విద్యా రుణం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారా ?

విద్య కోసం ఏదైనా నిధుల లోటును తీర్చ‌డానికి స‌ర్వ‌సాధార‌ణ‌మైన మార్గం రుణం తీసుకోవ‌డం. 

Published : 10 May 2021 13:17 IST

మీ విద్య కోసం న‌గ‌దు అవ‌స‌రాలు , భ‌విష్య‌త్తులో సంపాదించే డ‌బ్బు, బ్యాంక్‌కు  మీరిచ్చే గ్యారెంటీ ఇవ‌న్నీ రుణ ప్ర‌య‌త్నాల‌కు ముందే ప్ర‌ణాళిక‌లు వేసుకోవాలి. ఉన్న‌త విద్య కోసం రుణ ప్ర‌ణాళిక విష‌యానికొస్తే యువ‌కులు కూడా ప్ర‌స్తుత కోవిడ్‌-19 ప‌రిస్థితుల్లో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. విద్య కోసం ఏదైనా నిధుల లోటును తీర్చ‌డానికి స‌ర్వ‌సాధార‌ణ‌మైన మార్గం రుణం తీసుకోవ‌డం.  ఏదేమైనా, విద్యా రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేయ‌డానికి ముందు, దాని అర్హ‌త ప్ర‌మాణాలు, ప‌న్ను చిక్కులు మొద‌లైన వాటితో స‌హా కొన్ని ముఖ్య విష‌యాల గురించి తెలుసుకోవాలి.

మీరు 18 ఏళ్ల‌లోపు ఉంటే లేదా ఆదాయ వ‌న‌రులు లేక‌పోతే, మీరు మీ త‌ల్లిదండ్రులు లేదా తోబుట్టువుల‌తో స‌హ‌-ధ‌ర‌ఖాస్తుదారులుగా విద్య రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ. 4 ల‌క్ష‌ల వ‌ర‌కు విద్యా రుణాల‌కు గ్యారంటీ అవ‌స‌రం లేదు. రూ. 4 ల‌క్ష‌ల‌కు పైన మ‌రియు రూ. 7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న రుణ మొత్తానికి, స‌హ ధ‌ర‌ఖాస్తుదారుడి ఆదాయం స‌రిపోక‌పోతే బ్యాంక్ గ్యారెంటీ కోర‌వ‌చ్చు.  రూ. 7.5 ల‌క్ష‌ల‌కు మించిన రుణ మొత్తాల‌కు, బ్యాంకుల‌కు సాధార‌ణంగా స‌హ ధ‌ర‌ఖాస్తుదారుడు మ‌రియు త‌గినంత గ్యారెంటీ అవ‌స‌రం. రుణ మొత్త‌నికి త‌గ్గ‌ట్టుగా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి.

విద్యా రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేయ‌డానికి ముందు, విద్యార్ధికి యుజీసీ, ఎఐసిటిఈ, ప్ర‌భుత్వాలు మొద‌లైన గుర్తింపు పొందిన క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి నిర్ధార‌ణ లేఖ కూడా ఉండాలి. ఐఐటీలు, ఐఐఎంలు, వంటి ప్ర‌ధాన స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి రుణం కూడా అనుమ‌తించ‌బ‌డుతుంది. అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల‌కు విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక విదేశీ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి కూడా విద్యా రుణం పొందొచ్చు. విద్యా రుణం క‌ళాశాల‌, పాఠ‌శాల ఫీజులు లేదా ఖ‌ర్చులు, హాస్ట‌ల్ వ‌స‌తి, గ్రంథాల‌యాలు, ప్ర‌యోగ‌శాల‌లు, పుస్త‌కాలు, యూనిఫాంలు, కంప్యూట‌ర్ల కొనుగోలు, ద్విచ‌క్ర వాహ‌నాల కొనుగోలు వంటి ఖ‌ర్చుల‌ను, కోర్సుకు అవ‌స‌ర‌మైన ఇత‌ర ఖ‌ర్చులను విద్యా రుణం క‌వ‌ర్ చేస్తుంది.

రుణంకు ఎంత‌ ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలిః విద్యా రుణం యొక్క ఎగువ ప‌రిమితి కోర్సు లేదా క‌ళాశాల ర‌కాన్ని బ‌ట్టి, రుణ గ్ర‌హీత యొక్క అర్హ‌త‌ను బ‌ట్టి మార‌వ‌చ్చు. ఉదాః భార‌త్‌లో ఏంబీఏ కోర్సు కోసం బ్యాంకులు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం అనుమ‌తించ‌వ‌చ్చు. అయితే మెడిక‌ల్ కోర్సుల‌కు రూ. 80 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ రుణం ఇవ్వ‌వ‌చ్చు. కొన్ని బ్యాంకులు స్ప‌ష్ట‌మైన గ్యారెంటీ ఉంటే 100% విలువ వ‌ర‌కు రుణాన్ని అనుమ‌తిస్తాయి. ఎంత వ‌ర‌కు రుణ మొత్తానికి ధ‌ర‌ఖాస్తు చేయాలి అనే ప్ర‌శ్న వ‌స్తుంది. దీనికి స‌మాధానం జాగ్ర‌త్త‌గా వేసుకోవాలి. మీ ప్ర‌స్తుత అవ‌స‌రాలు, భ‌విష్య‌త్తులో సంపాదించే మొత్తాలు మ‌రియు బ్యాంక్‌కు మీరిచ్చే గ్యారెంటీ ప్ర‌కారం మీరు రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మీ స్వంత వ‌న‌రుల నుండి చెల్లించ‌డానికి మీకు త‌గినంత మొత్తం ఉంటే ఎక్కువ రుణ మొత్తాన్ని తీసుకోకుండా ఉండి రుణ వ‌త్తిడిని సాధ్య‌మైనంత‌వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. అస‌లు, వ‌డ్డీ క‌లిపి క‌ట్టేట‌ప్పుడు మీకు చాలా ఆదా అవుతుంది.

కొన్ని ప్ర‌ముఖ బ్యాంకుల రుణాల‌కు వ‌డ్డీ వివ‌రాలు శాతంలోః

రుణం తిరిగి చెల్లింపుః రుణం తిరిగి చెల్లించ‌డానికి బ్యాంకులు 15 సంవ‌త్స‌రాలు వ‌ర‌కు కూడా టైమ్‌ని ఇస్తాయి. కోర్సు పూర్త‌యిన త‌ర్వాత ఒక సంవ‌త్స‌రం లేదా ఉద్యోగం పొందిన 6 నెల‌ల త‌ర్వాత అంత‌కు ముందే తిరిగి చెల్లించే తాత్కాలిక నిషేధాన్ని /  సెల‌వుల‌ను బ్యాంకులు అనుమ‌తిస్తాయి. తాత్క‌లిక నిషేధ స‌మ‌యంలో వ‌చ్చే వ‌డ్డీని రుణ అస‌లు మొత్తానికి జోడిస్తారు. త‌ద‌నుగుణంగా నెల వాయిదా నిర్ణ‌యించ‌బ‌డుతుంది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలుః స్వ‌యం లేదా జీవిత భాగ‌స్వామి లేదా పిల్ల‌లు కోసం ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో చెల్లించిన వ‌డ్డీని ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ `80 ఇ` కింద ప‌న్ను మిన‌హాయింపుగా పొంద‌వ‌చ్చు.
ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించిన మొత్తం వ‌డ్డీని ప‌న్ను మిన‌హాయింపుగా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని