యాడ్‌ మార్కెట్‌పై పట్టుకోసం.. గూగుల్‌, ఫేస్‌బుక్‌ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం!

యాడ్‌ మార్కెట్‌ను పంచుకునేలా ఫేస్‌బుక్‌, గూగుల్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికాలోని పలు రాష్ట్రాల అటార్నీలు న్యూయార్క్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు....

Published : 15 Jan 2022 12:40 IST

న్యూయార్క్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు

న్యూయార్క్‌: రోజురోజుకీ అమెరికన్ టెక్‌ కంపెనీలు ఆర్థికంగా బలంగా తయారవుతున్నాయి. ఈ క్రమంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అనైతిక చర్యలకు సైతం పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ‘యాడ్‌ మార్కెట్‌’ను శాసించేందుకు అవసరమైతే ప్రత్యర్థి కంపెనీలతోనూ చేతులు కలుపుతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్‌ మార్కెట్‌లో గూగుల్‌, ఫేస్‌బుక్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సంస్థల మధ్య 2018లో ఓ రహస్య ఒప్పందం కుదిరినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. యాడ్‌ మార్కెట్‌ను ఇరు సంస్థలు పంచుకునేలా ఈ ఒప్పందం ఉన్నట్లు అమెరికాలోని పలు రాష్ట్రాల అటార్నీలు న్యూయార్క్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మొబైల్‌ అడ్వర్టైజింగ్‌ ధరల్ని నిర్ణయించడంతో పాటు వాటిని పంచుకునేలా ఇరు కంపెనీలు నిర్ణయించాయని పేర్కొన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. 

ఆన్‌లైన్‌ అడ్వర్టైజ్‌మెంట్‌లో పోటీని అణగదొక్కేలా గూగుల్‌, ఫేస్‌బుక్‌ చేతులు కలిపాయన్నది పిటిషన్‌లోని ప్రధాన ఆరోపణ. అక్టోబరులోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తర్వాత రెండుసార్లు దాన్ని సవరించి కీలక వ్యక్తుల పేర్లను తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో ‘హెడ్డర్‌ బిడ్డింగ్‌’ అనే సాంకేతికతను వినియోగించాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించడమే ఈ ఒప్పందానికి ఆజ్యం పోసినట్లు పేర్కొన్నారు. ఈ సాంకేతికత వల్ల ప్రకటనల నుంచి వెబ్‌సైట్‌ పబ్లిషర్లకు వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఫేస్‌బుక్‌ తన సొంత ప్లాట్‌ఫాంపైనే ప్రకటనలను విక్రయిస్తుంటుంది. అలాగే థర్డ్‌ పార్టీ యాప్స్‌, మొబైల్‌ వెబ్‌సైట్లలో ఇచ్చే ప్రకటనల కోసం ప్రత్యేకంగా ఓ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. హెడ్డర్‌ బిడ్డింగ్‌ వల్ల అనేక మంది వెబ్‌సైట్‌ పబ్లిషర్లు గూగుల్‌ను దాటవేసి ఆర్జనను భారీగా పెంచుకున్నారని అడ్వర్టైజింగ్‌ టెక్నాలజీ సంస్థ ‘చాలీస్‌’ సీఈఓ ఆడమ్‌ హైమ్‌లిచ్‌ తెలిపారు. ఇది తమ ఉనికికే ప్రమాదం అని భావించిన గూగుల్‌ ఈ చట్టవిరుద్ధ ఒప్పందం కోసం ఫేస్‌బుక్‌ను ఆశ్రయించిందని పిటిషన్‌లో ఆరోపించారు.

ఈ ఒప్పందానికి ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, గూగుల్‌, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఆమోదం ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. వీరు సంతకాలు కూడా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై స్పందించడానికి ఇరు సంస్థల అధికార ప్రతినిధులు నిరాకరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని