సిప్ VS ఈఎమ్ఐ... హాలిడే ప్లానింగ్‌కు ఏది మంచిది?

ఈఎమ్ఐలో వ‌డ్డీ మ‌నం చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అదే సిప్‌లో అయితే మ‌న‌కే వ‌డ్డీ ల‌భిస్తుంది.​​​​​​....

Published : 19 Dec 2020 10:45 IST

ఈఎమ్ఐలో వ‌డ్డీ మ‌నం చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అదే సిప్‌లో అయితే మ‌న‌కే వ‌డ్డీ ల‌భిస్తుంది.​​​​​​​

గ‌త సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి నెల‌లో సంతోష్ (40) అనే వ్య‌క్తి కుటుంబంతో క‌లిసి అండ‌మాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని ప్లాన్ వేసుకున్నాడు. అయితే కేవ‌లం రెండు నెల‌ల‌కు ముందుగానే ఈ ప‌ర్య‌ట‌న గురించి ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం ఖ‌ర్చు రూ.50 వేలు అవుతుంద‌ని అంచ‌నా వేసాడు. కుటుంబంలో మొత్తం భార్య‌, భ‌ర్త‌ ఒక చిన్న పాప ఉంది. అయితే వెళ్లాక మొత్తం ఖ‌ర్చు చూసుకుంటే అంచ‌నా వేసిన‌దానికంటే రెట్టింపుగా అంటే రూ.1.12 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయ్యాయి. దానిని అత‌డు క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐల రూపంలో తిరిగి చెల్లించాడు. మొత్తం పూర్త‌య్యేస‌రికి వ‌డ్డీ, ఇత‌ర ఛార్జీల‌తో క‌లిపి ఇది రూ.1.33 ల‌క్ష‌ల‌కు చేరింది. సంతోష్ క్రెడిట్ కార్డు కంపెనీని వ‌డ్డీ రేట్ల గురించి ఆరా తీయగా, అక్టోబ‌ర్‌లో వ‌డ్డీ రేట్లు 1.36 శాతం ఉండ‌గా రెండు నెల‌ల త‌ర్వాత అత‌ను 12 నెల‌లకు ఈఎమ్ఐ రూపంలో తిరిగి చెల్లించేనాటికి అవి 1.59 శాతానికి చేరాయి. దీంతో పాటు అద‌నంగా ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తించాయి. చివ‌ర‌గా అత‌డు వార్షికంగా 19 శాతం అంటే రూ.21 వేలు ఎక్కువ‌గా చెల్లించాల్సి వ‌చ్చింది. ముందుగా ప్లాన్ చేసుకోకుండా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం ద్వారా న‌గ‌దును స‌మ‌కూర్చుకోలేదు. అదే 6 నుంచి 12 నెల‌లు ముందు నుంచి హాలిడే ప్లాన్ చేసుకుంటే ఈ ఇబ్బందులు ఎదుర‌య్యేవి కావు.

అత‌డు అదే స‌మ‌యంలో ఉద్యోగం మానేయ‌డం వ‌ల‌న ఈఎమ్ఐ ఆప్ష‌న్ ఎంచుకోవాల్సి వ‌చ్చింది. పెట్టుబ‌డుల నుంచి డ‌బ్బును కూడా విత్‌డ్రా చేసుకోవాల‌నుకోవ‌డం లేదు. ఎందుకంటే అవి అత‌డు బిజినెస్ ప్రారంభించేందుకు పెట్టుబ‌డిగా పెట్టాడు. ఇప్ప‌టినుంచి ఏదైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌నుకుంటే ముందుగా ప్ర‌ణాళికా వేసుకుంటామ‌ని అత‌నికి ఎదురైన అనుభ‌వం గురించి చెప్తున్నాడు. దాని కోసం డ‌బ్బును పొదుపు చేసుకుంటాన‌ని ఈఎమ్ఐల‌కు బ‌దులుగా సిప్‌ల రూపంలో పొదుపు చేసుకోవ‌డం మేల‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ లిమిటెడ్ ప‌ర్య‌ట‌న‌ల కోసం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.7 వేల వ‌ర‌కు రుణ అందిస్తుంది. దీంతో పాటు ఎల‌క్ర్టానిక్ వ‌స్తువులు, ఫ‌ర్నీచ‌ర్‌, వ‌స్ర్తాల కొనుగోళ్ల‌కు కూడా ఈఎమ్ఐల‌ రూపంలో చెల్లించ‌వ‌చ్చు.

ప్ర‌ణాళిక లేక‌పోతే ఎదుర‌య్యే క‌ష్టాలు:

ప‌ని ఒత్తిడి కార‌ణంగా చాలామంది ముందస్తుగా ఎలాంటి ప్ర‌ణాళిక‌లు చేసుకునేందుకు వీలుండ‌క‌పోవ‌చ్చు. మ‌రికొన్ని సార్లు అనుకోకుండా నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంది. అలాంటి స‌మ‌యాల్లో ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చు రావొచ్చు. అలాంట‌ప్పుడు క్రెడిట్ కార్డుతో ఈఎమ్ఐ రూపంలో బ్యాంకుల‌కు చెల్లిస్తుంటారు. రూ.1.5 ల‌క్ష‌లు హాలిడే కోసం ఖ‌ర్చు చేస్తే దానిని 12 నెల‌ల‌కు క్రెడిట్ కార్డు లోన్‌గా మార్చుకొని ఈఎమ్ఐల రూపంలో 13 శాతం వ‌డ్డీతో చెల్లిస్తే అది పూర్త‌య్యేనాటికి రూ.1,60,771 కి చేరుతుంది. అంటే అస‌లు ఖ‌ర్చు కంటే రూ.10,800 ఎక్కువ‌గా చెల్లించాల్సి వ‌స్తుంది. అదే 24 నెల‌ల‌కు చెల్లిస్తే వ‌డ్డీ రేట్లు 15 శాతం అవుతుంది. అంటే మొత్తం రూ.24,500 అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ‌కాలం పొడ‌గిస్తే అంత ఎక్కువ‌గా చెల్లించాల్సి వ‌స్తుంది.

చాలా మంది ఈఎమ్ఐ ఆప్ష‌న్ ఎంచుకునేముందు ఎక్కువ‌గా ఆలోచించ‌రు. అవస‌రానికి డ‌బ్బు స‌మ‌కూర‌తుందా లేఆ అన్న‌దే చూస్తారు. డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం ఒక అల‌వాటుగా మారిపోయి నియంత్ర‌ణ లేకుండా పోతుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు వ‌స్తువుల కొనుగోళ్ల మీద ఈఎమ్ఐ ఆప్ష‌న్‌ ను క‌ల్పిస్తాయి. దీంతో వినియోగ‌దారులు అవ‌స‌రం లేక‌పోయినా ఆ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి ఈఎమ్ఐలు చెల్లిస్తుంటారు.

పొదుపు కోసం ప్ర‌త్యేకంగా…

మీరు ప్లాన్ చేయ‌కుండా అప్ప‌టిక‌ప్పుడే నిర్ణ‌యాలు తీసుకునేవారైతే, ఎక్కువ‌గా డ‌బ్బును ఖ‌ర్చు చేసేవారైతే డ‌బ్బు పొదుపు చేసుకునేందుకు ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేసుకోండి. సిప్‌ల రూపంలో పొదుపు చేసుకుంటే మ‌రింత మంచిది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ప్ర‌తి నెలా సిప్ ద్వారా రూ.12,050 పొదుపు చేస్తున్న‌ట్ల‌యితే 7 శాతం రాబ‌డిని అంచ‌నా వేస్తే సంవ‌త్సరానికి రూ.1,50,000 అవుతుంది. హాలిడేకి వెళ్లేందుకు ఇంకా ఎక్కువ స‌మ‌యం ఉంటే అంత‌కంటే త‌క్కువ‌గా సిప్ చేసుకోవ‌చ్చు. ముందు నుంచి ప్ర‌ణాళిక వేసుకుంటే త‌క్కువ మొత్తం పెట్టుబ‌డుల‌తో ఎక్కువ మొత్తం పొదుపు చేయ‌వ‌చ్చు.

ఈఎమ్ఐలో వ‌డ్డీ మ‌నం చెల్లించాల్సి వ‌స్తుంది. అదే సిప్‌లో అయితే వ‌డ్డీ మ‌న‌కు ల‌భిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకోండి. అందుకే ముందస్తు ప్ర‌ణాళితో ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మైతే పొదుపు ప్రారంభించి దానిమీద లాభం పొంద‌వ‌చ్చు. మీరు వెళ్లే ప్రాంతం గురించి కూడా ఉన్న స‌మ‌యంలో పూర్తిగా వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. టిక్కెట్లు కూడా ముందుగా బుక్ చేసుకుంటే త‌క్కువ ధ‌ర‌కు ల‌బిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని