గోల్డ్ మోనిటైజేష‌న్‌ స్కీమ్‌

భార‌తీయ కుటుంబాల వ‌ద్ద నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని స‌మీక‌రించాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని 2015లో ప్ర‌వేశ‌పెట్టింది....

Published : 21 Dec 2020 17:07 IST

భార‌తీయ కుటుంబాల వ‌ద్ద నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని స‌మీక‌రించాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని 2015లో ప్ర‌వేశ‌పెట్టింది.

మ‌న దేశంలో డిజిట‌ల్ రూపంలో బంగారం కొనుగోలు చేసే వారితో పోలిస్తే ఆభ‌ర‌ణాల రూపంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువని చెప్పాలి. అయితే భౌతికంగా బంగారం కొనుగోలు చేసే వారికి ఎదుర‌య్యే పెద్ద స‌మ‌స్య నిల్వ చేయ‌డం. అయితే ఇందుకోసం చాలా మంది ఆశ్ర‌యించేది బ్యాంకు లాక‌ర్ల‌నే… మ‌రి లాక‌ర్లలో బంగారం నిల్వ చేయ‌డం నిజంగా సుర‌క్షిత‌మేనా? బ‌్యాంకుల‌లో చేసే డిపాజిట్ల‌కు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్‌(డీఐసీజీసీ) రూ.1 ల‌క్ష వ‌ర‌కు క‌వ‌ర్ చేస్తుంది. అయితే బ్యాంకు లాక‌ర్ల‌లో ఉంచే వ‌స్తువుల‌కు ఎలాంటి బీమా వ‌ర్తించ‌దు.

భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని సుర‌క్షితంగా నిల్వ ఉంచేందుకు, రాబ‌డి పొందేందుకు ఉన్న ఏకైక మార్గం ప్ర‌భుత్వం అందించే గోల్డ్ మోనిటైజేష‌న్ ప‌థ‌కం. మీరు చేసే బంగారం డిపాజిట్ల‌పై ఈ ప‌థ‌కం ద్వారా రాబ‌డిని కూడా పొంద‌వ‌చ్చు. అయితే ఇందులో మీరు ఉప‌యోగించ‌ని బంగారాన్ని మాత్ర‌మే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కార‌ణం తిరిగి విత్‌డ్రా చేసుకునేప్పుడు, బ్యాంకులు మీ బంగారాన్ని నాణేలు లేదా బార్ల రూపంలో గాని, బంగారం ప్ర‌స్తుత విలువ‌కు స‌మాన‌మైన మొత్తాన్ని గానీ చెల్లిస్తాయి.

స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌డం ఎలా?
ఈ ప‌థ‌కాన్ని 2015లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. భార‌తీయ కుటుంబాల వ‌ద్ద నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని స‌మీక‌రించాల‌నే ఉద్దేశ్యంతో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.

ఈ ప‌థ‌కంలో స‌భ్య‌త్వం కోసం మీ బంగారాన్ని అధీకృత‌ స్వ‌చ్చ‌త ప‌రీక్ష కేంద్రం(పీటీసీ) వ‌ద్ద ప‌రీక్షించి బంగారం విలువ‌ను సూచించే ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొందాలి. అదే కేంద్రంలో మీ బంగారాన్ని డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

పీటీసీ జారీ చేసిన స‌ర్టిఫికేట్‌ను వారు సూచించిన బ్యాంకు బ్రాంచ్‌లో చూపించాలి. ఆ బ్రాంచిలో మీకు ఇప్ప‌టికే ఖాతా ఉంటే, ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. లేక‌పోతే కొత్త‌గా పొదుపు ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌లో పేర్కొన్న బంగారం విలువకు సమానమైన డిపాజిట్‌గా తీసుకుంటారు. ఈ మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీని మీ పొదుపు ఖాతాలో జ‌మ చేస్తారు.

ఫీచ‌ర్లు:
బంగారాన్ని వివిధ కాల‌ప‌రిమితుల‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఒక‌టి నుంచి మూడు సంవ‌త్స‌రాల కాలాన్ని స్వ‌ల్ప కాలంగానూ, ఐదు నుంచి ఏడు సంవ‌త్స‌రాల కాలాన్ని మ‌ధ్య కాలంగానూ, 12 నుంచి 15 సంవ‌త్స‌రాల కాలాన్ని దీర్ఘ‌కాలంగానూ ప‌రిగ‌ణిస్తారు. మీరు ఎంచుకున్న కాల‌ప‌రిమితిపై వ‌డ్డీ రేటు ఆధార‌ప‌డి ఉంటుంది.
స్వ‌ల్పకాలిక డిపాజిట్ల‌పై అంటే ఒక సంవ‌త్స‌ర కాలానికి వార్షికంగా 0.50 శాతం, ఒక సంవ‌త్స‌రం నుంచి రెండు సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై 0.55శాతం, రెండు సంత్స‌రాల కంటే ఎక్కువ, మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 0.60శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. మ‌ధ్య‌, దీర్ఘ కాలిక డిపాజిట్ల‌పై వార్షికంగా 2.25శాతం వ‌డ్డీని పొంద‌చ్చు.

వార్షికంగా వ‌డ్డీ తీసుకునే వారికి సాధార‌ణ వ‌డ్డీతో, ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చి 31న వ‌డ్డీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తారు. మెచ్యూరిటీ స‌మ‌యంలో తీసుకునే వారికి వ‌డ్డీని వార్షిక ప్రాతిప‌దిక‌న కాంపౌండ్ చేస్తారు. డిపాజిట్ స‌మ‌యంలో వ‌డ్డీ చెల్లింపుల ప‌ద్ధ‌తిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

స్వ‌ల్ప‌కాలంలో డిపాజిట్ చేస్తేనే బంగారాన్ని భౌతిక రూపంలో తిరిగి ఉప‌సంహ‌రించుకోవ‌చ్చ‌ని గుర్తించుకోవాలి. స్వ‌ల్ప కాలంలోడిపాజిట్ చేసిన‌ప్పుడు మీరు బంగారం విలువ‌కు స‌మాన మొత్తాన్ని కూడా పొందేదుకు వీలుంది. చందాదారుడు ఏ విధంగా కావాలంటే… ఆ విధంగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. మ‌ధ్య‌, దీర్ఘ‌కాలిక డిపాజిట్లకు ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల ప్ర‌కారం బంగారం విలువ‌ను న‌గ‌దు రూపంలో చెల్లిస్తారు. భౌతిక బంగారంగా ఉప‌సంహ‌రించుకునేందుకు వీలులేదు.

రాళ్ళు, ఇతర లోహాలను మినహాయించి ముడి బంగారం-బార్లు, నాణేలు, ఆభరణాల రూపంలో కనీసం 30 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేయాలి. ఒక‌వేళ మీరు భౌతికంగా బంగారాన్ని విత్‌డ్రా చేసుకున్న డిపాజిట్ చేసిన రూపంలో బంగారం తిరిగి పొంద‌లేర‌ని గుర్తించుకోవాలి. బ్యాంకులు మీ బంగారాన్ని నాణేలు లేదా బార్ల రూపంలోనే తిరిగి ఇస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని