రుణం కావాలా?.. ఉత్తమ క్రెడిట్‌ స్కోరు ఇదే!

రుణదాతలు మీ దరఖాస్తును తిరస్కరించరని క్రెడిట్ స్కోరు హామీ ఇవ్వదు

Updated : 16 Jul 2021 18:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రుణాలపై  తక్కువ వడ్డీ  రేట్లు పొందడానికి, కోరుకున్న క్రెడిట్ కార్డు కోసం "ఉత్తమ" క్రెడిట్ స్కోరు తప్పనిసరి. అయితే రుణదాతలు, కార్డ్ జారీ చేసేవారు ఉత్తమ క్రెడిట్ స్కోర్‌ను ఏవిధంగా పరిగణనలోకి తీసుకుంటారు? సాధారణంగా  750 ను ఉత్తమ క్రెడిట్ స్కోరుగా పరిగణిస్తారు. క్రెడిట్ స్కోరు బాగున్నప్పటికీ  మీ దరఖాస్తును కొన్నిసార్లు తిరస్కరించవచ్చు. క్రెడిట్‌ కార్డు జారీ చేసేందుకు ఆయా సంస్థలు మరిన్ని అంశాలను  ప‌రిశీలిస్తాయి. కొన్ని ప్ర‌త్యేక కార్డుల‌ కోసం, వారు అధిక స్కోరును కోరవచ్చు.  అధిక క్రెడిట్ పరిమితి ఉన్న ప్రీమియం కార్డుల కోసం కస్టమర్ ప్రొఫైల్‌ను బట్టి 800  కంటే ఎక్కువ స్కోరు ఉండాలని అడ‌గ‌వ‌చ్చు. అందువల్ల "ఉత్తమ" క్రెడిట్ స్కోరు అనేది బ్యాంకు, కార్డు, రుణగ్రహీత నిధుల  ఆధారపడి ఉంటుంది.  నిర్దిష్ట క్రెడిట్ కార్డుపై ఉత్తమ రేట్ల కోసం వెతుకుతున్నప్పుడు  తెలుసుకోవాల్సిన‌ కొన్ని విషయాలు ఉన్నాయి.

ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి భిన్నమైన స్కోరు

భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్‌ హై మార్క్. ప్రతి క్రెడిట్ సమాచార సంస్థ (సీఐసీ) క్రెడిట్ స్కోర్‌లను ఇవ్వడానికి దాని యాజమాన్య ప‌ద్ధ‌తులను ఉపయోగిస్తుంది. అందువల్ల, అవి ఒక బ్యూరో నుంచి మరొకదానికి భిన్నంగా ఉంటాయి. అయితే, ప్రతి సీఐసీ ఇచ్చే స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ట్రాన్స్‌యూనియ‌య‌న్ సిబిల్ ఈ నాలుగింటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇది దేశంలో మొదటి సీఐసీ. చాలా మంది రుణదాతలు సిబిల్ స్కోరు 750  అంతకంటే ఎక్కువ ఉన్న రుణ గ్రహీతలకు ఉత్తమ గృహ రుణ రేట్లను అందిస్తారు. ఉదాహరణకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లను నాలుగు విభాగాల్లో విభజించింది: 750  అంతకంటే ఎక్కువ, 700- 749 మధ్య, 650 -699 మధ్య, 650 కన్నా తక్కువ . క్రెడిట్‌ స్కోరు 750 స్కోరు కన్నా ఎక్కువగా ఉంటే వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి.  తక్కువ స్కోరు ఉన్నవారికి అధిక రేట్లు వసూలు చేస్తుంది.

చాలా బ్యాంకులు సాధారణంగా రుణం లేదా క్రెడిట్ కార్డు  దరఖాస్తుదారుడిని అంచనా వేయడానికి ఒక బ్యూరో  సేవను ఉపయోగిస్తాయి. కొన్ని ఒకటి కంటే ఎక్కువ బ్యూరోలను సంప్ర‌దిస్తాయి. వాటి అంతర్గత పరిమితుల ఆధారంగా వివిధ బ్యూరోల నుంచి స్కోర్‌లను  బేరీజు వేసుకొని ఓ నిర్ణయానికి వస్తాయి. ఉదాహరణకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుందాం. దాని వెబ్‌సైట్ ప్రకారం, సెంట్ హోమ్ లోన్స్ కోసం, సిబిల్, సిఆర్ఎఫ్ హై మార్క్ క్రెడిట్ స్కోర్‌లు 675 కన్నా తక్కువ, ఎక్స్‌పీరియన్ స్కోర్‌లు 700 కంటే తక్కువ ఉన్న వినియోగదారులకు రుణాలు ఇవ్వదు. బ్యాంకు అంతర్గత రిస్క్ రేటింగ్ కోసం, మూడు బ్యూరోల నుంచి స్కోర్‌లలో ఇలాంటి వ్యత్యాసం ఉంటుంది.

కార్డును బట్టి భిన్నమైన స్కోరు

రుణదాతకు క్రెడిట్ స్కోరు అవసరం కార్డును భిన్నంగా ఉండవచ్చు.  గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలకు వేర్వేరు క్రెడిట్ స్కోరును బ్యాంకులు ప‌రిశీలించ‌వ‌చ్చు. సాధారణంగా వ్యక్తిగత రుణాల‌ కంటే గృహ రుణాలకు క్రెడిట్ స్కోరు అవసరం తక్కువగా ఉంటుంది. రుణగ్రహీతకు అవసరమైన నిధుల ఆధారంగా క్రెడిట్ స్కోరును కూడా మార్చవచ్చు. కారు కొనడానికి ఎవరికైనా వాహ‌న రుణం అవసరమనుకుందాం.  రుణగ్రహీత  కారు విలువలో 40 శాతం రుణం అడుగుతున్నారా? లేదా ధరలో 85 శాతం అడుగుతున్నారా అనే దానిని బట్టి క్రెడిట్ స్కోరు  అవసరం భిన్నంగా ఉంటుంది. బ్యాంకులు ప‌రిస్థితుల‌ను బట్టి నిబంధ‌లను కఠినతరం చేస్తాయి. కొవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో చాలావ‌ర‌కు ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నాయి.

అత్యధిక క్రెడిట్ స్కోరు

అత్యుత్తమ క్రెడిట్‌ స్కోరు 900. కానీ,  చాలా తక్కువ మందికే  ఇంత మొత్తంలో క్రెడిట్‌ స్కోరు ఉంటుంది.  కాబ‌ట్టి దాదాపుగా 850 ఉన్న స్కోరును క‌చ్చిత‌మైన స్కోరుగా ప‌రిగ‌ణిస్తారు. 800 లేదా 850 స్కోరు కలిగి  ఉన్న‌ప్ప‌టికీ అది మంచి స్కోరుగానే భావిస్తారు. కొంత‌మందికి తక్కువ క్రెడిట్ వినియోగం ఉండవచ్చు. లేదా ఎక్కువ కాలం క్రెడిట్ చరిత్ర కలిగి ఉండవచ్చు లేదా ఇటీవల రుణాల కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌చ్చు.  అలాంటి సందర్భాల్లో  కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు