హీరో ఎగుమతి ప్లాంటు నేడు ప్రారంభం

హీరో మోటార్స్‌ కంపెనీ ఎగుమతుల కోసం ఉద్దేశించిన కొత్త హై ఎండ్‌ తయారీ ప్లాంటును ఇక్కడి నగర శివార్లలోని హీరో...

Published : 13 Apr 2021 01:33 IST

రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు

లూథియానా: హీరో మోటార్స్‌ కంపెనీ ఎగుమతుల కోసం ఉద్దేశించిన కొత్త హై ఎండ్‌ తయారీ ప్లాంటును ఇక్కడి నగర శివార్లలోని హీరో ఇ సైకిల్‌ వ్యాలీలో నేడు ప్రారంభించనుంది. తద్వారా తొలి దశ కార్యకలాపాలను మొదలుపెట్టనుంది. అంతర్జాతీయ విడిభాగాల సరఫరాదార్లకూ ఇక్కడ చోటు ఇవ్వడం ద్వారా పూర్తిగా స్థానికంగా విడిభాగాల తయారీని ఇ సైకిల్‌ వ్యాలీ సాధించబోతోంది.  కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కోటి యూనిట్లకు చేరనున్నట్లు సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌ కోసం 70 శాతానికి పైగా ఉత్పత్తులను ఇక్కడే తయారు చేయనున్నారు. దీంతో అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలకు ఈ కొత్త ప్లాంటు కీలకంగా మారనుంది. మొత్తం 100 ఎకరాల వ్యాలీలో సరఫరాదార్ల కోసం 50 ఎకరాలు కేటాయించారు. రెండేళ్లలో మొత్తం రూ.1000 కోట్లకు పైగా దీనిపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందులో కంపెనీ రూ.350 కోట్లు ఖర్చుపెడుతుండగా.. వెండార్లు రూ.400 కోట్ల వరకు తెస్తారని అంచనాలున్నాయి. మరో వైపు, హీరో మోటార్స్‌ కంపెనీ వచ్చే కొన్నేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

అమ్మకానికి ఓఎన్‌జీసీ కేజీ గ్యాస్‌

దిల్లీ: కృష్ణా-గోదావరి(కేజీ) క్షేత్రాల్లోని తన సహజ వాయువు విక్రయించేందుకు సోమవారం ఓఎన్‌జీసీ బిడ్లు ఆహ్వానించింది. తొలుత రోజుకు 2 మిలియన్‌ ప్రామాణిక ఘనపుటడుగుల గ్యాస్‌ను ఒక్కో ఎమ్‌ఎమ్‌బీటీయూను కనీసం 6.6 డాలర్లకు విక్రయించాలని చూస్తోంది. టెండర్‌ పత్రం ప్రకారం.. జూన్‌ నెల నుంచి కంపెనీ తన కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2 బ్లాకు నుంచి వచ్చే సహజ వాయువును ఇ-వేలం ద్వారా విక్రయించాలని భావిస్తోంది. మూడు నెలల చమురు సగటు ధరలో 10.5 శాతం వద్ద ఈ బిడ్లు ఆహ్వానించనుంది. ప్రస్తుత బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌ 63 డాలర్లుగా ఉండడంతో ఒక్కో బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు కనీస ధర 6.6 డాలర్లు కానుంది. ఇది ప్రభుత్వం ప్రతి 6 నెలలకు విధించే పరిమితిపై ఆధారపడి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని