Password: హ్యాక‌ర్లు ఛేదించలేని పాస్‌వ‌ర్డ్ కావాలా? అయితే ఇవి ఫాలో అవ్వండి..

ఆర్థిక మోసాల‌ భారిన ప‌డ‌కుండా ఉండేందుకు పాస్‌వ‌ర్డ్ ఏర్పాటు విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Updated : 19 Aug 2021 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిట‌ల్ టెక్నాల‌జీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక సంస్థ‌లు, ఆర్థికేత‌ర సంస్థ‌లు త‌మ సేవ‌ల‌ను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నాయి. చాలా వ‌ర‌కు వ్య‌క్తిగ‌త స‌మాచారం డిజిట‌ల్‌గానే భ‌ద్ర‌ ప‌రుచుకోవ‌డం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. ఇలాంటి స‌మాచారాన్ని త‌స్క‌రించేందుకు కొంతమంది హ్యాక‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇ-మెయిల్స్‌తో పాటు బ్యాంకు ఖాతాల‌కు సంబంధించిన‌ డేటాను దొంగిలించేందుకు కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఇటువంటి సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి మోసాల‌ భారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌తి ఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పాస్‌వ‌ర్డ్‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా మారుస్తూ ఉండాలి. అలాగే హ్యాక‌ర్లు తెల‌సుకోలేని విధంగా పాస్వ‌ర్డ్‌ను ఏర్పాటు చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం.

పటిష్ఠమైన పాస్‌వర్డ్‌ ఇలా..
* పాస్‌వ‌ర్డ్‌లో క‌నీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకోవాలి. అంత‌కంటే ఎన్ని ఎక్కువ ఉంటే పాస్‌వర్డ్‌ అంత ప‌టిష్ఠంగా ఉంటుంది.

* పాస్‌వర్డ్‌లో అప్ప‌ర్ కేస్ అక్ష‌రాలు, లోయ‌ర్ కేస్ అక్ష‌రాలు, అంకెలతో పాటు గుర్తుల‌ను (సింబ‌ల్స్‌) ఉప‌యోగించాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. svK@E7uG

* సాధార‌ణ డిక్ష‌న‌రీ ప‌దాల‌ను ఉప‌యోగించకూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు itislocked లేదా thisismypassword లాంటి కామ‌న్ ప‌దాల‌ను ఉప‌యోగించ‌కూడదు.

* గుర్తుంచుకునేందుకు సుల‌భంగా ఉండాల‌ని కీబోర్డ్‌లో వ‌రుస‌గా ఉండే అక్ష‌రాల‌ను ‘qwerty’ లేదా ‘asdfg’ లేదా ‘zxcvb’ వంటి వాటిని ఉప‌యోగించ‌డం మంచిది కాదు.

* అలాగే వ‌రుస ఆంగ్ల అక్ష‌రాలు ‘abcdefg’, ‘zyxwv’, గానీ వ‌రుస అంకెలు ‘12345678’ గానీ ఉపయోగించకూడదు.

* సుల‌భంగా ఊహించ‌గ‌ల ప‌దాలైన మీ పేరు, ఇంటి స‌భ్యుల పేర్లు, నాయ‌కుల పేర్లు, ఇష్ట‌మైన సెల‌బ్రెటీల పేర్లు, డోర్ బెల్‌, డోర్‌ 123 లాంటి కామ‌న్ ప‌దాలు పెట్ట‌కూడ‌దు.

* పాస్‌వ‌ర్డ్ కాస్త పెద్ద‌గా ఉండేట్లు చూసుకోండి. మీ పేరు, లేదా కుటుంబ స‌భ్యుల పేర్ల‌కు పుట్టిన తేదీ, సంవ‌త్స‌రం జోడించి పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు చాలామంది. ఉదాహ‌ర‌ణ‌కు Varun@1976. ఈ విధంగా పెడితే మోస‌గాళ్లు తొంద‌ర‌గా ప‌సిగ‌ట్టే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి పాస్‌వ‌ర్డ్‌లో ఇలాంటివి ఉండకుండా చూసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని