భవిష్యతరం సాంకేతికతలే కీలకం: విప్రో

భవిష్య తరం సాంకేతికతలైన డేటా, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాలే ఐటీ రంగానికి చోదకశక్తిగా మారతాయని విప్రో సీఈఓ థైరీ డెలాపోర్ట్‌ అన్నారు. క్లౌడ్‌ వాడకం

Updated : 22 Jun 2021 11:21 IST

దిల్లీ: భవిష్య తరం సాంకేతికతలైన డేటా, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాలే ఐటీ రంగానికి చోదకశక్తిగా మారతాయని విప్రో సీఈఓ థైరీ డెలాపోర్ట్‌ అన్నారు. క్లౌడ్‌ వాడకం ఇష్టమా-కాదా అనేది పోయి,  డిజిటల్‌ పరివర్తనలో తప్పనిసరి అవసరంగా మారిందని విప్రో 2020-21 వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. ఎక్కడి నుంచైనా పని, క్రౌడ్‌సోర్సింగ్‌ లాంటి పని విధానాలతో.. సంస్థల్లో సైబర్‌ సెక్యూరిటీ ప్రాధాన్యం పెరిగిందన్నారు. కంపెనీ ఐదు సూత్రాల విధానంతో ‘బోల్డర్‌ టుమారో’ని నిర్మించేందుకు ముందుకెళ్తోందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా, ఐరోపా, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియా, భారత్‌లలో కొన్ని సంస్థలను స్వాధీనం చేసుకున్నామని, దీనిద్వారా ఆయా దేశాల్లో స్థానికంగా బలోపేతం అయినట్లు వెల్లడించారు. కాప్కో స్వాధీనం కోసం పెట్టిన రూ.10,500 కోట్లే (1.45 బిలియన్‌ డాలర్లు) తమ అతి పెద్ద పెట్టుబడిగా తెలిపారు. ఆర్థిక సేవల మార్కెట్లో బలోపేతం అయ్యేందుకు ఇది దోహద పడుతుందన్నారు. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోని సంస్థల స్వాధీనం వల్ల సేవల రంగంలోనూ విప్రో తనదైన ముద్ర వేయనుందని వివరించారు.

32,288 డాలర్లకు బిట్‌కాయిన్‌

టోక్యో: సిచువాన్‌ ప్రావిన్స్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ విస్తరణపై చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో సోమవారం క్రిప్టోకరెన్సీలు డీలా పడ్డాయి. బిట్‌ కాయిన్‌ విషయానికే వస్తే జూన్‌ 8 తర్వాత తొలిసారిగా 32,288 డాలర్ల కనిష్ఠ స్థాయికి చేరింది. జూన్‌ 8న బిట్‌ కాయిన్‌ 32,781 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. మరో క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్‌ మే 23 తర్వాత తొలిసారిగా 2000 డాలర్ల దిగువకు చేరింది.

ఎన్‌సీఎల్‌టీ ఆమోదం లభించిన 6 నెలల్లో కార్యకలాపాలు: జెట్‌ ఎయిర్‌వేస్‌

దిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలను ఆపేసిన తరవాత, వివిధ విమానాశ్రయాల్లో ఆ సంస్థకు ఉన్న సమయాలను (స్లాట్లను) ప్రభుత్వం ఇతర విమానయాన సంస్థలకు కేటాయించింది.
దివాలా స్మృతిని ఎదుర్కొంటున్న సంస్థ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించాల్సి ఉంది. అది లభిస్తే 6 నెలల్లోపు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొత్త యాజమాన్యమైన కాల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ఈ మేరకు ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు సమాచారం. వివిధ విమానాశ్రయాల్లో స్లాట్ల లభ్యతపై ఆరా తీయడమే కాక, పాత సమయాలకు 15 నిమిషాలు అటు ఇటుగా కొత్త స్లాట్లు పొందాలన్నది సంస్థ యత్నం.

ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ వద్ద ఉన్న 11 విమానాల స్థానంలో కొత్త, ఇంధన సామర్థ్యం కలిగిన విమానాలతో భర్తీ చేయాలన్నది ప్రణాళిక. అయిదేళ్ల కాలానికి లీజుపై విమానాల కోసం ఎయిర్‌బస్‌, బోయింగ్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. 30 విమానాశ్రయాలు తమ వద్ద 170 జతల స్లాట్లు అందుబాటులో ఉన్నాయని జెట్‌ ఎయిర్‌వేస్‌ నూతన యాజమాన్యానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రీమియర్‌ ఎనర్జీ కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఉపయోగించే పీవీ సెల్స్‌, మాడ్యూల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రీమియర్‌ ఎనర్జీస్‌ హైదరాబాద్‌లోని ఇ-సిటీలో రూ.483 కోట్లతో నెలకొల్పిన ప్లాంటులో తయారీ కార్యకలాపాలను ప్రారంభించింది. 25 ఎకరాల ప్లాంటులో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభమైందని వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిరంజీవ్‌ సాలుజా తెలిపారు. జులై నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ సంస్థకు 1.25 గిగావాట్‌ మాడ్యూల్‌, 0.75 గిగావాట్‌ సెల్‌ తయారీ సామర్థ్యం ఉంది.

ఆర్థిక ఉత్పత్తుల ధరలు పారదర్శకంగా ఉండాలి
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రవిశంకర్‌

దిల్లీ: అవకతవకలను తగ్గించాలంటే ఆర్థిక ఉత్పత్తులు, సేవల ధరలను పరిశ్రమ పారదర్శకంగా నిర్ణయించాల్సిన అవసరం ఉందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ టి.రవి శంకర్‌ సూచించారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఉచిత సేవల విషయంలో కూడా ఛార్జీలు పడుతున్నాయని  అన్నారు. ఆర్థిక రంగంలో ఉత్పత్తులను గంపగుత్తగా విక్రయించడం వల్ల వినియోగదారు కంటే విక్రేత లబ్ధి పొందుతాడని, అవకతవకలకు అవకాశాలు పెరుగుతాయని, నియంత్రణ సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేస్తున్నానని, ఆర్‌బీఐ తరఫున చేయడం లేదని స్పష్టం చేశారు. డిజిటల్‌ చెల్లింపుల పరిశ్రమ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, అయితే కొన్ని అంశాల్లో అంతర్జాతీయ స్థాయులకు చేరిందని అన్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు భద్రమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రవిశంకర్‌ పేర్కొన్నారు.

ఎఫ్‌డీఐల్లో అయిదో స్థానం (లేదా) భారత్‌కు రూ.4.75 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
2020 కరోనా పరిస్థితుల్లో: ఐరాస

ఐరాస: ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ చుట్టుముట్టిన 2020లోనూ భారత్‌కు రూ.4,74,713 కోట్లు (64బిలియన్‌ డాలర్లు) విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో వచ్చాయని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) తెలిపింది. ఎఫ్‌డీఐలను భారీగా అందుకున్న దేశాల్లో భారత్‌ అయిదో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపినప్పటికీ మొత్తం మీద పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సోమవారం విడుదల చేసిన ‘ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2021’లో అభిప్రాయపడింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌డీఐలు రూ.111లక్షల కోట్లు (1.5 ట్రిలియన్‌ డాలర్లు) కాగా కరోనా ప్రభావంతో 2020లో అవి రూ.74లక్షల కోట్ల(ట్రిలియన్‌ డాలర్ల)కు పరిమితమయ్యాయి. అదే సమయంలో భారత్‌లో ఎఫ్‌డీఐలు 27శాతం వరకు పెరిగాయని నివేదిక వివరించింది. 2019లో మనదేశానికి వచ్చిన ఎఫ్‌డీఐలు రూ.3.78 లక్షల కోట్లు (51బిలియన్‌ డాలర్లు) మాత్రమే. ఇక్కడి సమాచార, సాంకేతిక(ఐసీటీ) పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. డిజిటల్‌ మౌలిక వసతులు, సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ అధికమవడం కూడా ఇందుకు దోహదం చేసినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు