Published : 18 Nov 2021 01:54 IST

ShowReel: షోరీల్‌.. ఇకపై వీడియో రూపంలో రెజ్యూమ్‌! 

ఉద్యోగార్థుల కోసం హాట్‌మెయిల్‌ వ్యవస్థాపకుడి నూతన ఆవిష్కరణ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హాట్‌మెయిల్‌’ పేరిట 1996లో సబీర్‌ భాటియా, జాక్ స్మిత్‌ తొలిసారి వెబ్‌ ఆధారిత ఉచిత ఈమెయిల్‌ సర్వీసులను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఏడాదే మైక్రోసాఫ్ట్‌ దాన్ని 400 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇదొక సంచలనం. కట్‌ చేస్తే 2021లో సబీర్‌ భాటియా మరో కొత్త రకం సేవలతో మన ముందుకొచ్చారు. దాని పేరే ‘షోరీల్‌’(ShowReel). టిక్‌టాక్‌ తరహాలో పనిచేసే ఈ ‘సోషల్‌ వీడియో మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం’ను ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకొని రూపొందించారు. 

ఎలా పనిచేస్తుంది?

ప్రముఖంగా షోరీల్‌.. ‘రెజ్యుమ్‌’(Resume) నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అయితే, అది వీడియో రూపంలో రూపొందించడమే దీని ప్రత్యేకత. ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు ముందే యాప్‌లో ఉంటాయి. వాటికి జవాబులు చెబుతూ వీడియో రికార్డ్‌ చేయాలి. ప్రశ్నలన్నీ పూర్తయ్యాక వాటన్నింటినీ కలిపి ఓ పూర్తిస్థాయి వీడియోని రూపొందించాలి. అదే మీ వీడియో రెజ్యుమ్‌. టిక్‌టాక్‌ తరహాలో మీరు కావాలంటే ఇతరుల వీడియో రెజ్యుమ్‌లను కూడా చూడొచ్చు. పైగా మన రెజ్యుమ్‌కి క్యూఆర్‌ కోడ్‌ని కూడా జతచేయొచ్చు. దాన్ని స్కాన్‌ చేయగానే మీ రెజ్యుమ్‌ ఉన్న షోరీల్‌ వీడియో ప్లే అవుతుంది.

కంపెనీలకు ఎలా ఉపయోగం?

షోరీల్‌లో ప్రస్తుతం ప్రొఫెషనల్‌, పర్సనల్‌, స్టార్టప్‌, లీడర్‌షిప్‌ అనే నాలుగు విభాగాల్లో మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సబీర్‌ భాటియా తెలిపారు. వాటన్నింటినీ షోరీల్‌ వేదికపై తీసుకురావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, అవి ఏయే కంపెనీలన్నది మాత్రం వెల్లడించలేదు. ఒకసారి ఈ వేదికపైకి వచ్చిన తర్వాత కంపెనీలు వారి అవసరానికి అనుగుణంగా అభ్యర్థులకు ప్రశ్నలు సంధించొచ్చని తెలిపారు.

వీడియో వద్దనుకుంటే..

సరైన అభ్యర్థుల ఎంపికకు పేపర్‌ కంటే వీడియో రెజ్యుమ్‌లే ఉపయోగకరంగా ఉంటాయని సబీర్‌ భాటియా అభిప్రాయపడ్డారు. అయితే, వీడియోల్లో అభ్యర్థులు నేరుగా కనిపించడం వల్ల కొంత పక్షపాతం కూడా ఉండే అవకాశం లేకపోలేదన్నారు. అలాంటి వారి కోసం వీడియో కాకుండా కేవలం ఆడియో ద్వారానే జబాబులు చెప్పొచ్చన్నారు. అందుకనుగుణంగా షోరీల్‌లో ఏర్పాట్లు చేశామని తెలిపారు.

అవసరమైతే ఎంపిక కూడా..

వీడియో రెజ్యుమ్‌ల వల్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సమయం తగ్గుతుందని సబీర్‌ భాటియా తెలిపారు. కంపెనీలు కోరితే షోరీల్‌ స్వయంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందన్నారు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో కొంతమంది సమర్థుల్ని గుర్తించి కంపెనీకి సూచిస్తామని పేర్కొన్నారు. వారిలో నుంచి సంస్థ మళ్లీ ఇంటర్వ్యూ చేసి కావాల్సిన వారిని తీసుకోవచ్చని తెలిపారు. దీనికి కొంత రుసుము తీసుకుంటామని తెలిపారు. ఇది షోరీల్‌కు ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, అభ్యర్థుల నుంచి మాత్రం పైసా వసూలు చేయబోమన్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లేస్టోర్లలో ఈ యాప్‌ బీటా వెర్షన్‌ అందుబాటులో ఉంది.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని