Published : 21 Nov 2021 19:04 IST

Tax Collection: పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం తగ్గించినా ఆదాయానికి ఢోకా లేదు!

పన్ను వసూళ్లపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అంచనాలు

దిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అక్టోబరు నాటికి రూ.6 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ లెక్కన ఈ ఏడాది పన్ను వసూళ్లు బడ్జెట్‌ అంచనాలను మించే అవకాశం ఉందన్నారు.

రీఫండులు చెల్లించిన తర్వాత కూడా ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6 లక్షల కోట్లకు చేరడం శుభపరిణామం అని తరుణ్‌ బజాజ్‌ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది రూ.80,000 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ పన్ను వసూళ్లలో బడ్జెట్‌ అంచనాలను చేరుకుంటామని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు రూ.20.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది అవి 9.5 శాతం వృద్ధితో రూ.22.2 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంట్లో రూ.11 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులుగా లెక్కగట్టారు. మళ్లీ దీంట్లో రూ.5.47 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్ను కాగా.. రూ.5.61 లక్షల కోట్లు ఆదాయపు పన్ను వసూళ్లని అంచనా వేశారు.

జీఎస్టీ వసూళ్లు అక్టోబరులో రూ.1.30 లక్షల కోట్లు నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల కూడా వసూళ్లు ఆశాజనకంగానే ఉంటాయని బజాజ్‌ అంచనా వేశారు. అయితే, డిసెంబరులో మాత్రం కాస్త తగ్గే అవకాశం ఉందన్నారు. తిరిగి మార్చి త్రైమాసికం నుంచి వసూళ్లు మళ్లీ పుంజుకుంటాయన్నారు. సగటున ఈ ఏడాది నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.15 లక్షల కోట్లుగా వసూలవుతాయని అంచనా వేశారు. ఇలా బడ్జెట్‌లో అంచనా వేసినట్లు రూ.1.36 లక్షల కోట్ల కస్టమ్స్‌ సుంకం, రూ.3.35 లక్షల కోట్ల ఎక్సైజ్‌ సుంకం వసూలవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని