ఖాతాలో నెల‌వారి స‌గ‌టు..నిర్వ‌హిస్తున్నారా?

అసలు బ్యాంకులు ఈ నిల్వలను ఎలా గణిస్తాయి.. అపరాధ రుసుము భారం పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

Published : 09 Apr 2021 16:35 IST

మీకు పొదుపు ఖాతా ఉందా? అయితే, అందులో నెలవారీ సగటు నిల్వ (మంత్లీ ఆవరేజ్‌ బ్యాలెన్స్‌) ఉండేలా చూసుకుంటున్నారా? ప్రస్తుతం చాలావ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా నెలవారీ సగటు నిల్వ లేకపోతే అపరాధ రుసుము విధిస్తున్నాయి. చాలామంది పొదుపు ఖాతాదారులు నెలవారీ సగటు నిల్వ, కనీస నిల్వ ఈ రెండింటికీ మధ్య తేడా తెలియక ఇబ్బందిపడుతుంటారు. అసలు బ్యాంకులు ఈ నిల్వలను ఎలా గణిస్తాయి… అపరాధ రుసుము భారం పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి… తెలుసుకుందాం! బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు సేవల‌ను అందించినందుకు గానూ ప్రతిఫలంగా ఏదో ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటాయి. అందుకే, అవి ఈ ఖాతాల్లో నెలవారీ సగటు నిల్వ ఉండాలనే నిబంధనను విధిస్తుంటాయి. ఈ నిల్వ వల్ల బ్యాంకులకు చేతిలో కొంత నగదు కనిపిస్తుంటుంది. రోజువారీ బ్యాంకింగ్‌ లావాదేవీల నిర్వహణకు ఇదే కీలకం కూడా. సాధారణంగా బ్యాంకులు, ఆ శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ నెలవారీ సగటు నిల్వ రూ.1,000 నుంచి రూ.10,000 వరకూ ఉంటుంది. (వేతన ఖాతాలు ప్రత్యేకం) ఈ సగటు నిల్వను ఎలా లెక్కిస్తారు అనేది కూడా చాలామందికి సందేహమే… ఒక నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజూ చివర ఉన్న నిల్వను లెక్కలోకి తీసుకుంటారు. ఈ మొత్తాన్ని అంతా కూడుతారు. ఇలా వచ్చిన మొత్తాన్ని ఆ నెలలో ఉన్న రోజులతో భాగించినప్పుడు నెలవారీ కనీస నిల్వ ఎంత అన్నది తెలుస్తుంది. బ్యాంకు పనిదినాలతో ఇక్కడ సంబంధం ఉండదు. దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం… మీకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంకులో నెలవారీ సగటు నిల్వ రూ.5,000 ఉండాలని నిబంధన ఉందనుకుందాం.

నెలలో మొదటి రోజు బ్యాంకు ఖాతాలో రూ.7,000 ఉన్నాయి. ఐదో తేదీన రూ.3,000 తీసుకున్నారు. 20వ తేది నాడు రూ.10,000 జమ చేశారు… ఇప్పుడు… 1-4వ తేదీ వరకూ రూ.7,000×4=రూ.28,000. 5-19వ తేదీ వరకూ రూ.4,000×15=రూ.60,000. 20-31వ తేదీ వరకూ రూ.14,000×12= 1,68,000. నెలవారీ సగటు నిల్వ = రూ.28,000 + రూ.60,000 + రూ.1,68,000/31 (నెలలో 31 రోజులు ఉన్నాయని అనుకుందాం) = 2,56,000/31= రూ.8,258.06. మీ బ్యాంకు పొదుపు ఖాతాలో నెలవారీ సగటు నిల్వ రూ.8,258.06 ఉన్నట్లు లెక్క. కాబట్టి, ఎలాంటి రుసుములు వర్తించవు. నెలవారీ సగటు నిల్వ నిర్వహించని ఖాతాలపై అపరాధ రుసుము విధించే అధికారం బ్యాంకులకు ఉంది. కనీస నిల్వ లేనప్పుడు నగరాల్లో రూ.15 వరకూ ఉంటే… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో రూ.12 వరకూ అపరాధ రసుము విధిస్తున్నారు.

ఏం చేయాలి?

నెలవారీ కనీస నిల్వను నిర్వహించలేని సందర్భాలు ఉన్నప్పుడు… సున్నా నిల్వ ఖాతాలను ప్రారంభించడం ఉత్తమం. ఇది ప్రాథమిక పొదుపు ఖాతా. దీంతోపాటు ప్రధానమంత్రి జన్‌ ధన్‌ పథకంలో కూడా సున్నా నిల్వ ఖాతాలను ప్రారంభించే ప్రయత్నం చేయవచ్చు. బ్యాంకు ఖాతాను ప్రారంభించేప్పుడే అందులో ఎంత నెలవారీ కనీస నిల్వ ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. బ్యాంకులను బట్టి, నెలవారీ సగటు నిల్వ లెక్క ప్రారంభ, ముగింపు తేదీలు మారుతుంటాయి. ఈ విషయం కూడా బ్యాంకును అడిగి తెలుసుకోవాలి. ఖాతాలో కనీస నిల్వ లేనప్పుడు సందేశం వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల అనవసరమైన రుసుముల భారం తప్పుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని