అద‌న‌పు భ‌రోసానిచ్చే ఆరోగ్య బీమా రైడ‌ర్లు

అధిక ప్రీమియం.. అధిక ప్ర‌యోజ‌నాలు.. ఆరోగ్య బీమా రైడ‌ర్లు ఇచ్చేవి ఇవే. స‌ద్వినియోగం చేసుకోండి అవ‌కాశాన్ని!

Published : 22 Dec 2020 13:37 IST

ప‌రిమితితో కూడిన బీమా హామీ సొమ్మును సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ద్వారా అంద‌జేస్తారు. చాలా ఆరోగ్య‌ పాలసీలు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. ఇది తెలియక మనం భరోసాగా ఉంటే ఆప‌ద స‌మ‌యంలో బీమా కవరేజీ లేదని బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది.

ఇలాంటి పరిమితులను అధిగమించేందుకు కాస్త‌ ప్రీమియం ఎక్కువైనా స‌రే చెల్లించి ఆరోగ్య బీమా పాలసీతో పాటు అదనపు రైడర్లను తీసుకుంటే మేలు.

తీవ్ర అనారోగ్య సమస్యలైన గుండె జబ్బు, క్యాన్సర్‌, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వంటి వాటికి వర్తించే విధంగా బీమా కంపెనీలు కొంత అదనపు ప్రీమియంతో రైడర్లను రూపొందించాయి… కొన్ని కంపెనీలు మహిళలకు ప్రత్యేకించినవి, పిల్లలకు పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాలసీ రైడర్లను అందుబాటులో ఉంచుతున్నాయి.

ఆరోగ్య బీమా పాలసీతో అందుబాటులో ఉన్న రైడర్లు:

నగదు చెల్లింపు రైడర్లు:

ఈ రైడర్లు ఆసుపత్రి ఖర్చులను ముందుగా నిర్దేశించిన మొత్తంలో ఏ రోజుకు ఆ రోజు చెల్లిస్తాయి.

రోగి సంరక్షణ :

ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత రోగిని సంరక్షించేవారికి సైతం రోజూ వారీ ఖర్చులను చెల్లిస్తాయి.

మెటర్నిటీ రైడర్ :

సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలు డెలివరీ ఖర్చులకు బీమా కల్పించవు. ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రత్యేకమైనదే మెటర్నిటీ రైడర్. ఇందులో డెలివెరీకి అయ్యే ఖర్చు, శిశువు ఆరోగ్య సమస్యలతో పుట్టినప్పుడయ్యే వైద్య, సంరక్షణకు అయ్యే ఖర్చులను చెల్లిస్తాయి. అయితే వీటికి ఆరోగ్య బీమా పాలసీలలో మాదిరే 24 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

ప్రమాద బీమా రైడర్ :

ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, గుండె జబ్బు లాంటివి వచ్చినప్పుడు హఠాత్తుగా ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులకు ఈ పాలసీ రైడర్‌ బీమా కల్పిస్తుంది.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెన్‌ఫిట్‌ రైడర్‌:

తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య ఖర్చులు, ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కోలుకునేంత వరకు అయ్యే ఖర్చులు, శాశ్వత వైకల్యం కలిగినప్పుడు పాలసీదారుడిపై ఆధారపడిన వారికి క్రమంగా ఆదాయం వంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది.

రైడర్లలోని పరిమితులు/విధి విధానాలు:

  • ఈ రైడర్‌ ప్రధాన ఆరోగ్య బీమా పాలసీతో అదనపు బీమా ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. ప్రధాన పాలసీ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే రైడర్‌ ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ప్రధాన పాలసీని సరైన సమయానికి పునరుద్ధరించుకోవడం తప్పనిసరి.

  • రైడర్లలో కొన్ని జీవితాంతం పునరుద్దరించుకునే వీలు కలిగినవి ఉండగా మరికొన్ని కొంత నిర్ణీత వయసు వరకే ఆ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

  • పెద్ద వయసు వారు సాధ్యమైనంత వరకూ ఎక్కువ కవరేజీ ఉన్న వాటిని తీసుకుంటే మంచిది. కాకపోతే వీటికి ఉప పరిమితులు, అదనపు చెల్లింపులు ఉంటాయి.

  • కొన్ని రైడర్లకు సాధారణ పాలసీలలో ఉన్నట్టు వెయిటింగ్‌ పీరియడ్‌, కూలింగ్‌ పీరియడ్‌ సైతం ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ రైడర్‌ను ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని