క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ  హామీ మొత్తం ఎంత ఉండాలి? 

అనుకోకుండా వ‌చ్చే తీవ్ర వ్యాదుల చికిత్స ఖ‌ర్చుల‌ను భ‌రించాలంటే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వర్ చాలా అవ‌స‌రం   

Published : 02 Feb 2021 12:37 IST

క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, ఇతర ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి, కేసులు సంఖ్య రోజు రోజుకి  పెరుగుతున్న తరుణంలో, సాధార‌ణ ఆరోగ్య బీమాతో పాటు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ ఆరోగ్య బీమా అవ‌స‌రం కూడా ఉంది. ఈ కార‌ణంగానే చాలా మంది క్రిటిక‌ల్ ఇలెనెస్ పాల‌సీ తీసుకుంటున్నారు. కానీ కొన్ని త‌ప్పులు కూడా చేస్తున్నారు.  క్రిటిక‌ల్ ఇలెనెస్ పాల‌సీలో త‌ర‌చుగా చేసే రెండు త‌ప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మొద‌టిది, క్రిటిక‌ల్ ఇలెనెస్ పాల‌సీని రైడ‌ర్‌గా కొనుగోలు చేసే అవ‌కాశం ఉండ‌డంతో, చాలామంది దీన్ని రైగ‌ర్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఇక రెండో త‌ప్పు, త‌గినంత క‌వ‌రేజ్ లేక‌పోవ‌డం. 

విడిగా ఎందుకు తీసుకోవాలి?

సాధార‌ణ బీమా పాల‌సీతో క్రిటిక‌ల్ ఇలెనెస్ రైడ‌ర్‌గా అందుబాటులో ఉన్న‌ప్పుడు విడిగా ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే..ట‌ర్మ్ జీవిత బీమాతో వ‌చ్చే క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌ ఆరోగ్య బీమా రైడ‌ర్, పాల‌సీలో పేర్కొన్న నిర్ధిష్ట  వ్యాధుల‌ను మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తుంది. ఇందులో కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు మాత్ర‌మే క‌వ‌ర్ అవుతాయి.  అంతేకాకుండా హామీ మొత్తం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. రూ.1కోటి హామీతో కూడిన జీవిత బీమా పాల‌సీని తీసుకుంటే, క్రిటిక‌ల్ ఇలెనెస్ పాల‌సీ రైడ‌ర్‌కు రూ.5 నుంచి రూ.10 లక్ష‌ల క‌వ‌రేజ్ మాత్ర‌మే ఉంటుంది. ఈ మొత్తం అవ‌స‌రాల‌కు స‌రిపోదు. 

ఈ రోజుల్లో ఏదైనా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య(ఉదాహ‌ర‌ణ‌కు క్యాన్స‌ర్‌) వ‌స్తే,  చికిత్సకు అయ్యే ఖ‌ర్చు క‌నీసం రూ.25 ల‌క్ష‌ల నుంచి రూ.30 ల‌క్ష‌ల‌ వ‌ర‌కు అవుతుంది. దీనికి తోడు ఆదాయం కోల్పోవ‌డం, అద‌న‌పు ఖ‌ర్చులు కూడా ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల మొత్తం ఎందుకు స‌రిపోదు. 


ఎంత మొత్తం అవ‌స‌రం.. ఎలా లెక్కించాలి?

ట‌ర్మ్ జీవిత బీమా మాదిరిగానే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్‌జ్‌ని అంచ‌నా వేసేందుకు ఉత్త‌మ మార్గం, అందుకు అయ్యే అన్ని ఖ‌ర్చుల‌ను తెలుసుకోవ‌డం. 

5 సంవ‌త్స‌రాల ఆదాయ‌, వ్య‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి  తీసుకుని లెక్కిస్తే..

నెల‌వారీగా త‌ప్ప‌నిస‌రైన ఖ‌ర్చులు, చెల్లించాల్సిన రుణాల‌కు (గృహ రుణం, కారు రుణం వంటివి) అయ్యే వ్య‌యం రూ.80వేలు అనుకుందాం. దీని ప్ర‌కారం వ‌చ్చే ఐదేళ్ళ‌లో భ‌విష్య‌త్తు గృహ అవ‌స‌రాలకు రూ.48 లక్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌లు కావాలి.  తీవ్ర అనారోగ్యానికి చికిత్స కోసం అయ్యే ఖ‌ర్చు రూ.30 ల‌క్ష‌లు.

కుంటుంబంలోని సంపాదించే వ్య‌క్తుల‌లో మీరు రెండో వారు అనుకుందాం. మీరు అందించే స‌హ‌కారం నెల‌కు రూ.50 వేలు అనుకుంటే 5 సంవ‌త్స‌రాల‌లో మీరు ఇచ్చే మొత్తం రూ.30 ల‌క్ష‌లు. అనుకోని ప‌రిస్థితుల కోసం ఏర్పాటు చేసుకున్న అత్య‌వ‌స‌ర నిధి మొత్తం రూ. 10 ల‌క్ష‌లు. 

మీ వ్య‌యం మొత్తం నుంచి ఆదాయం, అత్య‌వ‌స‌ర నిధి మొత్తాన్ని తీసివేయ‌గా మిగిలిన మొత్తం క్రిటిక‌ల్ ఇల్‌నెస్ హామీ మొత్తంలో క‌వ‌ర్ అయ్యే విధంగా పాల‌సీని తీసుకోవాలి. 

పైన తీసుకున్న ఉదాహ‌ర‌ణ‌లో  
ఐదేళ్ళ‌కు అయ్యే నెల‌వారీ ఖ‌ర్చులు రూ.50 ల‌క్ష‌లు +  తీవ్ర అనారోగ్య చికిత్స ఖ‌ర్చు రూ.30 ల‌క్ష‌లు = రూ.80 ల‌క్ష‌లు నుంచి ఐదేళ్ళ ఆదాయం రూ.30 ల‌క్ష‌లు + అత్య‌వ‌స‌ర నిధి రూ.10 ల‌క్ష‌లు = రూ. 40 ల‌క్ష‌ల‌ను తీసివేయ‌గా మిగిలిన రూ.40 ల‌క్ష‌ల‌కు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాలీసీ తీసుకోవాలి. ఈ విధంగా ఆదాయం, ఖ‌ర్చులు, చెల్లించాల్సిన రుణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంత క‌వ‌రేజ్ అవ‌స‌ర‌మ‌వుతుందో లెక్కించ‌వ‌చ్చు. 

వ్య‌య అంచ‌నా భ‌విష్య‌త్తులో మారే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ప్ర‌తీ ఐదేళ్ళ‌కు ఒక‌సారి కావ‌ల‌సిన మొత్తాన్ని అంచ‌నా వేసుకుని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పాల‌సీని అప్‌గ్రేడ్ చేసుకోవ‌డం మంచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని