25 ఏళ్ల‌లో ₹10 కోట్లు కూడ‌బెట్టాలంటే...

నెల‌వారి చిన్న మొత్తాల‌తో ఎక్కువ మొత్తాన్ని కూడ‌బెట్ట‌డంలో సిప్ విధానం స‌హాయ‌ప‌డుతుంది

Updated : 21 Jun 2021 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భార‌తదేశంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు సాధార‌ణంగా 60 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌సును దృష్టిలో పెట్టుకునే చాలామంది  ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ప్ర‌ణాళిక చేస్తుంటారు. ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం జీవితం కోసం కావ‌ల‌సిన మొత్తాన్ని కూడ‌బెట్టిన వారు ఈ వ‌య‌సు కంటే ముందుగానే ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌వ‌చ్చు. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం, త్వ‌ర‌గా రిటైర్‌మెంట్ తీసుకోవాలి.. అనే కోరిక ఉన్న‌వారు పెట్టుబ‌డుల‌ను కూడా వీలైనంత త్వ‌ర‌గానే ప్రారంభించాలి. అంటే క‌నీసం 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెట్టుబ‌డుల‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్‌లలో సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌ ) ద్వారా పెట్టుబ‌డులు చేయాలి.  నెల‌వారీగా చిన్న మొత్తాల‌తో ఎక్కువ మొత్తాన్ని కూడ‌బెట్ట‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అయితే ఇందులో పెట్టుబ‌డుల‌ను దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగించాలి. 

50 ఏళ్లు వ‌చ్చేస‌రికి ₹10 కోట్లు కూట‌బెట్ట‌డం సాధ్య‌మేనా అంటే...  సాధ్య‌మే అంటున్నారు నిపుణులు. దీనికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాటు, పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక అవ‌స‌రం. కెరీర్‌ ప్రారంభంలోనే ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాలి. 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే రిటైర్‌మెంట్ కోరుకునే వారు 25 ఏళ్ల వ‌య‌సులోనే ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి కోసం పెట్టుబ‌డులు ప్రారంభించాలి. ఈ వ‌య‌సులో సంపాద‌న ఉంటుంది కానీ భారీ మొత్తంలో మ‌దుపు చేయ‌డం సాధ్యం కాదు. ఇటువంటి పెట్టుబ‌డిదారుల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ అనుకూలంగా ఉంటుంది. ఈ చిట్కా ద్వారా ఎక్కువ మొత్తంలో కార్ప‌స్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. 

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ద్వారా దీర్ఘ‌కాలంలో 12 నుంచి 15 శాతం రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కేవ‌లం సిప్ చేయ‌డం ద్వారా మాత్ర‌మే ప్రతిష్ఠాత్మక ల‌క్ష్యాన్ని చేరుకోలేరు. ప్ర‌తీ సంవ‌త్స‌రం పెట్టుబ‌డుల‌ను పెంచుతుండాలి. ఒక వ్య‌క్తి పెట్టుబ‌డిలో వార్షిక స్టెప్‌-అప్ 10 శాతం ఉండేలా చూసుకోవాలి. ప్ర‌తి సంవత్సరం వ్య‌క్తి ఆదాయంలో పెరుగుద‌ల ఉంటుంది. దీంతోపాటే పెట్టుబ‌డుల‌ను పెంచే ఆలోచ‌న చేయాలి. నెల‌వారి సిప్‌లో 10 శాతం వార్షిక స్టెప్‌-అప్‌.. ₹10 కోట్ల ల‌క్ష్యాన్ని సుల‌భంగా చేరుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌లో నెల‌వారి సిప్‌, వార్షిక స్టెప్‌-అప్‌లు మ‌దుప‌ర్ల పెట్టుబ‌డుల‌పై గ‌రిష్ఠ కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తాయి. 

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ క్యాలిక్యులేట‌ర్ ప్ర‌కారం, ఒక వ్య‌క్తి.. త‌న 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో సిప్‌ను ప్రారంభిస్తే, 12 శాతం వార్షిక రాబ‌డి అంచ‌నాతో, 50 ఏళ్ల వ‌య‌సుకు ₹10 కోట్ల ల‌క్ష్యాన్ని చేరుకునేంద‌కు నెల‌కు ₹25,000 పెట్టుబ‌డి పెట్టాలి. 10 శాతం వార్షిక స్టెప్‌-అప్ రేటు ఉండాలి. ఇక్క‌డ అత‌ను/ఆమె పెట్టుబ‌డి పెట్టిన మొత్తం ₹2.95 కోట్లు, మొత్తం రాబ‌డి ₹7.32 కోట్లు, మెచ్యూరిటీ మొత్తం ₹10.27 కోట్లు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని