిగిలిన మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. 

ఎలా ర‌ద్దు చేయాలి?
ఫ్రీ-లుక్ పీరియడ్‌లో, పాలసీని రిటర్న్ చేయాల‌నుకుంటే..  కస్టమర్ కేర్‌కు కాల్ చేయ‌డం ద్వారా లేదా బీమా సంస్థకు ఇమెయిల్ పంపడం ద్వారా పాల‌సీ ర‌ద్దు విష‌యాన్ని బీమా సంస్థ‌కు తెలియ‌ప‌రచాలి. ఒరిజిన‌ల్ పాల‌సీ బాండ్‌, మొద‌టి ప్రీమియం ర‌శీదు, పాల‌సీదారుడి గుర్తింపు ప‌త్రం, పాల‌సీదారుడి క్యాన్సిల్ అయిన చెక్కు వంటి అన్ని ప‌త్రాల‌ను పంపిన త‌రువాత మాత్ర‌మే ర‌ద్దు ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. బీమా సంస్థ‌ ఎండార్స్‌మెంట్ పంపి, 7 పనిదినాల్లో ప్రీమియం తిరిగి చెల్లిస్తుంది.  

ఈ ఫ్రీ లుక్ పీరియ‌డ్ పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టినుంచి ప్రారంభ‌మ‌వుతుంది. క‌నీసం మూడేళ్ల కాల‌ప‌రిమితి ఉన్న ఆరోగ్య‌, జీవిత బీమా పాల‌సీల‌కు ఇది ఉంటుంది. ఈ గ‌డువులోగా పాల‌సీదారుడు స‌మీక్షించుకోక‌పోతే ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఈ గ‌డువు దాటిన త‌ర్వాత ర‌ద్దు చేసుకుంటే ప్రీమియం రీఫండ్ చేయ‌రు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని