క్రెడిట్ కార్డులు ఎన్ని ఉంటే మంచిది?

మీ జీవనశైలి, ఖర్చుల ఆధారంగా క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవాలి

Published : 11 May 2021 15:07 IST

ఈ రోజుల్లో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులను అందించే బ్యాంకుల నుంచి సందేశాలు, ఫోన్ కాల్స్ రావడం సర్వసాధారణమైన విషయం. నవంబర్, 2016న ప్రధాని నరేంద్ర మోదీ కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకులు మరింత దూకుడును పెంచాయి. ఈ చర్య కారణంగా అధిక మొత్తంలో డబ్బు బ్యాంకులకు చేరింది. అప్పటి నుంచి బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వను బయటికి పంపడానికి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను ఇవ్వడం మొదలుపెట్టాయి.

క్రెడిట్ కార్డులను ఇవ్వడానికి బ్యాంకులు ఎందుకు ఆసక్తిని చూపిస్తాయి..
ఒకరకంగా క్రెడిట్ కార్డు భద్రత లేని వ్యక్తిగత రుణం అని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 2017 నాటికి దేశంలో కేవలం 3.47 మిలియన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మొత్తం డెబిట్ కార్డుల సంఖ్యలో ఇది కేవలం 4.17 శాతం మాత్రమే. చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు ఒక్క డెబిట్ కార్డును మాత్రమే కలిగి ఉండగా, అనేక మంది బ్యాంకు ఖాతాదారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. క్రెడిట్ సలహాదారు అయిన క్రెడిట్ సుధార్ ప్రకారం, భారతదేశంలో సగటున ఒక క్రెడిట్ కార్డు వినియోగదారుడు రెండు క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నాడు.

ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండడం వలన కలిగే ప్రయోజనం ఏంటి..
విశ్వసనీయత ఆధారంగా బ్యాంకులు మీ రుణ పరిమితిని నిర్ణయిస్తాయి, గతం నుంచి మీ ఆర్ధిక లావాదేవీలను ఎలా నిర్వహిస్తున్నారనేది మాత్రమే కాకుండా మీ బ్యాంక్ ఖాతాలో నగదు లావాదేవీలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కావున, మీరు మంచి నగదు ప్రవాహన్ని కలిగి ఉండి లేదా మీ ఖాతాలో ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ ఉన్నట్లయితే, బ్యాంకు మీకు క్రెడిట్ కార్డును అందించడానికి సిద్ధంగా ఉంటుంది. వినియోగదారునికి క్రెడిట్ కార్డు వలన కలిగే అతిపెద్ద లాభం ఏమిటంటే, ఇది 45 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ ను అందిస్తుంది. అంతేకాక, మొత్తం బకాయిని చెల్లించడం తప్పనిసరి కాదు. వినియోగదారుడు కనీస చెల్లింపు మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తరువాత చెల్లించవచ్చు. ఒకవేళ మీరు కనీస మొత్తాన్ని చెల్లించినట్లయితే, మీరు ఆలస్యపు చెల్లింపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, మీరు మిగిలిన మొత్తం పై వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్డుల్లో కొన్ని కార్డులు ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ట్రావెల్ క్రెడిట్ కార్డులు లేదా ఎయిర్ లైన్ క్రెడిట్ కార్డులను వినియోగించి ఎయిర్ లైన్ బుకింగ్ చేసుకున్నట్లైతే, వాటి పై రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. అలాగే ఇంధన క్రెడిట్ కార్డులు కూడా ఇదే కేటగిరి కిందకు వస్తాయి, ఈ కార్డుల ద్వారా ఇంధన కొనుగోలు చేసినట్లయితే, రివార్డ్ పాయింట్లు వస్తాయి.

మీ జీవనశైలి, ఖర్చుల ఆధారంగా క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంధనంపై ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లైతే, ఇంధనంపై రివార్డ్ పాయింట్లను, డిస్కౌంట్లను అందించే కార్డులను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీరు తరచుగా విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నట్లైతే, ఎయిర్పోర్ట్ లాంజ్ సౌకర్యాన్ని అందించే కార్డులకు ఎంపిక చేసుకోవడం మంచిది. ఇదే విధంగా మీరు ఎలాంటి వాటికి ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తారో, దానికి సంబంధించిన కార్డులను ఎంచుకోండి.

క్రెడిట్ కార్డు లోపాలు..
మీరు కేవలం ఒక్క కార్డును మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ, దానిని వినియోగించడంలో స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ లేకపోతే, క్రెడిట్ కార్డు అందించే ప్రయోజనాలు వెంటనే లోపాలుగా మారవచ్చు. ఒక వ్యక్తి క్రెడిట్ కార్డును ఉపయోగించి, పూర్తి అవుట్ స్టాండింగ్ మొత్తన్ని చెల్లించకుండా, కేవలం కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోతే, దానిపై అధిక వడ్డీని చెల్లించే ప్రమాదం ఉంటుంది. అది మీ క్రెడిట్ స్కోర్ ను దెబ్బతీయడంతో పాటు మిమ్మల్ని రుణ ఉచ్చులోకి నెట్టివేయవచ్చు. అంతేకాకుండా, క్రెడిట్ కార్డు కలిగి ఉండటం వలన అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దారితీయవచ్చు, ఇలా చేయడం ద్వారా మీరు సంపాదించే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందులలోకి నెట్టివేయవచ్చు.

ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండడం మంచిది..
చాలా మంది వినియోగదారులు రెండు క్రెడిట్ కార్డులను కలిగి ఉండడానికి ఇష్టపడతారు. వ్యక్తిగత, వ్యాపార ఖర్చులను విడివిడిగా నిర్వహించడం కోసం లేదా ఒక ప్రత్యేకమైన కేటగిరి కోసం ఖర్చు చేయడానికి రెండు కార్డులను వినియోగించవచ్చు. అలాగే ఒక వ్యక్తి ప్రయాణం చేసే సమయంలో, కొన్ని ప్రదేశాల్లో ఒక కార్డుకు సంబంధించన నెట్ వర్క్ పని చేయకపోతే, అలాంటి సమయంలో రెండు కార్డులు ఉండడం మంచిది. అదే సమయంలో, ఒకటి కంటే ఎక్కువ కార్డులను కలిగి ఉండడం వలన ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే అవకాశం ఉంది.

చివరగా మీరు క్రెడిట్ కార్డు అందించే సౌకర్యాలను ఉపయోగించినప్పుడు ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. కనీస బ్యాలెన్స్ ను మాత్రమే చెల్లించకుండా పూర్తి బకాయి మొత్తాన్ని చెల్లించడం మంచిది. దీని ద్వారా మీరు రుణ ట్రాప్ నుంచి బయట పడొచ్చు. అలాగే మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బ తినకుండా చూసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని