Published : 19 Nov 2021 20:33 IST

Crypto currencies: క్రిప్టో లాభాలపై పన్ను విధించేలా చట్టాల్లో మార్పులు?

ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉన్నతాధికారి వెల్లడి

దిల్లీ: క్రిప్టోకరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు చేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిప్టోపై వస్తున్న లాభాలపై మదుపర్లు ఇప్పటికే ‘దీర్ఘకాల మూలధన లాభాల’ కింద పన్ను చెల్లిస్తున్నారన్నారు. జీఎస్టీ చట్టంలోనూ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. దీనిపై వచ్చే బడ్జెట్‌లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు.

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్న వారు సైతం జీఎస్టీ కింద పన్ను చెల్లించాల్సిందేనని తరుణ్‌ తెలిపారు. నవంబరు 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీలపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మదుపర్లను ఆకర్షించేందుకు క్రిప్టోపై భారీ ఎత్తున వాణిజ్య ప్రకటనలు వెలువడుతున్నాయని.. ప్రముఖులు సైతం వీటిని ప్రమోట్‌ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వీటిపై కఠిన నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇటీవల ఆర్‌బీఐ, ప్రధాని వివిధ వర్గాలతో చర్చలు జరిపారన్నారు.

క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో మోదీ వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్‌ కరెన్సీల వల్ల ‘చాలా తీవ్ర సమస్యలు’ ఎదురవుతాయని.. అవి దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

మరోవైపు క్రిప్టో కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించడం కంటే, క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలపై నియంత్రణ విధించడం మేలని ఆర్థిక అంశాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలి సమావేశంలో అధికులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో ఆస్తులపై ఆసక్తి పెరుగుతున్న తరుణంలో, నష్టభయం ఉందన్న కారణంగా వాటిపై పూర్తిగా నిషేధం విధించడం మంచిది కాదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీల వినియోగంపై నిషేధం కానీ.. నియంత్రణ కానీ లేదు.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని