Updated : 18 Apr 2021 09:24 IST

ఔషధ రంగంలోకి గెయిల్‌!

 ఏపీఐల తయారీకి యోచన
 పెట్టుబడులు, వ్యాపార ప్రణాళికల కోసం ఐక్యూవీఐఏ అనుబంధ సంస్థ సాయం

ప్రభుత్వ రంగ సహజవాయువు (గ్యాస్‌) పంపిణీ సంస్థ గెయిల్‌ ఇండియా ఔషధ రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉంది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంగ్రేడియంట్స్‌ను (ఏపీఐ) గెయిల్‌ తయారు చేయాలని అనుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఔషధాలు, ఫార్ములేషన్లు, ఇంటర్మీడియట్స్‌ తయారీలో ఏపీఐలను ముడి సరకుగా ఉపయోగిస్తారు. ఏయే ఏపీఐలు తయారు చేయాలి, ఎంత మేర పెట్టుబడులు పెట్టాలనే అంశాలను గెయిల్‌ ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి.

15 ఏపీఐల గుర్తింపుపై కసరత్తు

ప్రతిపాదిత ఔషధ ప్రాజెక్టుకు సంబంధించి వ్యాపార ప్రణాళిక, పెట్టుబడులపై సలహాలు ఇచ్చేందుకు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన ఐక్యూవీఐఏకు చెందిన భారత అనుబంధ సంస్థను గెయిల్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యూవీఐఏ ఇంక్‌.. లైఫ్‌సైన్సెస్‌పై సలహాలు, సూచనలు చేసే సంస్థ. ఔషధ డేటా కంపెనీ ఐఎంఎస్‌ హెల్త్‌, క్వింటైల్స్‌ విలీనంతో ఈ సంస్థ ఏర్పడింది. ఒక గ్యాస్‌ పంపిణీ సంస్థ తయారు చేయగల కనీసం 15 అత్యవసర ఏపీఐలను గుర్తించే బాధ్యతను భారత్‌లోని ఐక్యూవీఐఏ ఇంక్‌ అనుబంధ సంస్థకు గెయిల్‌ అప్పగించింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల అవసరాలపై గెయిల్‌తో సంప్రదింపులు జరిపి, 15 ఉత్పత్తులను ఆ సంస్థ ఎంపిక చేస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఆగస్టు కల్లా ప్రణాళిక ఖరారు

తొలి విడత వ్యాపార ప్రణాళిక కింద పోటీ విధాన మదింపు, కొనుగోళ్లకు అవకాశాలు, వ్యూహాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన సూచనలను గెయిల్‌కు ఈ సంస్థ అందించనుంది. రెండో విడతలో ప్లాంటు సామర్థ్యం, రసాయన ప్రక్రియ ఎంపిక, మూలధనం, నిర్వహణ వ్యయాలు, స్థల అవసరాలు, ప్రాజెక్టు వ్యయంపై విశ్లేషణ, అమలు ప్రణాళికలను సిఫారసు చేస్తుంది. తుది నివేదికను ఆగస్టు కల్లా అందజేస్తుందని ఆ వర్గాలు  వెల్లడించాయి.

అంకురాల్లోనూ పెట్టుబడులు

ఔషధ రంగానికి అవసరమైన ముడి సరుకుల విషయంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతోనే ఔషధ రంగంలో అడుగుపెట్టాలని గెయిల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గెయిల్‌ ఔషధ వ్యాపారం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఔషధ విభాగ  నియంత్రణ పరిధిలోకి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని రంగాల్లోని అంకురాల్లోనూ గెయిల్‌ పెట్టుబడులు పెట్టనుంది. సహజవాయువు, పెట్రోరసాయనాలు, ఇంధనం, ప్రాజెక్టు నిర్వహణ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా మైనింగ్‌, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, నానో మెటీరియల్స్‌ లాంటి రంగాల్లోని అంకుర సంస్థల నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను కూడా ఇప్పటికే గెయిల్‌ ఆహ్వానించింది కూడా.

ఐదింటిలో రెండు సంస్థల మూసివేత

ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఔషధ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకోవడం ఆసక్తికర పరిణామం. ఎందుకంటే.. ప్రభుత్వ రంగంలోని ఐదు ఔషధ రంగ సంస్థల్లో రెండింటిని- ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, రాజస్థాన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను ప్రభుత్వం మూసివేసింది. మరో మూడింటిలో- హిందుస్థాన్‌ యాంటీ బయాటిక్స్‌, బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, కర్ణాటక యాంటీ బయాటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌లో వాటాలను ఉపసంహరించింది.

దూసుకెళ్లిన షేర్లు..

ఏడాదికాలంలో ఏపీఐలను తయారు చేసే సంస్థల షేర్లు మదుపర్లకు ఆకర్షణీయ ప్రతిఫలాలను పంచాయి. లారస్‌ ల్యాబ్స్‌, ఆర్తి డ్రగ్స్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, ఐఓఎల్‌ కెమికల్స్‌ లాంటి సంస్థల షేర్లు 100-300% వరకు లాభాలను తెచ్చిపెట్టాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని