డీఆర్‌డీవో ఆక్సిజన్‌ జనరేటర్లను తయారు చేయనున్న గోద్రెజ్‌

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ఆక్సిజన్‌ జనరేటర్లను ఉత్పత్తి చేసేందుకు  గోద్రెజ్‌ అండ్‌ బాయ్స్‌ (జీ అండ్‌ బీ) సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే 9 సంస్థలు ఆక్సిజన్‌

Updated : 15 Sep 2021 03:39 IST

ముంబయి: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ఆక్సిజన్‌ జనరేటర్లను ఉత్పత్తి చేసేందుకు  గోద్రెజ్‌ అండ్‌ బాయ్స్‌ (జీ అండ్‌ బీ) సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే 9 సంస్థలు ఆక్సిజన్‌ సిలిండర్లను ఉత్పత్తి చేస్తుండగా తాజాగా జీ అండ్‌ బీ సంస్థకు డీఆర్‌డీవో కాంట్రాక్ట్‌ను అప్పగించింది. కొవిడ్‌ రెండో దశ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో రోగుల ప్రాణాలు పోవడంతో.. ఆసుపత్రుల్లోనే ఆక్సిజన్‌ ఉత్పత్తికి కావాల్సిన పరికరాల ఏర్పాటు సాంకేతికతపై డీఆర్‌డీవో దృష్టిపెట్టింది. కొవిడ్‌ మూడో దశ ప్రబలనుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆక్సిజన్‌ లోటు లేకుండా చూసేందుకు సాధ్యమైనంత ఎక్కువ కంపెనీలకు ఆక్సిజన్‌ జనరేటర్ల తయారీ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే  ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ జనరేటర్లను ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం నిమిషానికి 250 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 50 మంది రోగుల అవసరాలను తీరుస్తుంది. ‘డీఆర్‌డీవోతో గతంలోనూ కలిసి పనిచేశాం. వెంటిలేటర్ల తయారీకి అవసరమైన 5వేల వాల్వ్‌లను అందజేశాం. బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థకు అవసరమైన క్లిష్టమైన భాగాలతో పాటూ ఇతరత్రా భాగస్వామ్యాలు ఉన్నాయి’ అని జీ అండ్‌ బీ  తెలిపింది.


విస్తారా కొత్త సీఈఓగా వినోద్‌ కన్నన్‌

ప్రస్తుత సీఈఓ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు

ముంబయి: విస్తారా తన కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా వినోద్‌ కన్నన్‌ను నియమించుకుంది. ప్రస్తుతం ఈయన కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌(సీసీఓ)గా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీఈఓగా ఉన్న లెస్లీ థాంగ్‌ తిరిగి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌(ఎస్‌ఐఏ)లో ఉన్నత పదవి చేపట్టడానికి వెళ్లనున్నారు. ‘విస్తారాకు నాలుగేళ్లకు పైగా సేవలందించిన లెస్లీ జనవరి 1, 2022 నుంచి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో సీనియర్‌ స్థాయి అధికారిగా మారతార’ని విస్తారా తెలిపింది. జనవరి 1, 2022 నుంచే టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ బోర్డు సీఈఓగా కన్నన్‌ బాధ్యతలు చేపడతారు. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మధ్య 51:49 శాతం వాటాలతో ఏర్పడిన సంయుక్త సంస్థే టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని