Rule Of 72: పెట్టుబ‌డి రెట్టింపు .. ఎపుడు, ఎలా?

మ‌నం పెట్టిన పెట్టుబ‌డికి  ప్ర‌తిఫ‌లం రావ‌డానికి వివిధ ప‌థ‌కాల‌కు కాల‌వ్య‌వ‌ధులు మారిపోతూనే ఉంటాయి.

Updated : 05 Oct 2021 11:34 IST

పెట్టుబ‌డి ప‌థ‌కాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఏ ప‌థ‌కానికి కూడా ఒకే కాల‌వ్య‌వ‌ధికి స‌మాన‌మైన ప్ర‌తిఫ‌లం ల‌భించ‌దు. మ‌నం పెట్టిన పెట్టుబ‌డికి  ప్ర‌తిఫ‌లం రావ‌డానికి వివిధ ప‌థ‌కాల‌కు కాల‌వ్య‌వ‌ధులు మారిపోతూనే ఉంటాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ల‌లో ఇంకా ఏ ప‌థ‌కంలో అయినా స‌రే వార్షిక వ‌డ్డీ రేటును బ‌ట్టి మీ డ‌బ్బు ఎంత స‌మ‌యానికి రెట్టింపు అవుతుందో తెలుసుకోవాలంటే `రూల్ 72`ని ఉప‌యోగించాలి. మీ డ‌బ్బు పెర‌గ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసుకునే ముందు, మీరు పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్న ల‌క్ష్యాలు, పెట్టుబ‌డి వ్య‌వ‌ధిని నిర్ణ‌యించ‌డం చాలా ముఖ్యం. మీ ల‌క్ష్యాలు, రాబ‌డుల ఆధారంగా ప‌థ‌కాల‌ను షార్ట్‌లిస్ట్ చేయ‌వ‌చ్చు.

పీపీఎఫ్‌, ఎస్ఎస్‌వై (సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌), ఇత‌ర పోస్టాఫీసు ప‌థ‌కాల‌తో కూడిన చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వడ్డీ రేట్ల‌ను, బ్యాంక్ డిపాజిట్ల రేట్లను అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో వ‌రుస‌గా 6వ త్రైమాసికానికి ప్ర‌భుత్వం య‌థాత‌ధంగా ఉంచింది. మీ పెట్టుబ‌డులు ఎంత వేగంగా మీ డ‌బ్బును రెట్టింపు చేస్తాయో చూడ‌టానికి ఇక్క‌డ `రూల్ 72`ని ఉప‌యోగించ‌వ‌చ్చు. `రూల్ 72` అనేది ఒక ఫార్ములా. ఇక్క‌డ మీరు `72` అనే సంఖ్య‌ను పెట్టుబ‌డి ప‌థ‌కం అందించే వ‌డ్డీ రేటుతో విభ‌జించి మీ డ‌బ్బు ఎంత కాలానికి రెట్టింపు అవుతుందో తెలుసుకోవ‌చ్చు. ఏ ప‌థ‌కంలో మీ పెట్టుబ‌డులు వేగంగా రెట్టింపు అవుతాయో తెలుసుకున్న త‌ర్వాత మంచి ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌డం సుల‌భం అవుతుంది.

రూల్ 72 ఫార్ములాః
ప్ర‌స్తుతం బ్యాంక్ ఎప్‌డీలు పెట్టుబ‌డిదారుల‌కు దాదాపు 5.5% వ‌డ్డీని అందిస్తున్నాయి. ఫార్ములా `72` ఉప‌యోగించి చూస్తే.. 72/5.5=13.09. మీ డ‌బ్బు బ్యాంక్ ఎఫ్‌డీలో రెట్టింపు కావ‌డానికి సుమారు 13 సంవ‌త్స‌రాలు పైగా ప‌డుతుంది.

పీపీఎఫ్ వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతానికి 7.1%గా ఉంది. పీపీఎప్ వ‌డ్డీ రేటు మార‌దు అని అనుకుంటే 72 ఫార్ములా ఉప‌యోగించి చూస్తే `72/7.1=10.14`. మీ డ‌బ్బు పీపీఎఫ్‌లో రెట్టింపు కావ‌డానికి దాదాపు 10 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది.

పోస్టాఫీసు సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (ఎస్ఎస్‌వై) వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతం 7.6%. భ‌విష్య‌త్తులో ఈ వ‌డ్డీ రేటు మార‌దు అనుకుంటే.. `72/7.6=9.47`. మీ డ‌బ్బు రెట్టింపు కావ‌డానికి 9 సంవ‌త్స‌రాలు పైగా ప‌డుతుంది. రూల్ 72.. ఆర్ధిక అంచ‌నాల‌కు, వ‌డ్డీ స్వ‌భావాన్ని బాగా అర్ధం చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

మీ పెట్టుబ‌డి ఎన్ని సంవ‌త్స‌రాల‌కు రెట్టింపు అవుతుందో తెలిస్తే కూడా ఈ `ఫార్ములా 72తో` మ‌న‌కు ల‌భించే వార్షిక వ‌డ్డీ రేటును తెలుసుకోవ‌చ్చు. ఉదాః మ‌న పెట్టుబ‌డి 8 సంవ‌త్స‌రాల‌లో రెట్టింపు అవుతుంది అనుకుంటే.. `72/8=9` మ‌న‌కు ల‌భించే వార్షిక వ‌డ్డీ రేటు 9%.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని