5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ లక్ష్యం మూడేళ్లు వెనక్కి

కరోనా సంక్షోభం వల్ల 2019-20తో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 15.7 శాతం క్షీణించింది. అందువల్ల 5 లక్షల కోట్ల ...

Published : 23 Mar 2021 12:11 IST

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదిక

ముంబయి: కరోనా సంక్షోభం వల్ల 2019-20తో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 15.7 శాతం క్షీణించింది. అందువల్ల 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగడం మూడేళ్లు ఆలస్యమై 2031-32కు సాకారం కావచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం భారత్‌ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ వెనుక ఉంది. 2030 నాటికి 5 లక్షల డాలర్లతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ‘2031-32 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచే అవకాశం ఉంది. ఇంతకు ముందు 2028-29 నాటికే ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ.. కరోనా సంక్షోభం ప్రతికూలంగా మారింది. 9 శాతం వృద్ధితో అయితే 2031 నాటికి, 10 శాతం వృద్ధితో 2030కి జపాన్‌ జీడీపీ (డాలర్ల ప్రాతిపదికన)ని తాకొచ్చు’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ పేర్కొంది. అయితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం వివరాలను నివేదిక వెల్లడించలేదు. 2019-20లో భారత ఆర్థిక వ్యవస్థ 2.65 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఇక 2020లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.87 లక్షల కోట్ల డాలర్లు కావడం గమనార్హం. 6 శాతం వాస్తవిక వృద్ధి, 5 శాతం ద్రవ్యోల్బణం, 2 శాతం రూపాయి క్షీణతలను పరిగణనలోకి తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. 2027-28 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని 2017లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా వేసింది. స్థిరమైన వృద్ధికి ముడిచమురు ధరలు ఒక్కటే అడ్డంకిగా అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని