HDFC Bank: ఆ లోటు భర్తీకి పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జట్టు

HDFC Bank credit cards: క్రెడిట్‌ కార్డుల విషయంలో నిషేధం కాలంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జట్టు కట్టింది.

Published : 20 Sep 2021 17:41 IST

ముంబయి: క్రెడిట్‌ కార్డుల జారీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల జారీని వేగవంతం చేయనుంది. క్రెడిట్‌ కార్డుల విషయంలో నిషేధం కాలంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంతో జట్టు కట్టింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పేటీఎంతో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల జారీని వేగవంతం చేసేందుకు రెడీ అవుతోంది.

దేశీయ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జారీ చేసే నూతన క్రెడిట్‌ కార్డుల జారీపై ఆర్‌బీఐ గతంలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బ్యాంక్‌ సేవల్లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెనాల్టీగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 8 నెలల అనంతరం ఇటీవలే ఆర్‌బీఐ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ కాలంలో కోల్పోయిన క్రెడిట్‌ కార్డు మార్కెట్‌ వాటాను తిరిగి సొంతం చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం నెలకు 5 లక్షల కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తాజాగా పేటీఎంతో జట్టు కట్టింది.

పేటీఎం ఇప్పటికే సిటీ బ్యాంక్‌తో కలిసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తోంది. అయితే, దేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని సిటీ బ్యాంక్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల నుంచి కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా మిలియనీల్స్‌, వ్యాపారులు, వర్తకులే లక్ష్యంగా వీసా క్రెడిట్‌ కార్డులను జారీ చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని