GDP: అంకెలు చూసి.. అధిక వృద్ధి అనుకోవద్దు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో దేశ జీడీపీ వృద్ధి రేటు 20 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని రే

Published : 19 Aug 2021 12:57 IST

ఏప్రిల్‌- జూన్‌లో 20 శాతం నమోదు కావచ్చు 
2020-21 తక్కువ ప్రాతిపదిక వల్లే:  ఇక్రా 

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో దేశ జీడీపీ వృద్ధి రేటు 20 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అయితే ఈ అంకెలు చూసి.. ఆహా ఏమి వృద్ధి అని అనుకోవడానికి లేదని, కొవిడ్‌-19 ముందు స్థాయిలతో పోలిస్తే ఇది తక్కువగానే ఉంటుందని పేర్కొంది. 2020-21 ఇదే కాలంలో తక్కువ ప్రాతిపదిక (బేస్‌ ఎఫెక్ట్‌) ఉండటంతో, ఈసారి అధికంగా కనపడనుందని పేర్కొంది. ఏడాది క్రితం ఏప్రిల్‌- జూన్‌లో ఆర్థిక వ్యవస్థ 24 శాతం క్షీణించిన సంగతి విదితమే. అప్పటితో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ వృద్ధి రేటుపై కొవిడ్‌-19 రెండో దశ పరిణామాల ప్రభావం పడినట్లుగా కన్పించకపోవచ్చని ఇక్రా విశ్లేషించింది. ప్రభుత్వం మూలధన వ్యయ కేటాయింపులను పెంచడం, ఎగుమతులు పుంజుకోవడం, వ్యవసాయరంగంలో అధిక గిరాకీ వల్ల ఏప్రిల్‌- జూన్‌లో జీడీపీ వృద్ధి రేటు 20 శాతంగాను, స్థూల విలువ జోడింపు (జీవీఏ) 17 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2020-21 మార్చి త్రైమాసికంతో పోలిస్తే, జూన్‌ త్రైమాసిక జీవీఏ -15 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది. కొవిడ్‌-19 పరిణామాలు ఎంతలా ప్రభావం చూపాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని తెలిపింది. 

అన్ని రంగాల్లోనూ పురోగతి.. భేష్‌ భారత్‌కు క్రిసిల్‌ ‘సానుకూల’ రుణ రేటింగ్‌

దేశీయంగా రంగాలన్నీ పుంజుకుంటున్నాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో దేశ రుణ రేటింగ్‌ను ‘సానుకూలాని’కి (పాజిటివ్‌) మార్చింది. అంతకుముందు ‘కాషియస్లీ ఆప్టిమిస్టిక్‌’ (ఆశావహమే కానీ, అప్రమత్తత అవసరం) రేటింగ్‌ ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారత రుణ నిష్పత్తి 2.5 రెట్లకు పెరిగిందని క్రిసిల్‌ పేర్కొంది. 2020-21 రెండో అర్ధభాగంలో ఇది 1.33 రెట్లుగా ఉండేదని తెలిపింది. ఆర్థిక రంగం మినహా 43 రంగాలపై అధ్యయనం చేశామని, మొత్తం రూ.36 లక్షల కోట్ల రుణాల్లో 75 శాతం వరకు ఈ రంగాలవేనని క్రిసిల్‌ తెలిపింది. అన్ని రంగాలు సమానంగా పుంజుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా 28 రంగాలు గిరాకీ పరంగా కొవిడ్‌-19 ముందు స్థాయిలకు పూర్తిగా చేరుకుంటాయని పేర్కొంది. మిగిలిన రంగాల్లో 85 శాతం మేర పుంజుకుంటాయని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సానుకూల పరిస్థితులు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉండటం, కొవిడ్‌-19 మూడో దశ వచ్చినా గిరాకీపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చనే అంచనాలతో రేటింగ్‌ను పెంచినట్లు ఇక్రా ముఖ్య రేటింగ్‌ అధికారి సుబోధ్‌రాయ్‌ తెలిపారు. 

ఏయే రంగాల్లో రేటింగ్‌ పెంపు ఉండొచ్చంటే.. 
ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడంతో నిర్మాణ, ఇంజినీరింగ్, పునరుత్పాదక విద్యుత్‌ రంగాలు ప్రయోజనం పొందుతాయని.. ఉక్కు, లోహ రంగాలకు ధరల పెంపు కలిసొస్తుందని క్రిసిల్‌ తెలిపింది. దేశీయంగా గిరాకీకి తోడు, ఎగుమతుల్లో వృద్ధి వల్ల ఔషధ, స్పెషాలిటీ కెమికల్స్‌ రంగాలూ రాణిస్తాయని విశ్లేషించింది. పై రంగాల్లోని కంపెనీల్లో రేటింగ్‌ పెంపునకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఆతిథ్య, విద్యా రంగాలపై కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగొచ్చని తెలిపింది. ఈ రంగాల్లో రేటింగ్‌ పెంచడం కంటే తగ్గించడమే ఎక్కువగా ఉండొచ్చని వివరించింది. 
కొవిడ్‌-19 ముందు స్థాయిలకు 

శరవేగంగా ఆర్థిక వ్యవస్థ

కొవిడ్‌-19 మూడో దశ వ్యాప్తిపై స్పష్టత లేకున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 ముందు సాధారణ స్థాయిలకు శరవేగంగా చేరుకుంటోందని ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా అన్నారు. టీకా కార్యక్రమం వేగవంతం అవుతుండటంతో, ఒకవేళ కొవిడ్‌-19 మూడో దశ చోటుచేసుకున్నా భారత్‌ పుంజుకోవడం కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేసేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం పలు రకాల చర్యలను చేపట్టాయని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఏజీఎంలో వాటాదార్లను ఉద్దేశించి మాట్లాడుతూ బిర్లా చెప్పారు. 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంచుమించుగా 10 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బలమైన సంకేతాలుగా భావించవచ్చని తెలిపారు. అల్ట్రాటెక్‌ కూడా సామర్థ్య విస్తరణ నిమిత్తం రూ.6,500 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళికగా పెట్టుకుందని బిర్లా వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని