Gita Gopinath: ఐఎంఎఫ్‌లో కీలక పదవికి గీతా గోపీనాథ్‌ 

తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)లోనూ కీలక పదవిలో ఓ భారత సంతతి ఆడపడచు ఆసీనురాలు కాబోతోంది....

Updated : 03 Dec 2021 12:30 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయంగా రోజురోజుకీ భారతీయుల ప్రతిభ ఇనుమడిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే పలు పెద్ద కంపెనీల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇండియన్స్‌ సత్తా చాటుతున్నారు. ఇటీవలే ఈ జాబితాలో ట్విటర్‌ సీఈఓగా పరాగ్‌ అగర్వాల్‌ చేరి అందరినీ గర్వపడేలా చేశారు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)లోనూ కీలక పదవిలో ఓ భారత సంతతి ఆడపడుచు ఆసీనురాలు కాబోతోంది.

ఇప్పటి వరకు ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్తగా కొనసాగిన గీతా గోపీనాథ్‌కు అదే సంస్థలో ‘డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్(ఎఫ్‌డీఎండీ)‌’ హోదా కల్పించారు. అంటే సంస్థలో ఆమెది రెండో స్థానం. ఈ విషయాన్ని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియేవా గురువారం ప్రకటించారు. వాస్తవానికి గీతా నియామకం అనూహ్యమనే చెప్పాలి. త్వరలో ఆమె పదవీకాలం ముగియనుండడంతో తిరిగి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లి పాఠాలు చెబుతారని అంతా భావించారు. కానీ, కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆమెకు ఒకరకంగా పదోన్నతి కల్పించారు. కొవిడ్‌ కల్లోలంతో అల్లకల్లోలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు. ఈ సమయంలో గోపీనాథ్‌ సేవలు ఐఎంఎఫ్‌కు చాలా అవసరమని భావించారు.

‘‘ఎఫ్‌డీఎండీగా కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు గీతా గోపీనాథ్‌ అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన పనితీరు గురించి చెప్పాల్సిన అసవరం లేదు. అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని దాటడానికి ఆమె అందించిన మేధో నాయకత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఐఎంఎఫ్‌కు ఎంతో సాయం చేసింది. ఐఎంఎఫ్‌ చరిత్రలో మొదటి మహిళా ప్రధాన ఆర్థికవేత్తగా సభ్య దేశాలు, సంస్థలో గౌరవం, ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. విస్తృత శ్రేణి సమస్యలపై కఠినమైన విశ్లేషణాత్మక పనిని సమర్థంగా ముందుకు నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు’’ అని జార్జియేవా అన్నారు. కొత్త బాధ్యతల్లో గోపీనాథ్‌ కీలక కార్యకలాపాలను నిర్వర్తించనున్నారు. నిఘా సంబంధిత విధానాల రూపకల్పనతో పాటు పరిశోధన, ఇతర ప్రచురణలో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా పర్యవేక్షించనున్నారు. గోపీనాథ్‌ నియామకాన్ని అమెరికా స్వాగతించింది.

గీతా గోపీనాథ్‌ గురించి ఆసక్తికర విషయాలు..

* 1971లో కోల్‌కతాలో జన్మించారు. మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.

* దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో బి.ఎ పూర్తి చేశారు. 1992లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనామిక్స్‌ అభ్యసించారు.

* వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎం.ఎ ఎకనామిక్స్‌లో చదివే అవకాశం రావడంతో తన ఐఏఎస్‌ ప్రణాళికలను పక్కన పెట్టేశారు. అనంతరం ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు.

* అక్కడి నుంచి 2010లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఉండగానే 2018లో ఐఎంఎఫ్‌లో పనిచేసే అవకాశం తలుపు తట్టింది.

* గీతా గోపీనాథ్‌కు ఫ్యాషన్‌ రంగంలోనూ అనుభవం ఉంది. దిల్లీ వర్సిటీలో ఆమె తన భర్త ఇక్భాల్‌ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం వీరికి 18 ఏళ్ల రాహిల్‌ అనే అబ్బాయి ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని