ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!

డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో ఆచితూచి స్పందించింది. గతేడాదితో పోలిస్తే లక్ష్యాన్నిదాదాపు కుదించింది. ఇప్పటికే కొంత వరకు పనులు పూర్తచేసుకొన్న వాటిని ఓ లక్ష్యానికి చేర్చాలని నిర్ణయించుకొంది. అంతేకాదు కీలకమైన సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు కూడా పేర్కొంది. ప్రభుత్వం సరికొత్త సెస్సులు, ఇతర ఛార్జీల జోలికి పోకుండానే కొవిడ్‌ సమయంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే పెట్టుబడుల ఉపసంహరణనే ప్రధాన మార్గంగా ఎంచుకొంది. 

Updated : 01 Feb 2021 15:19 IST

 గతేడాదితో పోలిస్తే డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం కుదింపు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కేంద్రప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ విషయంలో ఆచితూచి స్పందించింది. గతేడాదితో పోలిస్తే లక్ష్యాన్ని కుదించింది. ఇప్పటికే కొంత వరకు పెట్టుబడి ఉపసంహరణ పనులు పూర్తిచేసుకొన్న సంస్థలను ఓ తీరానికి చేర్చాలని నిర్ణయించుకొంది. అంతేకాదు కీలకమైన సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు కూడా పేర్కొంది. ప్రభుత్వం సరికొత్త సెస్సులు, ఇతర ఛార్జీల జోలికి పోకుండానే కొవిడ్‌ సమయంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే పెట్టుబడుల ఉపసంహరణనే ప్రధాన మార్గంగా ఎంచుకొంది. 

లక్ష్యం ఎంత..?

ప్రభుత్వం ఈ సారి డిజిన్వెస్టమెంట్ల నుంచి రూ.1.75లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించుకొంది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి లక్ష్యానికి కళ్లెం వేసింది. గతేడాది పెట్టుబడుల ఉపసంహరణ నుంచి రూ.2.1లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయం ద్వారా రూ.19,499 కోట్లను మాత్రం సంపాదించింది. 

ఈ సారి విక్రయానికి వచ్చే కంపెనీలు..

2021-22లో ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, నీలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌, పవన్‌ హన్స్‌, ఎయిర్‌ ఇండియాల్లోని వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని పూర్తిచేయాలని నిర్ణయించింది. 
ఇక ఐడీబీఐ బ్యాంక్‌తో సహా, మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నారు. వీటితోపాటు ఒక జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ సంస్థను ప్రైవేటీకరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అంతేకాదు ఇప్పటి వరకు ప్రకటించిన కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ 

ఈ ఏడాదే పూర్తి చేయనున్నారు. దీంతోపాటు భవిష్యత్తులో పెట్టుబడులను ఉపసంహరించాల్సిన వాటిపై నీతిఆయోగ్‌ను జాబితా సిద్ధం చేయాలని కోరారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద కేవలం నాలుగు వ్యూహాత్మక  రంగాల్లోని కంపెనీలు మినహా మిగిలిన ప్రభుత్వ కంపెనీలను క్రమంగా ప్రైవేటీకరించనున్నారు.  

కొత్త సవాలు..

ప్రస్తుతం దేశీయ మార్కెట్లు మంచి దూకుడు మీదున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీలను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇదే మంచి సమయం అని పాలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మిగిలిన ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు వేగంగా పుంజుకొంటే భారత్‌ మార్కెట్లలోకి వచ్చే విదేశీ నిధుల ప్రభావం తగ్గవచ్చు. అప్పుడు ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పెట్టుబడులు ఉపసంహరణ నుంచి ఆదాయం పొందలేదు. ఫలితంగా ద్రవ్యలోటు పెరిగే ప్రమాదం పొంచిఉంది. 
ఎల్‌ఐసీ ప్రత్యేకం ఎందుకంటే..?

ప్రభుత్వం లైఫ్‌ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటాల విక్రయంపై గత బడ్జెట్లోనే ప్రకటన చేసింది. కానీ, వివిధ కారణాలతో ఇది ముందుకు సాగలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమైన సవరణలు చేసి ఎల్‌ఐసీని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురానున్నారు. 

వాస్తవానికి ఇది  కామధేనువు వంటి సంస్థ ఇది. రైల్వేలకు లక్షా50వేల కోట్ల రూపాయలు, భారత్‌మాల హైవే ప్రాజెక్ట్‌కు లక్షా 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తోంది. 
* పంచవర్ష ప్రణాళికలు మొదలైన నాటి నుంచి నేటి వరకూ- అంటే పన్నెండో పంచవర్ష ప్రణాళిక అంతమయ్యే 2017 నాటివరకు 20లక్షల కోట్ల రూపాయలను ఎల్‌ఐసీ ప్రభుత్వాలకు పెట్టుబడులుగా అందించింది. 

*  ప్రస్తుతం నడుస్తున్న పంచవర్ష ప్రణాళికకుగాను- తొలి రెండేళ్ల కాలానికే ఏడు లక్షల కోట్ల రూపాయలను ఇప్పటికే అందించింది ఎల్‌ఐసీ. 

* గడచిన ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందించింది. 

* ఇవే కాకుండా ఎప్పుడు స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలితే అప్పుడు, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రంగంలోకి దూకి వేల కోట్ల రూపాయలు గుమ్మరించి మార్కెట్లు తిరిగి పుంజుకునేలా చేసే సంస్థ అది.

విక్రయానికి కారణాలు..

పార్లమెంటులో 2020-21 బడ్జెట్‌ సందర్భంగా ఆర్థికమంత్రి ఎల్‌ఐసీలో వాటాల విక్రయానికి మూడు ముఖ్య కారణాలు పేర్కొన్నారు. 

* మొదటిది: ‘లిస్టింగ్‌’వల్ల ఎల్‌ఐసీ నిబిడీకృత విలువ బయటకు వస్తుంది. 
* రెండు: చిన్న మదుపరులకు సైతం ఎల్‌ఐసీ లాభాల్లో భాగం పంచుకునే అవకాశం కలుగుతుంది. 
* మూడు: ఎల్‌ఐసీకి  క్రమశిక్షణ నేర్పించడం కోసం.

నగదు భాండాగారం..

 2019-20 సంవత్సరానికి ఎల్‌ఐసీ దగ్గర 32లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, రూ.31లక్షల కోట్ల ‘లైఫ్‌ ఫండ్‌’ ఉన్నాయి. ఇక్కడ ఉదాహరించిన ఆస్తుల విలువ కేవలం ‘బుక్‌ వాల్యూ’ మాత్రమే! వాటి మార్కెట్‌ విలువను అంచనా వెయ్యడం అంత సులభం కాదు. ఉదాహరణకు ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఎల్‌ఐసీకి అపారమైన స్థిరాస్తులు పోగుపడ్డాయి. పెరుగుతున్న స్థిరాస్తి రంగ లెక్కల ప్రాతిపదికన వీటి విలువ చాలా ఎక్కువ! వీటి విలువ మదింపు కోసం రెండు సంస్థలను ఏర్పాటు చేశారు. 

* గడచిన ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి ఎల్‌ఐసీ 40కోట్ల పాలసీదారులతో అలరారుతోంది. బీమా చట్టం-1956 ప్రకారం ఎల్‌ఐసీ ఈ 40కోట్ల పాలసీదారులకు ధర్మకర్త మాత్రమే! అందుకే ఎల్‌ఐసీని ఒక బీమా సంస్థలా కాకుండా పరస్పర ప్రయోజనదాయక కంపెనీలా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఎల్‌ఐసీ తాను సంపాదించిన ప్రతి రూపాయి మిగులులో 95శాతం పాలసీదారులకు, అయిదు శాతం ప్రభుత్వ వాటాపై ‘డివిడెండ్‌’గా చెల్లిస్తోంది. 

మచ్చలేని సంస్థ

దేశం మొత్తంలో అవినీతి మచ్చ లేని సంస్థ ఏదైనా ఉందంటే అది ఎల్‌ఐసీ మాత్రమే! ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఇండియా) నిబంధనల ప్రకారం మూడు నెలలకొకసారి రిటర్నులను సమర్పించి- ఏటా పార్లమెంటుకు బ్యాలెన్స్‌ షీట్‌ను ఇచ్చే దేశీయ బీమా కంపెనీ ఎల్‌ఐసీ! ఏ బీమా సంస్థ పనితీరుకైనా కొలమానం దాని క్లైయిముల చెల్లింపుల రికార్డు! ఐఆర్‌డీఏఐ వార్షిక నివేదిక 2018-19 ప్రకారం, 99.7శాతం క్లెయిముల పరిష్కారంతో- ప్రపంచంలోనే అగ్రగామి బీమా సంస్థగా నిలిచింది. 

ఇవీ చదవండి

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

బడ్జెట్‌ బూస్ట్‌.. మార్కెట్లు జూమ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు