గత ఏడాది పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రానికి ఎంత ఆదాయం వచ్చింది?

పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా సమకూరే ఆదాయం 2020-21లో రెండింతలు పెరిగిందని కేంద్రం తెలిపింది....

Updated : 30 Nov 2021 20:06 IST

ఏడాదిలో రెండింతలు.. రాష్ట్రాలకు రూ.20 వేల కోట్ల పంపిణీ

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా సమకూరే ఆదాయం 2020-21లో రెండింతలు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఆ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. దీంట్లో రూ.20 వేల కోట్లు రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధనమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం ఈ విషయాలు వెల్లడించారు.

2019-20లో ఎక్సైజ్‌ సుంకం ద్వారా రూ.1.78 లక్షల కోట్లు వసూలైనట్లు మంత్రి తెలిపారు. అయితే, 2020-21లో ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంతో ఆదాయం రెండింతలైనట్లు వెల్లడించారు. 2019లో ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.88గా, డీజిల్‌పై రూ.15.83గా ఉండేది. దీన్ని గత ఏడాది రెండు విడతల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.38కి, డీజిల్‌పై రూ.31.83కి పెంచారు.. తిరిగి గత బడ్జెట్‌లో దీన్ని వరుసగా రూ.32.90కి, రూ.31.80కి సవరించారు. అయితే, రిటైల్‌ ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, లీటర్‌ డీజిల్‌పై రూ.10 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ సుంకం వరుసగా రూ.27.90, రూ.21.80కి చేరింది.

రాష్ట్రాలకు కేవలం బేసిక్‌ ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రమే వాటా ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.40గా ఉందని పేర్కొంది. పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం కింద రూ.11, రోడ్లు, మౌలిక వసతుల సెస్సు కింద రూ.13, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సు కింద రూ.2.50 వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై బేసిక్‌ ఎక్సైజ్‌ సుంకం రూ.1.80గా ఉండగా.. ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం కింద రూ.08, రోడ్డు మౌలిక వసతుల సెస్సు కింద రూ.04తో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సును కూడా విధిస్తున్నారు. అయితే, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేవలం బేసిక్‌ ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుందని కేంద్రం తెలిపింది.

2016-17లో ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.2.22 లక్షల కోట్లు, 2017-18లో రూ.2.25 లక్షల కోట్లు, 2018-19లో రూ.2.13 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్‌ సుంకానికి అదనంగా రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నాయి. ఏప్రిల్‌ 2016 - మార్చి 2021 మధ్య వివిధ రాష్ట్రాలకు వ్యాట్‌ ద్వారా రూ.9.57 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు పంకజ్‌ చౌదరి తాజాగా రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రానికి రూ.12.11 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని