బంగారం ధరల ర్యాలీ కొనసాగనుందా?

కరోనా ఉద్ధృతి, దాని కట్టడికి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థ రికవరీని మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నప్పటికీ............

Published : 17 Apr 2021 11:19 IST

పోర్ట్‌ఫోలియోలో పసిడికి ప్రాధాన్యం పెంచొచ్చా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతి, దాని కట్టడికి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థ రికవరీని మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. బంగారం వంటి నష్టభయం తక్కువగా ఉండే వాటిల్లో మదుపు చేసేవారికి కలిసొచ్చే అంశం. ఆ మధ్య భారీగా పడిపోయిన బంగారం ధరలు తిరిగి 6.2 శాతం మేర పుంజుకున్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను 10-15 శాతానికి పెంచుకుంటే దీర్ఘకాలంలో లాభపడొచ్చని సూచిస్తున్నారు. 

ఈక్విటీల్లో అస్థిరత..

కరోనా రెండోసారి విజృంభిస్తున్న తరుణంలో నష్టభయం ఎక్కువగా ఉండే ఈక్విటీ వంటి వాటి నుంచి మదుపర్లు వెనక్కి మళ్లే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మార్కెట్ల తీరును చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఆంక్షలు, కేసుల పెరుగుదల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం పరిస్థితి చేదాటినా సూచీలు గతేడాది వలే అధఃపాతాళానికి పడిపోవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కచ్చితంగా బంగారానికి కలిసొస్తుంది. మదుపర్లంతా తమ పెట్టుబడులను పసిడివైపు మళ్లించే అవకాశం ఉంది. దీంతో గిరాకీ పుంజుకొని ధరలు మళ్లీ గరిష్ఠాలకు చేరే అవకాశం ఉంది.

భారీగా పెరిగిన దిగుమతులు.. 

మరోవైపు దేశీయంగా బంగారానికి గిరాకీ పుంజుకుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 321 టన్నుల పసిడిని దిగుమతి చేసుకున్నారు. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఈ గిరాకీ ఇలాగే కొనసాగితే పసిడి రేట్లు మరోసారి పెరిగే అవకాశం ఉంది. 

ద్రవ్యోల్బణ ప్రభావం...

మార్చిలో రిటైల్‌ ఆధారిత ద్రవ్యోల్బణం 5.52 శాతానికి చేరింది. క్రితం నెలతో పోలిస్తే దాదాపు 50 బేసిస్‌ పాయింట్లు ఎగబాకింది. ఆర్‌బీఐ సైతం ఈ ఏడాది ద్రవ్యోల్బణం ఐదు శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే ప్రయత్నంతో భారత్‌ సహా ప్రపంచ దేశాలు భారీ ఉద్దీపన చర్యలు చేపట్టాయి. దీంతో వ్యవస్థలో నగదు లభ్యత పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా వడ్డీరేట్లు తగ్గుముఖం పడతాయి. సహజంగానే అప్పుడు పసిడికి గిరాకీ పెరిగి ధరలు పుంజుకుంటాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమయానుకూలంగా పసిడిలో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో లబ్ధి పొందొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గత ఆరు నెలల్లో బంగారం ధరలు పడిపోవడం, ఈక్విటీల జోరు కొనసాగడంతో మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో పసిడికి ప్రాధాన్యం తగ్గించి ఉండవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి తిరిగి బంగారంపై కేటాయింపులను 10-15 శాతానికి పెంచుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పెట్టుబడులు అన్నది వ్యక్తిగత అంశం. అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని