న‌గ‌దు దుకాణాల‌ పొదుపు ప‌థ‌కాలు సురక్షితమేనా?

న‌గ‌దు దుకాణాల్లో గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ పేరిట అందించే ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం, వాటికి నియంత్ర‌ణ‌లున్నాయా అనే విష‌యాల‌ను తెలుసుకుందాం. దీంతో పాటు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూద్దాం...

Published : 16 Dec 2020 12:12 IST

న‌గ‌దు దుకాణాల్లో గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ పేరిట అందించే ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం, వాటికి నియంత్ర‌ణ‌లున్నాయా అనే విష‌యాల‌ను తెలుసుకుందాం. దీంతో పాటు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూద్దాం.​​​​​​​

11 నెల‌ల వాయిదా చెల్లించండి… 12వ నెల వాయిదా మీ త‌ర‌ఫున మేము చెల్లిస్తాం. 12 నెల‌ల పాటు జ‌మైన సొమ్ముకు స‌మాన‌మైన‌ బంగారాన్ని ప‌ట్టుకెళ్లండి. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు మీరు న‌గ‌ల దుకాణాల్లో చూసే ఉంటారు. చిన్న మ‌దుపరుల‌ను, బంగారం కొనుగోలుదారుల‌ను ఈ ప్ర‌క‌ట‌న విశేషంగా ఆక‌ర్షిస్తోంది. ఇలాంటి పథ‌కాల్లో పెట్టుబ‌డి చాలా అనుకూలంగా అనిపిస్తుంది అందుకే కాబోలు అధిక సంఖ్య‌లో జ‌నాలు ఎగ‌బ‌డ‌తారు.

ఈ ప‌థ‌కం ఇప్పుడెందుకు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందంటే ఇటీవ‌లె చెన్నైకు చెందిన ప్ర‌ముఖ న‌గ‌ల దుకాణ‌మైన నాథెల్లా సంప‌త్ జువెల‌రీ ప్రైవేట్ లిమిటెడ్ వారు గోల్డ్ చిట్ స్కీమ్ స‌భ్యుల‌కు డ‌బ్బులు క‌ట్ట‌లేక చేతులు ఎత్తేశారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల స‌రైన స‌మ‌యానికి డ‌బ్బు తిరిగి ఇవ్వ‌లేక‌పోయామ‌ని క్ష‌మించ‌మ‌ని కాస్త‌ గ‌డువిస్తే అంద‌రికీ అందించాల్సిన‌ డ‌బ్బు త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని చెప్ప‌డం వేరే విష‌యం.

ఇలాంటి ప‌థ‌కాల‌తో ఉన్న‌ లాభ‌న‌ష్టాలేమిటి?

లాభాలు

చిన్న మొత్తాల్లో ప్ర‌తి నెలా క‌నీసం రూ.500 లేదా రూ.1000ల‌తో ఈ ప‌థ‌కంలో ఏడాది వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల సౌల‌భ్యం.

త‌రుగుద‌ల ఛార్జీలు

ఇలాంటి ప‌థ‌కాల్లో బంగారంపై ఎటువంటి త‌రుగుద‌ల ఛార్జీలుండ‌వు. అయితే ఎంపిక చేసిన డిజైన్ల‌కు మాత్ర‌మే. మామూలుగా అయితే ఆభ‌ర‌ణాన్ని బ‌ట్టి త‌రుగుద‌ల ఛార్జీ 6-10శాతం మ‌ధ్య‌లో ఉండ‌వ‌చ్చు.

ఒక వాయిదా ఆదా

న‌గ‌దు దుకాణాల వారు మీ త‌ర‌ఫున ఒక వాయిదా చెల్లింపును ఉచితంగా చేస్తారు కాబ‌ట్టి ఆ మేర‌కు డ‌బ్బు ఆదా అయిన‌ట్టే.

గ‌మ‌నిక: పైన పేర్కొన్న 2వ‌, 3వ అంశాలు న‌గదు దుకాణాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి.

న‌ష్టాలు

క‌చ్చితంగా బంగార‌మే కొనాలి

స్కీమ్ ముగిసిన త‌ర్వాత క‌చ్చితంగా బంగార‌మే కొనుగోలు చేయాలి.

త‌యారీ ఖ‌ర్చులు

కొనుగోలు చేసే ఆభ‌ర‌ణాల‌పై త‌యారీ ఖ‌ర్చుల పేరిట అద‌నంగా ఛార్జీలు వ‌సూలు చేయ‌వ‌చ్చు. ఇది న‌గ‌దు దుకాణాన్ని బ‌ట్టి 6 నుంచి 20శాతం మ‌ధ్య‌లో ఉండ‌వ‌చ్చు.

విలువ త‌గ్గితే

మీరు బంగారం అందుకునే స‌మ‌యానికి విలువ ప‌డిపోతే న‌ష్టం వ‌చ్చిన‌ట్టే. అనుకున్న ఆభ‌ర‌ణం ఇంకా త‌క్కువ‌కే వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయినా ఒప్పందం ప్ర‌కారం ముందుగా డ‌బ్బు క‌ట్టి ఉంటారు కాబ‌ట్టి ఏం చేయలేం.

స‌భ్యుల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ ఉంటుంది?

కంపెనీ (డిపాజిట్ల స్వీక‌ర‌ణ‌) చట్టం, 2014లో నిబంధ‌న 3(6) కింద ఏ సంస్థ అయినా డిపాజిట్లను స్వీక‌రించ‌వ‌చ్చు. అయితే ఆర్బీఐ బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌కు (NBFCs) నిర్దేశించిన వ‌డ్డీ రేటు కంటే ఎక్కువ ఉండాలి. సుల‌భంగా చెప్పాలంటే న‌గ‌దు దుకాణాల నిక‌ర విలువ‌లో 25శాతానికి మించి డిపాజిట్ల‌ను స్వీక‌రించ‌డానికి వీల్లేద‌ని చ‌ట్టం చెబుతుంది.

ఇంకా నియంత్ర‌ణ చ‌ట్టం ఏం చెబుతుందంటే… ఏదైనా సంస్థ ఇలాంటి ప‌థ‌కాల్లో స‌భ్యులుగా చేర్చుకొన్న‌వారి వ‌ద్ద నుంచి సేక‌రించిన మొత్తం రూ.100కోట్లు దాటి దీనితో లాభాన్ని గ‌డిస్తుంటే సెబీ అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. మ‌రి ఎన్ని న‌గ‌దు దుకాణాలు ఈ నిబంధ‌న‌ను పాటిస్తున్నాయో తెలియ‌దు.?

సెబీ, ఆర్‌బీఐలు నియంత్రించ‌లేవా?

SEBI-RBI-2.jpg

వాస్త‌వానికి ఇలాంటి గోల్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో స‌భ్యుల డ‌బ్బుకు సెబీ లేదా ఆర్‌బీఐ గానీ ఎటువంటి ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేవు. కంపెనీల చ‌ట్టంలో డిపాజిట్లు, స్కీమ్‌లలో ప్ర‌జ‌లు పెట్టే డ‌బ్బు పోకుండా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని నిబంధ‌న‌లున్నాయి. అయితే ఇలాంటి చ‌ట్టాలు కంపెనీగా రిజిస్ట‌ర్ పొందిన‌వాటికే వ‌ర్తిస్తుంది. ఇది చ‌ట్టంలో ఒక లొసుగు. అది కాకుండా ఏదైనా రిజిస్ట‌ర్డ్ కంపెనీ ప్ర‌జ‌ల నుంచి ఇలాంటి స్కీమ్‌ల ద్వారా డిపాజిట్ల‌ను సేక‌రిస్తే వాటిపై నిఘా ఉంచాలంటే క‌నీసం 12 నెల‌లు డిపాజిట్ స్వీక‌రించి ఉండాలి. కంపెనీల చ‌ట్టంలో ఉన్న లొసుగుల‌ను న‌గ‌దు దుకాణాల వారు త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్నారు.

ఏడాదిలోపు వ‌స్తువుల‌ను(ఇక్క‌డ బంగారాన్ని) వినియోగ‌దారుల‌కు ఇచ్చివేస్తున్నామ‌ని చెప్పి చెల్లింపుల‌ను డిపాజిట్లుగా కాకుండా అడ్వాన్సులుగా త‌నిఖీ అధికారుల‌కు చూపిస్తున్నారు. అందుకే చాలా న‌గ‌దు దుకాణాలు ఇప్పుడు 11 నెల‌ల స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. 12వ నెల‌ ఉచిత వాయిదా అంటూ ఏడాది నిబంధ‌న‌ను ఈ విధంగా త‌మ‌కు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు.

ప్ర‌జ‌ల నుంచి ఇలా సేక‌రించిన సొమ్ము అడ్వాన్సుగా చెప్పుకుంటున్నారు కాబ‌ట్టి ఆర్‌బీఐకి కూడా వీటిపై నియంత్ర‌ణ లేదు. ఇలాంటివి సామూహిక పెట్టుబ‌డి ప‌థ‌కం కిందికి రాదు కాబ‌ట్టి సెబీ కూడా ఏం చేయ‌లేని పరిస్థితి నెల‌కొంది.

న‌ష్ట‌భ‌యాలు, ప‌రిష్కార మార్గాలు

ఇలాంటి నియంత్ర‌ణ లేని బంగారు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డికి రెండు ర‌కాల న‌ష్ట‌భ‌యాలుంటాయి. ఒక‌టి… బంగారు ఆభ‌ర‌ణ‌మో లేదా హామీ ఇచ్చిన సొమ్ము అందుకోవ‌డంలో ఆల‌స్యం ఏర్ప‌డ‌వ‌చ్చు. రెండు… పూర్తిగా మోసానికి గురికావొచ్చు. రెండు సంద‌ర్భాల్లోనూ తొంద‌ర‌ప‌డి ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. మ‌రి దీనికి ప‌రిష్కార మార్గం ఏమిటంటే ర‌శీదులు లాంటి స‌రైన ఆధారాల‌తో వినియోగ‌దారుల కోర్టును సంప్ర‌దించ‌డ‌మే. న‌గ‌దు దుకాణాల వారు కంపెనీగా రిజిస్ట‌ర్ అయి ఉంటే గ‌నుక రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల‌ను సంప్ర‌దించే ప్ర‌య‌త్నం చేయడం మ‌రో మార్గం.

ప్ర‌త్యామ్నాయాలివే…

బంగారంలోనే పెట్టుబ‌డి పెట్టాల‌నుకోవ‌డం మీ ల‌క్ష్య‌మైతే… ఈ ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఓ సారి ప‌రిశీలించండి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు

gold 2.JPG

గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌) చాలా సుల‌భ‌మైన పెట్టుబ‌డి ప‌థ‌కాలు. షేర్లలో పెట్టుబ‌డి మాదిరిగా సౌల‌భ్యం. బంగారంలో పెట్టుబ‌డి అంత సుల‌భం. ఈ రెండింటి గుణాల క‌ల‌బోతే గోల్డ్ ఈటీఎఫ్‌లు. ఇత‌ర సంస్థ‌ల షేర్ల మాదిరిగానే ఇవీ నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో న‌మోద‌వుతాయి. మార్కెట్ ధ‌ర‌ల‌కు నిరంత‌ర కొనుగోలు, అమ్మ‌కాలు జ‌రుగుతుంటాయి. ధ‌ర‌ల‌ను బ‌ట్టి బంగారంలో పెట్టుబ‌డులు కొన‌సాగుతుంటాయి. వీటిని గోల్డ్ బులియ‌న్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.

బంగారు ధ‌ర‌ల‌కు అనుగుణంగానే ఉంటాయి కాబ‌ట్టి ఈటీఎఫ్‌లు పూర్తి పార‌ద‌ర్శ‌కత్వం అని చెప్పొచ్చు. పైగా నేరుగా బంగారం కొనేదాంతో పోలిస్తే ఈటీఎఫ్‌ల‌లో ఛార్జీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఈటీఎఫ్ యూనిట్ల‌ను క్ర‌మానుసారంగానూ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సార్వ‌భౌమ బంగారు బాండ్లు

sovereign gold.jpg

సార్వ‌భౌమ బంగారు బాండ్ల ప‌థ‌కాల్లో భాగంగా గ్రాముల లెక్క‌న బంగారాన్ని ప్ర‌భుత్వ బాండ్లుగా సూచిస్తారు. ఫిజిక‌ల్ గోల్డ్‌కిది ప్ర‌త్యామ్నాయాలు. మ‌దుప‌రులు న‌గ‌దు రూపంలో ఇష్యూ ధ‌ర‌ను చెల్లించాలి. మెచ్యూరిటీ తీరాక న‌గ‌దు రూపంలోనే రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. భార‌త ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆర్‌బీఐ ఈ బాండ్ల‌ను జారీచేస్తుంది.

నేరుగా బంగారాన్ని క‌లిగి ఉండేదానికి ప్ర‌త్యామ్నాంగా మంచి పెట్టుబ‌డి మార్గం ఈ సార్వ‌భౌమ బంగారు బాండ్లు. నిల్వ కోసం వెచ్చించే ఖ‌ర్చులు త‌గ్గుతాయి. మార్కెట్ విలువ‌కు త‌గ్గ బంగారం ల‌భిస్తుందనే హామీ ఉంటుంది. దీంతో పాటు మెచ్యూరిటీ స‌మ‌యానికి వ‌డ్డీతో క‌లిపి ఇస్తారు.

త‌యారీ ఖ‌ర్చులు, నాణ్య‌త విష‌యంలో ఆందోళ‌న చెందాల్సి ప‌నిలేదు. బాండ్లు ఆర్‌బీఐ ఆధ్వ‌రంలో ఉంటాయి లేదా డీమ్యాట్ రూపంలో ఉంటాయి. మెచ్యూరిటీ గ‌డువు ముగిశాక గోల్డ్ బాండ్ల‌ను రీడీమ్ చేసుకుంటే భార‌తీయ రూపాయ‌ల్లో న‌గ‌దును చెల్లిస్తారు. రిడెంప్ష‌న్ చేసిన తేదీకి మూడు రోజుల ముందు బంగారం 999 స్వ‌చ్ఛ‌త ధ‌రకు అనుగుణంగా డ‌బ్బు ఇస్తారు. ఇండియా బులియ‌న్ అండ్ జువెల‌ర్స్ అసోసియేష‌న్ లిమిటెడ్ నిర్ణ‌యించిన ధ‌ర‌కే సొమ్ము అందుకుంటాం.

చివ‌ర‌గా…

ఇక న‌గ‌దు దుకాణాల వారు రూపొందించే ప‌థ‌కాలకు అటు సెబీ ఇటు ఆర్‌బీఐ ఎలాంటి నియంత్ర‌ణ విధించ‌లేకుండా ఉన్నాయి. చెల్లింపుల్లో ఆలస్య‌మేర్ప‌డినా… దుకాణం దివాళా తీసినా వినియోగ‌దారు ఒంట‌రిగానే పోరాడాల్సి వ‌స్తుంది. చ‌ట్ట‌బ‌ద్ధంగా న్యాయం కోసం కొన్ని నెల‌లు ఎదురూచూడాల్సిందే. ఇక ఏది స‌రైన‌దో మీరే నిర్ణ‌యించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని