CES 2022: అదిరిపోయే ఫీచర్లతో ఆరు కాన్సెప్ట్ కార్లు.. వివరాలివే!

సీఈఎస్‌-2022లో టెక్ కంపెనీలు ఎన్నో రకాల ఆవిష్కరణలను ప్రదర్శించాయి. అందులో కాన్సెప్ట్ కార్లు ఉన్నాయి. వాటిలో యూజర్స్‌ను అమితంగా ఆకట్టుకున్న ఆరు కార్లు ఏంటో చూద్దాం. 

Updated : 14 Jan 2022 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ పండుగ సీఈఎస్‌-2022 ఈ ఏడాది ఆటోమొబైల్ ప్రియులకు ఎన్నో కొత్త ఆవిష్కరణలను పరిచయం చేసింది. బటన్‌ నొక్కగానే రంగు మారే కారు నుంచి కారులోనే థియేటర్‌ అనుభూతిని అందించే కారు వరకు ఎన్నో ఉన్నాయి. వాటిలో వీక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఆరు కాన్సెప్ట్ కార్ల వివరాలు తెలుసుకుందామా... 


మెర్సిడెజ్‌ బెంజ్‌ విజన్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ (Mercedes-Benz Vision EQXX)

మెర్సిడెజ్‌ కంపెనీ విజన్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును షోలో ప్రదర్శించింది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే వెయ్యి కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణం చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఎలక్ట్రిక్‌ కారు అనగానే డిజైన్‌ పరంగా తప్పనిసరిగా కొన్ని మార్పులు చేయాల్సిందే. అయితే ఈక్యూఎక్స్‌ఎక్స్‌లో సాధారణ కర్బన ఉద్గారాల ఇంజిన్‌తో నడిచే కారు డిజైన్‌ తరహాలో ఈ కారును డిజైన్ చేశారట. ఇందులోని బ్యాటరీ వేడెక్కకుండా కారు కింది భాగంలోని ఎయిర్ వెంట్స్‌ దానికి అవసరమైన గాలిని అందిస్తాయి. దీనివల్ల కారులోని లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, కారు పైభాగంలో సోలార్ ప్యానల్‌ అమర్చారు. దీని ద్వారా కారు 25 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన ఛార్జింగ్‌ బ్యాటరీకి అందుతుంది. కారు లోపల డాష్‌బోర్డ్‌లో పెద్ద టచ్‌ స్క్రీన్‌ ఇస్తున్నారు. ఇందులో వెదురు, సింథటిక్‌ సిల్క్‌తో తయారుచేసిన కార్పెట్లు, ప్రత్యేకమైన లెదర్‌తో తయారు చేసిన సీట్లు ఉన్నాయి.


సోనీ విజన్‌-ఎస్‌ (Sony Vision-S)

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారీ కంపెనీ సోనీ, మొబిలిటీ ఇంక్‌ అనే అనుబంధ సంస్థ ద్వారా కొత్త ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తుంది. సోనీ విజన్‌-ఎస్‌ 02 పేరుతో తీసుకొస్తున్న ఈ కారులో 268 హార్స్‌పవర్‌ (హెచ్‌పీ) ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. సీఈఎస్‌ 2020లో మాగ్న-స్టెయర్ అనే సంస్థతో కలిసి తయారు చేసిన విజన్‌-ఎస్‌ 01 కారును ప్రదర్శించింది. తర్వాత దానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సోనీ వెల్లడించలేదు. తాజాగా తీసుకొస్తున్న విజన్‌-ఎస్‌ 02లో ఏడుగురు ప్రయాణించవచ్చు. కారు డాష్‌బోర్డులో ఐదు డిస్‌ప్లేలు ఉన్నాయి. వాటిలో రెండు సైడ్ మిర్రర్ డిస్‌ప్లేలు కాగా, మిగిలిన మూడు డ్రైవర్, ప్యాసింజర్‌కు కోసం ఏర్పాటు చేసినవి. అంటే కారు బయటి వైపు సైడ్‌ మిర్రర్స్‌లో ఉండే సెన్సర్లు అందించే సమాచారం లోపలి సైడ్‌ మిర్రర్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కారులో సోనీ ఆడియో టెక్నాలజీని ఉపయోగించారు.


షెవర్లే సిల్వరాడో (Chevrolet Silverado) 

అమెరికాకు చెందిన ఆటోమొబైల్ తయారీ కంపెనీ జనరల్‌ మోటార్స్‌ షెవర్లే బ్రాండ్‌లో సిల్వరాడో పేరుతో కొత్త ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ పికప్‌ ట్రక్‌ను ప్రదర్శించింది. ఈ కారులోని ఎలక్ట్రిక్ ఇంజిన్‌ 664 హెచ్‌పీ పవర్‌ను, 1057 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.5 సెకన్లలోనే కారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. కారు లోపల 17 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ ఇస్తున్నారు. 


క్యాడిలాక్‌ ఇన్నర్ స్పేస్‌ (Cadillac Inner Space)

జనరల్ మోటార్స్‌కు చెందిన మరో సబ్‌బ్రాండ్ క్యాడిలాక్‌ సంస్థ ఇన్నర్‌స్పేస్‌ పేరుతో మరో కొత్త ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఇది స్వయంచాలిత సాంకేతికత (Autonomous Technology)తో ప్రయాణిస్తుంది. కారు ఆగినప్పుడు డోర్లు ఆటోమేటిగ్గా తెరుచుకుంటాయి. ఇందులో జనరల్ మోటార్స్‌ డెవలప్‌ చేసిన అల్టిఫై సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. ఈ కారు టైర్లు సోయాబీన్‌ ఆయిల్‌, ఊక(వరి పొట్టు) ఆధారిత సిలికాన్‌తో తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించడం కోసం కారు లోపలి భాగాల్లో ప్రత్యేకమైన లెదర్‌తో అలంకరించారు. 


క్రైస్లర్‌ ఎయిర్‌ ఫ్లో కాన్సెప్ట్ (Chrysler Airflow Concept)

ఎయిర్‌ ఫ్లో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును తీసుకురానున్నట్లు క్రైస్లర్‌ కంపెనీ ప్రకటించింది. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి 400 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులోని 118 కిలోవాట్‌ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారులో లెవల్‌-3 అటానమస్‌ డ్రైవింగ్‌ను పరిచయం చేయనున్నట్లు క్రైస్లర్‌ వెల్లడించింది. అలాగే, ఇందులో స్మార్ట్‌కాక్‌పిట్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు లోపలి ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ను తమకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. 


బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో (BMW iX Flow)

బీఎడబ్ల్యూ కంపెనీ ఐఎక్స్‌ ఫ్లో ఎలక్ట్రిక్‌ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా రంగులు మార్చడం ఈ కారు ప్రత్యేకత. యూజర్‌ కారు బటన్ నొక్కగానే రంగు మారుతుంది. ఇందుకోసం కారు వెలుపలి భాగంలో కొన్ని మిలియన్ల ఈ-ఇంక్‌ మైక్రో కాప్స్యూల్స్‌ని ఉపయోగించారు. ఇవి ఫోన్‌ డిస్‌ప్లేలా పనిచేస్తాయి. దాంతో యూజర్ బటన్ నొక్కిన ప్రతిసారీ కారు రంగు మారుతుంది. అలానే బీఎండబ్ల్యూ కంపెనీ యూజర్స్‌కు థియేటర్‌ తరహా అనుభూతిని అందించేందుకు కారు లోపల అమర్చుకునేలా 31 అంగుళాల స్క్రీన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో 8k రిజల్యూషన్‌ వీడియోలను చూడొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని