GooglePay FD: గూగుల్‌ పే నయా ఫీచర్‌.. యాప్‌ నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు!

గూగుల్‌పే ఇకపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీ)ను కూడా పంపిణీ చేయనుంది. ఈ మేరకు ‘ఈక్విటాస్ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌(ఈఎస్‌ఎఫ్‌బీ)’తో ఒప్పందం కుదుర్చుకుంది...

Published : 01 Sep 2021 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ‘గూగుల్‌ పే’ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు బిల్లుల చెల్లింపులు, రీఛార్జిలు, మ్యూచువల్‌ ఫండ్లు, ఇన్సూరెన్స్‌ పథకాలను వినియోగదారులకు చేరువ చేసిన గూగుల్‌పే ఇకపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీ)ను కూడా అందించనుంది. ఈ మేరకు ‘ఈక్విటాస్ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌(ఈఎస్‌ఎఫ్‌బీ)’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సదుపాయం తొలుత ఆండ్రాయిడ్‌ నుంచి గూగుల్‌పే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి మాత్రమే లభించనుంది. త్వరలో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌, ఏయూ స్మాల్‌ ఫినాన్స్ బ్యాంక్‌తోనూ గూగుల్‌పే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

ఈఎస్‌ఎఫ్‌బీలో ఖాతా లేనప్పటికీ.. గూగుల్‌ పే ద్వారా ఎఫ్‌డీ చేయొచ్చు. దీన్ని డిజిటల్‌ ఎఫ్‌డీగా పేర్కొంటున్నారు. కేవలం రెండు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని ఈఎస్‌ఎఫ్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎఫ్‌డీ కాలపరిమితి ముగియగానే అసలుతో పాటు వడ్డీ గూగుల్‌పేతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో జమవుతుంది. మిగిలిన బ్యాంకులతో పోలిస్తే.. గూగుల్‌పే ద్వారా ఈఎస్‌ఎఫ్‌బీలో ఎఫ్‌డీ చేసే వారికి అధిక వడ్డీరేటు ఉంటుందని తెలిపింది.

గూగుల్‌ పే ద్వారా ఈఎస్‌ఎఫ్‌బీలో ఎఫ్‌డీ చేసే ప్రక్రియ..

* గూగుల్‌పే ఓపెన్‌ చేసి బిజినెసెస్‌ అండ్‌ బిల్స్‌ని ఎంపిక చేసుకోండి

* ఈక్విటాస్‌ ఎస్‌ఎఫ్‌బీ లోగోపై క్లిక్‌ చేయండి. లేదంటే గూగుల్‌పే సెర్చ్‌ బార్‌లో ఈక్విటాస్‌ అని టైప్‌ చేసినా సరిపోతుంది.

* ఎఫ్‌డీ చేయాల్సిన మొత్తం, కాలపరిమితిని ఎంచుకోండి.

* పాన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌ వంటి వ్యక్తిగత కేవైసీ వివరాలు ఎంటర్‌ చేయండి.

* గూగుల్‌ పే యూపీఐ ద్వారా చెల్లింపు పూర్తి చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని