Vaccination: హిందూస్థాన్‌ సిరంజీస్‌ మూసివేత.. సూదుల కొరత తప్పదా?

కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న తమ కంపెనీని మూసివేసినట్లు ‘హిందూస్థాన్‌ సిరంజీస్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌(హెచ్‌ఎండీ)’ వెల్లడించింది....

Updated : 11 Dec 2021 13:53 IST

ఫరీదాబాద్‌: దేశ రాజధాని దిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న తమ కంపెనీని మూసివేసినట్లు ‘హిందూస్థాన్‌ సిరంజీస్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌(హెచ్‌ఎండీ)’ వెల్లడించింది. అయితే, దీని వల్ల దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర చికిత్సా కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కంపెనీ ఎండీ రాజీవ్‌నాథ్‌ తెలిపారు.

హెచ్‌ఎండీలో రోజూ 1.5 కోట్ల సూదులు, 80 లక్షల సిరంజీలు ఉత్పత్తి చేస్తున్నట్లు రాజీవ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ మూతపడడంతో దేశవ్యాప్తంగా కనీసం రోజుకి 1.2 కోట్ల సిరంజీల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే భారత్‌తో సహా దేశవ్యాప్తంగా సిరంజీల కొరత ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం కూడా విధించిందన్నారు. దేశవ్యాప్తంగా నివారణ, టీకా కార్యక్రమాల్లో ఉపయోగించే సిరంజీల్లో 66 శాతం హెచ్‌ఎండీనే అందిస్తోందని తెలిపారు. ఫ్యాక్టరీ మూత వల్ల ఈ కార్యక్రమాల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే ధరలు కూడా పెరగొచ్చని తెలిపారు.

ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రాజీవ్‌నాథ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద సిరంజీలు తయారీ చేసే కేంద్రాలను జాతీయ ప్రాధాన్యంగల వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలుగా గుర్తించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని