కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా ఎలా?

ఎస్‌బీఐతో పాటు, ఐసీఐసీఐ, కొటాక్ మ‌హీంద్రా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(బీఓబీ), ఆర్‌బీఎల్ బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు ఈ సేవ‌ల‌ను అందిస్తున్నాయి

Updated : 07 Apr 2021 12:06 IST

కార్డుతో ప‌నిలేకుండా న‌గ‌దును విత్‌డ్రా చేసుకునేంద‌కు ఇది ఒక సర‌ళ‌మైన, సుర‌క్షిత‌మైన మార్గం. భార‌త‌దేశంలో ఎక్క‌డైనా 24x7 ఈ ప‌ద్ధ‌తిలో న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. భార‌తీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో పాటు, ఐసీఐసీఐ, కొటాక్ మ‌హీంద్రా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(బీఓబీ), ఆర్‌బీఎల్ బ్యాంకులు కూడా తమ ఖాతాదారుల‌కు కార్డు ర‌హితంగా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే వీలు క‌ల్పిస్తున్నాయి. ఈ విధానంలో వినియోగ‌దారులు వారి బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎమ్ వ‌ద్ద కార్డు లేకుండా న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఇదేలా ప‌నిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. 

ఎస్‌బీఐ..

ముందుగా యోనో యాప్‌కి లాగ్ అయ్యి యోనో క్యాష్‌పై క్లిక్ చేయాలి. ఇందులో ఉన్న ఏటీఎమ్ సెక్ష‌న్‌ను ఎంచుకుని, ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేయాల‌నుకుంటున్న మొత్తాన్ని ఇక్కడ ఎంట‌ర్ చేయాలి. ఎస్‌బీఐ మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు యోనో క్యాష్ ట్రాన్సేష‌న్ నెంబ‌రును పంపిస్తుంది.  ఖాతాదారుడు ఈ నెంబ‌రు, పిన్ నెంబ‌ర్ల‌ను ఉప‌యోగించి, కార్డు ర‌హిత లావాదేవీలు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఉన్న ఏటీఎమ్ వ‌ద్ద న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ నెంబ‌రు నాలుగు గంటల పాటు ప‌నిచేస్తుంది. 

ఏటీఎమ్ మిష‌న్ వ‌ద్ద..
ఏటీఎమ్ మిష‌న్ మొద‌టి పేజిలో కార్డ్ లెస్ ట్రాన్సేష‌న్ (కార్డు ర‌హిత లావాదేవీలు) ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత పేజిలో యోనో క్యాష్‌ను సెల‌క్ట్ చేసి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

ఐసీఐసీఐ బ్యాంక్..

* 'iMobile' యాప్‌లో లాగిన‌య్యి 'స‌ర్వీసెస్' ఆప్ష‌న్‌లో ఉన్న 'క్యాష్ విత్‌డ్రా ఎట్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్' ను క్లిక్ చేయాలి. 
* విత్డ్రా చేసే మొత్తాన్ని ఎంట‌ర్ చేసి, ఖాతా నెంబ‌రును సెలెక్ట్ చేసి, 4 అంకెల తాత్కాలిక పిన్‌ను సెల‌క్ట్ చేసి, స‌బ్మిట్ చేసిన వెంట‌నే ఓటీపీ(ఒన్ టైమ్ పాస్‌వ‌ర్డ్) వ‌స్తుంది. 
* ఏదైనా ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్ వ‌ద్ద కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాను సెల‌క్ట్ చేసి, మొబైల్ నెంబ‌రు, రిఫ‌రెన్స్ ఓటీపీ నెంబ‌రు, తాత్కాలిక పిన్ నెంబ‌రు, విత్‌డ్రా అమౌంట్‌ని ఎంట‌ర్ చేసి న‌గదు డ్రా చేసుకోవ‌చ్చు. 

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా..

* కార్డు ర‌హితంగా న‌గ‌దు విత్డ్రా చేసేందుకు బిఓబి ఖాతాదారులు ఎమ్-క‌న‌క్ట్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేష‌న్ ద్వారా ఓటీపీని జ‌న‌రేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం బిఓబి మొబైల్ బ్యాంకింగ్‌కి లాగిన‌య్యి, ప్రీమియం స‌ర్వీసెస్ టాబ్‌పై క్లిక్ చేయాలి. 
* ఇందులో క్యాష్ ఆన్ మొబైల్ స‌ర్వీసెస్‌పై టాప్ చేసి అక్కౌంట్ నెంబ‌రు, అమౌంట్ ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయగానే రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. ఈ ఓటీపీ 15 నిమిషాలు మాత్ర‌మే ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల 15 నిమిషాల లోప‌లే ఏటీఎమ్‌కు వెళ్ళి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవాలి. 
* ద‌గ్గ‌ర‌లోని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఏటీఎమ్‌కి వెళ్లి స్క్రీన్‌పై ఉన్న క్యాష్ ఆన్ మొబైల్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి ఓటీపీ, తీసుకోవాల‌నుకుంటున్న న‌గ‌దు ఎంట‌ర్ చేసి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

కొటాక్ మ‌హీంద్రా బ్యాంక్..

* ఇందుకోసం కొటాక్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌కి లాగిన్ చేసి, ల‌బ్ధిదారుని పేరు, మొబైల్ నెంబ‌రు, చిరునామా మొద‌లైన వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి. ఇది ఒక‌సారి చేస్తే స‌రిపోతుంది. 
* ఈ ప్రాసెస్ పూర్తైన త‌రువాత ఖాతాదారుడు,  ఏదైనా కొటాక్ మ‌హీంద్రా బ్యాంక్ ఏటీఎమ్ వ‌ద్ద కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రా లేదా ఇన్‌స్టెంట్ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ ఆన్ ది ఏటీఎమ్ స్క్రీన్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకుని, న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 
* ఏటీఎమ్‌లో మొబైల్ నెంబ‌రు, ఎస్ఎమ్ఎస్ కోడ్, మొబైల్‌లో ఎంత మొత్తం కావాల‌ని ఎంట‌ర్ చేశారో అదే మొత్తం ఇక్కడ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. 

ఆర్‌బీఎల్ బ్యాంక్ ..

* ఈ సేవల‌ను పొందటానికి, ఖాతాదారులు  IMT ఫంక్షన్‌కు మద్దతు ఇచ్చే ఎటిఎమ్ వ‌ద్ద అతని/ఆమె మొబైల్ నంబర్‌ను ఉపయోగించి న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఇందుకోసం ముందుగా ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎమ్ఓబ్యాంక్ యాప్‌కి లాగిన్ అవ్వాలి.
* మొబైల్ యాప్‌లో IMT బటన్‌ను ఎంచుకుంటే ఒక కోడ్ వ‌స్తుంది. ఈ కోడ్‌ను ఉప‌యోగించి ఏటీఎమ్ వ‌ద్ద డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని