Aviation: 2022 తర్వాతే విమానయాన రంగానికి మంచి రోజులు!

2020-22 మధ్య ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం 201 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూసే అవకాశం ఉందని ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ)’ అంచనా వేసింది....

Published : 05 Oct 2021 19:26 IST

బోస్టన్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వ్యాప్తి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో  పెద్ద సంఖ్యలో విమానాలు ఇప్పటికీ నేలకే పరిమితమయ్యాయి. దీంతో అనేక విమానయాన సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. 2020-22 మధ్య ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం 201 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూసే అవకాశం ఉందని ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ)’ అంచనా వేసింది. బోస్టన్‌లో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐఏటీఏ డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్ష్‌ మాట్లాడారు. విమానయాన రంగం సంక్షోభం లోతుల్లో నుంచి క్రమంగా బయటపడుతోందని తెలిపారు. అయితే, కొన్ని కీలక సమస్యల్ని ఇంకా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఇంకా కొన్ని దేశాలు విమానయానంపై పూర్తిస్థాయి నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు.

నష్టాలు క్రమంగా తగ్గుతాయ్‌..

2020లో విమానయాన రంగం 138 బిలియన్‌ డాలర్ల భారీ నష్టాల్ని చవిచూసిందని వాల్ష్‌ తెలిపారు. అది 2021లో 52 బిలియన్ డాలర్లకు తగ్గే అవకాశం ఉందన్నారు. 2022 నాటికి ఆ నష్టాలు మరింత తగ్గి 12 బిలియన్‌ డాలర్లకు పరిమితమవుతాయని అంచనా వేశారు. ఈ రంగం పూర్తిగా లాభాల్లోకి రావాలంటే 2023 వరకు వేచిచూడాల్సిందేనన్నారు. 2020తో పోలిస్తే ఈ ఏడాది ఆదాయాలు 26.7 శాతం పెరిగి 472 బిలియన్ డాలర్లకు(2009 నాటి స్థాయి) చేరుతాయని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఈ పెరుగుదల 39.3 శాతంగా నమోదవుతుందని.. ఆదాయం 658 బిలియన్‌ డాలర్లకు(2011 నాటి స్థాయి) చేరే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ప్రయాణికుల సేవల కార్యకలాపాల నుంచి 227 బిలియన్ డాలర్లు.. 2022లో 378 బిలియన్‌ డాలర్లు సమకూరే అవకాశం ఉందన్నారు.

భారత్‌లో ఇదీ పరిస్థితి..

భారత్‌ విషయానికి వస్తే.. దేశీయంగా విమానయానం క్రమంగా పుంజుకుంటోంది. కరోనా మునుపటితో పోలిస్తే.. ఇప్పటి వరకు 70 శాతం వరకు విమానాలు సేవలు ప్రారంభించినట్లు విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సేవలు మాత్రం ఇంకా ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు కేవలం 20 శాతం విమానాలు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రత్యేక నిబంధనల మధ్య భారత్‌ నుంచి 28 దేశాలకు వైమానిక సేవలు ప్రారంభమయ్యాయి. ఇక ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో నష్టాలు 2021లో 11.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఏటీఏ అంచనా వేసింది. 2022 నాటికి అవి 2.4 బిలియన్‌ డాలర్లకు తగ్గే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

డిజిటలీకరణే ఉత్తమం..

ఇకపై విమాన ప్రయాణికుల వివరాల్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేయాల్సిన అవసరం ఉందని వాల్ష్‌ సూచించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ.. పత్రాల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐరోపా సమాఖ్య వలే ‘ఈయూ డిజిటల్‌ కొవిడ్‌ సర్టిఫికెట్‌ (ఈయూ డీసీసీ)’ తరహా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని