Home loan: కో-బారోయ‌ర్స్‌కీ.. జీవిత బీమా ఉండాలి!

కుటుంబానికి మూలాధారం అయిన వ్య‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా ట‌ర్మ్‌ బీమా పాల‌సీ తీసుకోవాలి

Updated : 29 Jun 2021 14:08 IST

గృహ రుణం ఇచ్చేందుకు.. ప్రైమ‌రీ లెండ‌ర్‌(మొద‌టి లేదా ప్ర‌ధాన రుణ గ్ర‌హీత‌)కు జీవిత బీమా పాల‌సీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ప‌ట్టుబ‌డ‌తాయి కొన్ని సంస్థ‌లు. రుణ‌గ్ర‌హీత పేరుపై అప్ప‌టికే జీవిత బీమా పాల‌సీ వుంటే, అందుకు సంబంధించిన ప‌త్రాల కాపీని రుణ దాత‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. లేదా రుణం తీసుకుంటున్న సంస్థ నుంచి పాల‌సీ తీసుకోవ‌చ్చు.

అయితే.. గృహ రుణం కోసం ఉమ్మ‌డిగా దర‌ఖాస్తు చేసుకుంటే.. స‌హ-ద‌ర‌ఖాస్తుదారుల‌(కో-అప్లికెంట్‌)కూ జీవిత బీమా ఉండాలా? ప్ర‌స్తుత ఉన్న కొవిడ్ ప‌రిస్థితులు.. జీవిత, ఆరోగ్య‌ బీమా పాల‌సీల‌ ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తున్నాయి. సంపాదించే ప్ర‌తి ఒక్క‌రికీ ఒక పాల‌సీ త‌ప్ప‌నిస‌రిగా ఉండడం అవ‌స‌రం. మ‌రీ ముఖ్యంగా గృహ రుణం వంటి దీర్ఘ‌కాలిక రుణాలు తీసుకునే వారికి, రుణం మొత్తం క‌వ‌ర‌య్యేలా జీవిత‌ బీమా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ఉదాహ‌ర‌ణ‌కి, భార్యాభర్తలిద్ద‌రూ ఉద్యోగం చేస్తుండ‌డంతో.. ఆరేళ్ల కింద‌ట భార్య ప్ర‌ధాన ద‌ర‌ఖాస్తు దారు, భ‌ర్త స‌హ-దర‌ఖాస్తుదారుగా క‌లిపి గృహ‌రుణం తీసుకున్నార‌నుకుందాం. భార్య ప్ర‌ధాన ద‌ర‌ఖాస్తుదారు కావ‌డంతో.. రుణం మంజూరు చేయాలంటే ప్ర‌ధాన ద‌ర‌ఖాస్తుదారుని పేరుపై జీవిత బీమా పాల‌సీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని చెప్ప‌డంతో భార్య పేరుపై పాల‌సీ తీసుకున్నారు. అయితే భ‌ర్త కో-అప్లికెంట్ కావ‌డంతో అత‌ని పేరుపై త‌ప్ప‌నిస‌రిగా పాల‌సీ ఉండాలని సంస్థ ప‌ట్టుబ‌ట్ట‌లేదు. దాంతో భ‌ర్త పేరుపై పాలసీ తీసుకోలేదు.

కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత‌.. కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా భార్య ఉద్యోగం వ‌దిలేయ‌వ‌ల‌సి వ‌చ్చింది. భ‌ర్త ఈఎమ్ఐ(ఈక్వీటెడ్ మంత్లీ  ఇన్‌స్టాల్‌మెంట్‌)ను చెల్లింపుల‌ను కొన‌సాగిస్తున్నాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు.. కొవిడ్ కార‌ణంగా భ‌ర్త మ‌ర‌ణించారు. ఇక్క‌డ‌ భార్య ప్రైమ‌రీ అప్లికెంట్‌.. ఆమె జీవించే ఉంది. సంపాదించే వ్య‌క్తి కుటుంబ భాద్య‌త‌ల‌ను నెర‌వేర్చేందుకు త‌గిన బీమా చేయ‌కుండా మ‌ర‌ణించారు. ఇప్పుడు గృహ‌రుణం ఈఎమ్ఐల‌తో పాటు.. కుటుంబ భారం కూడా ఆమెపై ప‌డుతుంది. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ప‌డాల్సిన వ‌స్తుంది.

ఇటువంటి సందర్భాలు సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా భర్త వ్యాపార యజమాని, భార్య ఉద్యోగ‌స్థురాలు అయిన‌ప్పుడు భార్య ప్రైమ‌రీ అప్లికెంట్‌, భర్త కో-అప్లికెంట్‌గా రుణాలు ఎక్కువ‌గా తీసుకుంటారు. కార‌ణం.. జీతం ద్వారా ఆదాయం ఉన్న వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. అంతేకాకుండా చాలా వ‌ర‌కు బ్యాంకులు మ‌హిళ‌ల‌కు వడ్డీరేట్లలో కాస్త రాయితీలు ఇస్తుంటాయి.

ఉదాహ‌ర‌ణ‌కి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. వేతనం ద్వారా ఆదాయం ఉన్న వ్య‌క్తుల‌తో పోలిస్తే, వేతన ఆదాయం లేని వారికి 15 బేసిస్ పాయింట్ల అద‌న‌పు వ‌డ్డీ వ‌ర్తిస్తుంది.  మ‌హిళ‌ల‌కు 5 బేసిస్ పాయింట్ల రాయితీతో రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంది ఎస్‌బీఐ. ఇక్క‌డ ఒక బేసిస్ పాయింట్ 0.01 శాతానికి స‌మానం.

అందువల్ల, సహ-రుణగ్రహీత‌లంద‌రూ జీవిత బీమా పాలసీలు తీసుకోవడం ఉత్తమం, ఆ వ్య‌క్తి కుటుంబానికి మూలాధారం అయితే గృహ రుణాన్ని కవర్ చేయ‌డంతో పాటు కుంటుంబ అవ‌స‌రాల‌కు తీర్చ‌గలిగేంత పెద్ద మొత్తంలో హామీ  సొమ్ము ఉండేలా చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు