EPFO: ₹7 ల‌క్ష‌ల ప్ర‌యోజ‌నం కోసం ఇ-నామినేష‌న్ ఇలా దాఖ‌లు చేయండి..

ఈపీఎఫ్‌ సభ్యుడు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండగా మ‌ర‌ణిస్తే, నామినీకి గ‌రిష్టంగా రూ. 7ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా అందిస్తారు.

Updated : 23 Aug 2021 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగి భ‌విష్య నిధి (ఈపీఎఫ్) చందాదారుల కుటుంబాల‌కు సామాజిక‌ ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ప్ర‌వేశ‌పెట్టిందే ఎంప్లాయిస్ డిపాజిట్‌- లింక్డ్‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌. ఈ ప‌థ‌కం కింద ప్ర‌స్తుతం ఈపీఎఫ్‌ స‌భ్యుల‌ కుటుంబాల‌కు గ‌రిష్ఠంగా రూ.7 ల‌క్ష‌ల బీమా హామీ ల‌భిస్తుంది. ఈపీఎఫ్‌ సభ్యుడు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్టయితే, కుటుంబ స‌భ్యుల‌కు ఈ ప‌థ‌కం కింద బీమా ప్ర‌యోజ‌నాన్ని అంద‌జేస్తారు. ఈ ప్ర‌యోజ‌నాన్ని పొందేందుకు ఈపీఎఫ్ చందాదారులు తప్ప‌నిస‌రిగా ఈ-నామినేష‌న్‌ ఫైల్ చేయాల‌ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో తెలిపింది. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కూడా ఇ-నామినేష‌న్ ఫైల్ చేయొచ్చు. ఈపీఎఫ్‌/ఈపీఎస్ నామినేష‌న్‌ను డిజిట‌ల్‌గా ఎలా ఫైల్ చేయాలో ద‌శ‌ల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఈపీఎఫ్ నామినేష‌న్ డిజిట‌ల్‌గా ఫైల్ చేసే విధానం..

ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సెట్‌కు వెళ్లాలి.

* అక్క‌డ ‘స‌ర్వీసెస్’ ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి ‘ఫ‌ర్ ఎంప్లాయిస్’ సెక్ష‌న్‌పై క్లిక్ చేయ‌గానే మ‌రో పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.

* కొత్త‌గా వ‌చ్చిన పేజీలో క‌నిపించే ‘మెంబ‌ర్ యూఏఎన్‌/ ఆన్‌లైన్ స‌ర్వీస్‌’ పై క్లిక్ చేయాలి.

* మెంబర్ ఇ-సేవా పోర్టల్‌కు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్క‌డ్ మీ యూఎఎన్ నంబర్‌, పాస్‌వ‌ర్డ్‌, క్యాప్ఛా కోడ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి.

* డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న‌ మ్యానేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ‘ఇ-నామినేష‌న్‌’ను ఎంపిక చేసుకోవాలి.

* కుటుంబ స‌భ్యుల‌ వివరాల‌ను ఎంట‌ర్ చేయాలి.

* ఒక‌రి కంటే ఎక్కువ స‌భ్యుల వివ‌రాల‌ను కూడా ఎంట‌ర్ చేయొచ్చు. ఎవ‌ర‌కి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్క‌డ ఎంచుకోవ‌చ్చు.

* ఒకసారి వివ‌రాల‌న్నింటినీ స‌రి చూసుకుని ‘సేవ్ ఈపీఎఫ్ నామినేష‌న్‌’పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత పేజ్‌కు వెళ్లి ఇ-సైన్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే, వన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌ (ఓటీపీ) జ‌న‌రేట్ అవుతుంది.

* మీ ఆధార్ కార్డ్‌కు అనుసంధానించిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

* ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

ఉద్యోగ‌ల డిపాజిట్‌-లింక్డ్‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌ (ఈడీఎల్ఐ) కింద జీవిత బీమా ప్ర‌యోజ‌నాన్ని పెంచుతున్న‌ట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ గ‌తంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేష‌న్‌లో తెలిపింది. క‌నీస బీమాను రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.2.5 లక్ష‌ల‌కు.. గరిష్ఠ బీమా ప‌రిమితిని రూ.6 ల‌క్ష‌ల నుంచి రూ. 7 ల‌క్ష‌ల‌కు పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని