LIC IPO: డ్రాగన్‌కు మరో ఝలక్‌.. ఎల్‌ఐసీ ఐపీవోలో చైనా పెట్టుబడులకు బ్రేక్‌?

ఎల్‌ఐసీ ఐపీవోలో చైనా పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం యోచిస్తోంది.

Published : 22 Sep 2021 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భద్రతాపరమైన కారణాలు చూపుతూ చైనా యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌ఐసీ ఐపీవో విషయంలోనూ డ్రాగన్‌కు ఝలక్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే ఎల్‌ఐసీ ఐపీవోలో చైనా పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. అదే సమయంలో ఇతర విదేశీ మదుపర్లు ఐపీవో పాల్గొనేందుకు అనుమతివ్వాలని నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం చైనా పెట్టుబడులను పరిమితం చేసేందుకు భారత్‌ కొన్ని చర్యలను చేపట్టింది. పలు యాప్స్‌పైనా నిషేధం విధించింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపైనా నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ ఐపీవోలో సైతం చైనా పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిసింది.

ప్రస్తుతం ఎల్‌ఐసీ చట్టం ప్రకారం.. విదేశీపెట్టుబడులకు అనుమతి లేదు. కానీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులూ పాల్గొనేలా చేయాలని కేంద్రం యోచిస్తోంది. అదే సమయంలో చైనాను అడ్డుకోవడానికి ప్రస్తుత చట్టంలో ఏమైనా మార్పులు చేస్తుందా? లేదంటే కొత్త చట్టం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే, పెట్టుబుడుల నిరోధానికి కేంద్రం చర్యలు తీసుకున్నా.. సెకండరీ మార్కెట్‌ ద్వారా వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం సాధ్యపడదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించి సుమారు ₹90 వేల కోట్ల మేర రాబట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని