Google, Facebook: ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు!

గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి డిజిటల్‌ మీడియా కంపెనీలు భారత్‌లో కొత్త ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు సన్నాహలు

Published : 30 May 2021 14:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి డిజిటల్‌ మీడియా కంపెనీలు భారత్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రీవెన్స్‌ ఆఫీసర్లను నియమించారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు ప్రభుత్వంతో పంచుకొన్నాయి. ట్విటర్‌ ఇప్పటికీ ఈ నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని ఐటీ మంత్రిత్వ శాఖకు వెల్లడించలేదు.  కాకపోతే ఒక న్యాయవాదిని కాంటాక్ట్‌ పర్సన్‌గా పేర్కొంటూ అతని వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ధర్మేంద్ర చతుర్‌ ట్విటర్‌ తరపున భారత్‌లో తాత్కాలిక  గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ అని పేర్కొంది. 

ఇక ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు గ్రీవెన్స్‌ అధికారులను నియమించి ఆ సమాచారాన్ని సంస్థ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయనున్నాయి. ఇక గూగుల్‌లో ‘Contact Us’ అన్న ఫీచర్‌ వద్ద ‘జో గ్రిగర్‌’ అనే వ్యక్తి పేరును ఉంచింది. అతని చిరునామా అమెరికాలోని  ‘మౌంటెయిన్‌ వ్యూ’గా చూపించింది. యూట్యూబ్‌లో కూడా ఇదే తరహా మార్పులు జరిగాయి.  

ఇవీ కొన్ని నిబంధనలు...

భారత్‌లో సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం... ఆయా సంస్థలు...
* దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా తెలియజేయాలి.
* నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి.
* అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు... తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి.
* దేశ సార్వభౌమత్వానికి, రక్షణ తదితర కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని, పోస్టింగులను పెడితే... వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
* ఎవరైనా వినియోగదారుల సందేశాలనుగానీ, వారి అకౌంట్లనుగానీ సామాజిక మాధ్యమం తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి తగిన సమయం కల్పించాలి.
* సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వంలోని ఓ ఉన్నత స్థాయి కమిటీని పర్యవేక్షిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని