క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ గురించి పూర్తిగా తెలుసా.. 

సాధారణంగా కొంతమంది కేవలం ఈఎమ్ఐ మొత్తం మాత్రమే క్రెడిట్ కార్డు నుంచి డిడక్ట్ అవుతుందని భావిస్తారు

Updated : 29 Apr 2021 15:06 IST

చాలా కాలంగా మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఒక ఆన్ లైన్ స్టోర్ లో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ను చూశారు. అది పండగ సీజన్ కావడంతో ఆ ఫోన్ పై సుమారు 40 నుంచి 45 శాతం మేర తగ్గింపు కూడా లభిస్తుండ‌డంతో వెంటనే దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. అన్ని డిస్కౌంట్ లు పోగా దాని ధర రూ. 35,594 గా ఉంది. అలాగే మీరు ‘బై నౌ’ ఆప్షన్ కింద ఒక చిన్న లైన్ ని కూడా గమనించారు. అదేంటంటే, క్రెడిట్ కార్డు ద్వారా నెలకు సుమారు రూ. 1,700 నుంచి మొదలుకొని సమానమైన నెలవారీ వాయిదాలలో (ఈఎమ్‌ఐ) ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. మీరు వెంటనే కొనుగోలు చేయకుండా, ఒక్క నిమిషం అలోచించి ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి. సాధారణంగా కొంతమంది కేవలం ఈఎమ్‌ఐ మొత్తం మాత్రమే క్రెడిట్ కార్డు నుంచి డిడక్ట్ అవుతుందని భావిస్తారు, కానీ మీరు చేసిన లావాదేవీ మొత్తం ముందుగా మీ క్రెడిట్ కార్డు నుంచి డిడెక్ట్ అవుతుంది. అనంతరం ఈ మొత్తం ఈఎమ్‌ఐ కింద మారుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 75,000 అనుకుంటే, మీరు స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడానికి రూ. 35,594 ఖర్చు చేశారు. అనంతరం మీ కార్డులో కేవలం రూ. 40,000 మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో మీ భవిష్యత్తు అవసరాలకు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు కొన్ని నెలల పాటు విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నట్లైతే, అప్పుడు మీరు మీ ఆర్ధిక అవసరాలను పునఃనిర్మించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ క్రెడిట్ పరిమితి సుమారు సగానికి తగ్గిపోయింది.

ఎలా పనిచేస్తుంది? 

మీరు క్రెడిట్ కార్డు ద్వారా రూ. 35,594 తో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేటప్పుడు, వెబ్ సైట్ చెల్లింపు విభాగం మీ క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాల్సిందిగా అడుగుతుంది. అనంతరం ఈఎమ్‌ఐ కాలపరిమితిని ఎంచుకోవాల్సిందిగా అడుగుతుంది. సాధారణంగా ఈఎమ్ఐ కాలపరిమితి అనేది 3 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఒకవేళ మీరు ఒక సంవత్సర ఈఎమ్‌ఐ కాలపరిమితిని ఎంచుకున్నట్లైతే, 14 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 3,196 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీరు స్మార్ట్ ఫోన్ కోసం చెల్లించే పూర్తి మొత్తం రూ. 38,352 గా ఉంటుంది, దీనిలో వడ్డీ కింద అదనంగా రూ. 2,759 లను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ లావాదేవికి ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకు విధిస్తుందో లేదో తనిఖీ చేసుకోండి. ఒకవేళ మీరు ఆఫ్ లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

ఏమి చేయాలి?

క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈఎమ్‌ఐల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం తప్పు కాదు. నిజానికి ఇది రివాల్వింగ్ క్రెడిట్ పై వడ్డీ రేటును చెల్లించడం కంటే చవకగా లభిస్తుంది, ఇది సంవత్సరానికి 36 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ క్రెడిట్ కార్డును యాక్టీవ్ గా ఉంచుకోడానికి మీరు రూ. 1,779.65 కనీస మొత్తాన్ని (మొత్తం బిల్లులో 5 శాతం) చెల్లించవలసి ఉంటుంది.

అయితే, ఈఎంఐలను ఎంచుకోవడానికి ముందు, మీ భవిష్యత్తు అవసరాలకు కావలసిన నిధుల కోసం ప్రత్యామ్నాయ వనరులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటే, ఒక కార్డును ఈఎంఐల కోసం, మరోక కార్డును భవిష్యత్తు అవసరాలకు, అత్యవసర పరిస్థితులకు కావలసిన నిధుల కోసం వినియోగించండి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని