గృహ బీమా

ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాం. అలా నిర్మించుకున్న ఇంటికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అగ్నిప్రమాదాలు, చోరీ, ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు షార్ట్‌సర్కూట్‌, తుపానులు, వరదలు, వడగళ్లు, భూకంపాలు, మంచుతుపాను, నిరసనలు, అల్లర్లు, ఉగ్రవాద చర్యలు మొదలైన ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని గృహ బీమాతో కొంత వరకు..

Published : 19 Dec 2020 13:04 IST

ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాం. అలా నిర్మించుకున్న ఇంటికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అగ్నిప్రమాదాలు, చోరీ, ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు షార్ట్‌సర్కూట్‌, తుపానులు, వరదలు, వడగళ్లు, భూకంపాలు, మంచుతుపాను, నిరసనలు, అల్లర్లు, ఉగ్రవాద చర్యలు మొదలైన ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని గృహ బీమాతో కొంత వరకు పూరించుకోవచ్చు

గృహ బీమా పాలసీ రకాలు

మూడు రకాల గృహబీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

  • కేవలం గృహనిర్మాణానికి తీసుకునే పాలసీ

  • గృహ నిర్మాణంతోపాటు సామాగ్రి, విలువైన వస్తువులు, ఇతర అంశాలను కలిపి తీసుకునే పాలసీ వీటిని మొత్తంగా కలిపి ఒకే పాలసీ కింద బీమా చేయించుకోవచ్చు. దీన్నే ‘అంబ్రెల్లా’ లేదా ‘ప్యాకేజీ’ పాలసీలంటారు.

  • అద్దె ఇంట్లో ఉండేవారు కేవలం ఇంట్లో ఉండే సామాగ్రికి, విలువైన వస్తువులకు మాత్రమే వర్తించే ‘హౌస్‌హోల్డర్స్‌ పాలసీ’.

బిల్డింగ్‌ నిర్మాణం

ఒక వేళ ప్రమాదం జరిగితే బిల్డింగ్‌ మరమ్మతులకు లేదా పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

గృహ సామాగ్రి :

  • గృహ సామాగ్రి అయిన ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాహనాలు, వెండి, బంగారు మొదలైన విలువైన వస్తువులు, ఇంకా ఈ ప్రమాదాల వల్ల ఇరుగుపొరుగుకు నష్టం వాటిల్లితే బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

బీమా వర్తించే సందర్భాలు:

  • అగ్నిప్రమాదాలు

  • దొంగతనాలు, దోపిడీలు

  • మెరుపులు

  • విమానం కూలి ప్రమాదం జరిగితే

  • పేలుళ్లు జరిగినప్పుడు

  • తుపాను, వరదలు, మంచతుపాను, వడగళ్లు, పెనుతుపాను

  • అల్లర్లు, నిరసనలు, ఉగ్రవాద చర్యలు

  • కొండచరియలు విరిగిపడటం

  • పెద్ద ట్యాంకులు, పైప్‌లైన్లు విరిగి ప్రమాదం సంభవిస్తే

  • భూకంపాలు

సహజంగా ఈ ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు బీమా పరిధిలోకి వస్తాయి. అయితే పాలసీ ఎంచుకునే ముందు మనకు అవసరమైన అంశాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మంచిది.

కొన్ని పాలసీలు ఇలా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఆ కుటుంబం వేరొక స్థలంలో నివాసం ఉండేందుకు అయ్యే ఖర్చును సైతం ఆరు నెలల వరకు లేదా రూ.లక్ష వరకూ చెల్లిస్తాయి.

గృహ బీమా వర్తించని సందర్భాలు…

  • గృహ సముదాయాన్ని స్వయంగా ధ్వంసం చేసినప్పుడు

  • సహజ పరిస్థితుల్లో కాలం గడిచే కొద్దీ గృహాలు పాతవై దెబ్బతిన్నవాటికి…

  • కాలుష్యం వల్ల కలిగే నష్టాలకు…

  • వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు…

  • యుద్ధాలు జరిగే సమయంలో

  • కంపెనీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 30రోజులకు పైగా నివాసంలో లేని సమయంలో జరిగే నష్టానికి…

మీరు తీసుకున్న బీమా పాలసీలో ప్రత్యేకంగా ఏదైనా అంశం తొలగించి ఉంటే అది వర్తించదు.

బీమా హామీ మొత్తం

గృహ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు, అందులో ఉండే సామాగ్రి… వాటిని కొన్న నాటి నుంచి తరుగుదల పోను ప్రస్తుత విలువకు సమానమైన మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి వస్తుంది.ఈ పాలసీలను వాహన బీమాల మాదిరే ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

నష్టం జరిగినప్పుడు క్లెయిం చేసుకునే పద్ధతి:

  • ప్రమాదం లేదా నష్టం జరిగిన వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందించాలి.

  • బీమా కంపెనీ విచారాణాధికారిని పంపిస్తుంది. ఆ అధికారికి నష్ట వివరాలను, అందుకు సంబంధించిన పత్రాలు, ఫొటోలు, వీడియోలు అందించాల్సి ఉంటుంది.

  • స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ అవసరం ఉండవచ్చు.

  • అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాద నివారణ సహాయక సంస్థ నివేదిక అవసరం రావచ్చు.

క్లెయిం చేసుకునేటప్పుడు ఏదైనా సమస్యలు ఎదురైతే బీమా కంపెనీని సంప్రదించాలి. మన సమస్య పరిష్కారం కాకపోతే ఐఆర్‌డీఏ లేదా అంబుడ్స్‌మన్‌కు లేదా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని