
భారత్‌కు కొత్త చమురు మిత్రుడు!
దిల్లీ: భారత్‌కు గయానా రూపంలో కొత్త చమురు మిత్ర దేశం లభించింది. ఒపెక్ ప్లస్ దేశాల్లో చమురు ఉత్పత్తి తగ్గిన తరుణంలో అండగా నిలిచేందుకు కొత్త స్నేహహస్తం లభించడం ఊరట కలిగించింది. చమురు విషయంలో భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ తరుణంలో అరబ్ దేశాలు ఉత్పత్తి తగ్గించడం సమస్యగా మారింది. దీంతో దేశీయ చమురు శుద్ధి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి కొత్త మిత్రుణ్ని వెతికి పట్టుకున్నాయి.
దక్షిణ అమెరికా దేశమైన గయానా 2020లోనే చమురు ఎగుమతిని ప్రారంభించింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, పనామా, కరీబియన్ దేశాలకు మాత్రమే ఎగుమతి చేసింది. అయితే, కొత్త వనరులపై దృష్టి సారించిన భారత్‌కు గయానా అండగా నిలిచింది. దేశీయ కంపెనీల ఆర్డర్ మేరకు మిలియన్ బ్యారెళ్ల లిజా టైల్ స్వీట్ క్రూడ్‌ను భారత్‌కు పంపింది. గయానా తీరం నుంచి మార్చి 2న చమురు నౌక బయలుదేరింది. ఇది ఏప్రిల్ 8న భారత్‌లోని ముంద్రా పోర్టకు చేరుకోనుంది.
వెనిజువెలా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకునేది. కానీ, ఆ దేశంపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గత మూడు నెలలుగా అక్కడి నుంచి చమురు చుక్క రాలేదు. దీంతో దాని పక్కనే ఉన్న గయానాపై భారత్ దృష్టి సారించింది. ఒపెక్ నుంచి దిగుమతులు తగ్గిన తర్వాత రష్యా, కెనడా, అమెరికా, మెక్సికో నుంచి భారత్ చమురు కోనుగోలును పెంచింది.