ప‌రిమితి పెంపుతో.. ఉద్యోగుల‌కు ఎంత లాభం?

ఉద్యోగుల‌ గ్యాట్యూటీ మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు పెరిగింది. అయితే ఎంత లాభం

Published : 16 Dec 2020 15:54 IST

పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యూటీ స‌వ‌ర‌ణ బిల్లు 2018 పార్ల‌మెంటు లో ఆమోదం పొంద‌టంతో ఉద్యోగుల‌కు గ్రాట్యూటీ మొత్తంపై ప‌న్నుచెల్లించాల్సిన ప‌రిమితి పెరిగింది. పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యూటీ చ‌ట్టం అంటే ఏంటి? పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యూటీ చ‌ట్టం 1972 అంటే ప‌ది మందికి కంటే ఎక్కువ మంది ఉన్న సంస్థ‌లో క‌నీసం ఐదేళ్ల స‌ర్వీసుకాలం పూర్తి చేసి ఉంటే గ్రాట్యూటీ అందుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ వృద్దాప్యం, వైక‌ల్యం, ప్ర‌మాదం ఇలా ఏ కార‌ణం చేత చేసినా గ్రాట్యుటీ అందుతుంది. ప‌రిశ్ర‌మ‌లు, కర్మాగారాల్లో ప‌ని చేసే ఉద్యోగులకు ఈ చ‌ట్టం ఒక సామాజిక భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తుంది. ప్రైవేటు, ఇత‌ర స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌ల్లో ప‌నిచేసే సెంట్ర‌ల్ సివిల్ స‌ర్వీసెస్ ( పెన్ష‌న్) నిమ‌యాలు 1972 కింద రాని ఉద్యోగుల‌కు వారికి మేలు చేకూరనుంది. గ్రాట్యూటీ చ‌ట్టం 1972 ప్ర‌కారం ఉద్యోగులు క‌నీస స‌ర్వీసు ఐదేళ్లు ఉంటే ఈ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తారు. మ‌హిళ‌ల‌కైతే ఈ చ‌ట్టం మెటర్నిటీ లీవ్ లో భాగంగా 12 వారాల‌కు మిన‌హాయింపు ఉండేది. అయితే ఈ సెల‌వులు ప్ర‌స్తుతం 26 వారాల‌కు పెంచారు. కాబ‌ట్టి కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసే ఆదేశాల ప్ర‌కారం ఈ స‌మ‌యంలో ఉద్యోగినుల‌కు మిన‌హాయింపు అమ‌ల‌వొచ్చు.

స‌వ‌ర‌ణ‌లేంటంటే…

గ్రాట్యూటీ ద్వారా ఉద్యోగుల‌కు ల‌భించే మొత్తంపై ప్ర‌స్తుతం ఉన్న రూ. 10 ల‌క్ష‌ల పరిమితిని రూ. 20 ల‌క్ష‌ల‌కు పెంచారు. దీని ప్ర‌కారం చూస్తే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ఉద్యోగుల‌కు ప్ర‌స్తుతం అందుతున్న (ప‌న్ను త‌ర్వాత) రాబ‌డి కంటే ఎక్కువ‌గా అందుతుంది. ఈ అంశం ప్ర‌ధానంగా రిటైరైన ఉద్యోగులు విశ్రాంత జీవితం గ‌డిపేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. చాలా కాలం నుంచి దీని ప‌రిమితి రూ. 10 ల‌క్ష‌లు ఉండ‌టం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త‌గా ఈ బిల్లుకు చేసిన స‌వ‌ర‌ణ‌ల‌తో ఈ ప‌రిమితిని రూ. 20 ల‌క్ష‌లు చేయడం ఉద్యోగులకు శుభవార్తే.

ఎలా లెక్కేస్తారు?

గ్రాట్యూటీ లెక్కింపు చేసేందుకు ఉద్యోగి స‌ర్వీసు కాలం, చివ‌రిగా తీసుకున్న జీతం ప‌రిగ‌ణిస్తారు. ఒక ఏడాదికి 15 రోజుల జీతం చెల్లిస్తారు. అలా ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌నిచేస్తే అన్ని 15 రోజుల జీతాన్నిచెల్లిస్తారు. ఇక్క‌డ చివ‌రి నెల జీతంలో బేసిక్ శాల‌రీ, డీఏ ల‌ను క‌లిపి ఆ మొత్తాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

దీనిని లెక్కించేందుకు చివ‌రి నెల జీతం [(బేసిక్ శాల‌రీ + డీఏ ) x ఉద్యోగి స‌ర్వీసు సంవ‌త్స‌రాలు x 15రోజులు] / 26

ఈ అంశాన్ని మూడు వేర్వేరు ఉదాహ‌ర‌ణ‌ల‌తో తెలుసుకుందాం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ఉద్యోగి స‌ర్వీసు 30 ఏళ్లు. చివ‌రి జీతం 1,20,000 అనుకుందాం. ల‌భించే గ్రాట్యూటీ రూ. 20,76,923 .ఈ మొత్తంలో రూ. 20 ల‌క్ష‌ల‌కు ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు, ఆ పైన ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

వేరొక ఉదాహ‌ర‌ణ తీసుకుందాం. ఇక్క‌డ స‌ర్వీసు 30 ఏళ్లు, చివ‌రి జీతం 1 ల‌క్ష అనుకుందాం. అప్పుడు ఆ ఉద్యోగికి ల‌భించే గ్రాట్యూటీ రూ. 17,30,769. ఈ సంద‌ర్భంలో ఉద్యోగికి పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప‌రిమితి పెంపుతో లాభం క‌లుగుతుంది.

ఇంకో ఉదాహరణలో ఒక ఉద్యోగి స‌ర్వీసు కాలం 30 ఏళ్లు అనుకుందాం. అత‌ని చివ‌రి జీతం రూ. 40,000 అనుకుందాం. అత‌నికి ల‌భించే గ్రాట్యూటీ రూ. 6,92,307, దీంతో చ‌ట్టం లో మార్పు ఇత‌నిపై ఎలాంటి ప్ర‌భావం చూప‌లేదు. ఎందుకంటే గ‌తంలో ఉన్న రూ.10 ల‌క్ష‌లు లోపు ఉండ‌టంతో ఇప్పుడు పెంచ‌డం ద్వారా ఏ ప్ర‌యోజ‌నం ఇత‌నికి ల‌భించ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని