జీవిత, ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం ఎంతమేరకు అవసరం?

వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో పరిగణలోకి తీసుకోని సాధనాల్లో బీమా ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Updated : 17 Oct 2022 14:12 IST

భారతదేశంలో అనేక సంవత్సరాలుగా జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు ఏంతో ప్రాచుర్యం పొందాయి, ఇప్పటికీ చాలా మంది బీమా పాలసీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేరు, వారి జీవితంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారికి కొంత పాఠం నేర్పుతుంది. ఏదేమైనా, ప్రస్తుతమున్న సమయంలో ఎవరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడం, ఇతరులను కలవడం కూడా ప్రమాదకరంగా ఉన్న ఇటువంటి సమయంలో, ఒక వ్యక్తి జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేసే సామర్ధ్యం ఉండి కూడా తీసుకోకపోతే, అలాంటి వారు ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని నిపుణుల అభిప్రాయం.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మనపై, మన కుటుంబంపై గణనీయమైన ఆర్థిక ఒత్తిడిని కలిగించే అనిశ్చిత సంఘటనల కారణంగా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం ద్వారా ఒకవేళ ఏదైనా అనిశ్చితి తలెత్తినప్పుడు కనీసం మన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో పరిగణలోకి తీసుకోని సాధనాల్లో బీమా ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీమా ప్రాముఖ్యత సంవత్సరాలుగా పెరిగినప్పటికీ, ప్రజలు తమ పోర్ట్‌ఫోలియోలో అధిక ప్రాధాన్యత కలిగి ఉండాల్సిన ఉత్పత్తులలో ఒకటిగా బీమాను ఇప్పటికీ పరిగణించడం లేదు.

ఆరోగ్య బీమా :

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న కొత్త వ్యాధి కారణంగా, వైద్య ఖర్చుల నుంచి బయటపడడానికి ప్రజలు ఆరోగ్య బీమా వైపు చూస్తున్నారు. COVID-19 వంటి వ్యాధి అన్ని వయస్సుల వారికి సోకుతుండడంతో, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండటం మంచిదని నిపుణులు తెలిపారు. ప్రజలు తమ ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకునేటప్పుడు, ఆరోగ్య బీమాను మొదటి ప్రాధాన్యంగా పరిగణించాలి. ప్రజలు వారి అవసరాల ఆధారంగా, తమ కోసం లేదా కుటుంబం కోసం ఒక వ్యక్తిగత పాలసీని ఎంచుకోవచ్చు లేదా మొత్తం కుటుంబాన్ని ఒకే పాలసీలో కవర్ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

బీమా పాలసీని కలిగి ఉండటం వలన ఊహించని వైద్య పరిస్థితుల నుంచి పాలసీ హోల్డర్ ను రక్షిస్తుంది. పాలసీలో పేర్కొన్న విధంగా వైద్య, ఆసుపత్రి ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది. కనీసం రూ. 5 లక్షల బీమా మొత్తంతో ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోండి. అలాగే వివిధ బీమా సంస్థలు అందించే పాలసీలను పోల్చి చూసి, మీకు సరిగ్గా సరిపోయే పాలసీని ఎంచుకోండి.

క్రిటికల్ ఇల్నెస్ కవర్ :

సాధారణంగా, ఆరోగ్య బీమా పధకాలు క్రిటికల్ ఇల్నెస్ లేదా ప్రాణాంతక వ్యాధులను కవర్ చేయవు. కణితులు, క్యాన్సర్, గుండె రుగ్మతలు వంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో పాలసీదారులకు క్రిటికల్ ఇల్నెస్ ప్రణాళికలు సహాయపడతాయి. ఈ అనారోగ్యాలకు చేసే చికిత్స చాలా ఖరీదైనది. సాధారణంగా, ఇలాంటి పరిస్థితులలో ఆరోగ్య బీమా పాలసీలు ఎలాంటి చెల్లింపులు చేయవు. అయితే, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అందించే స్థిర ప్రయోజనం, చికిత్స కోసం పాలసీదారునికి పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రిటికల్ ఇల్నెస్ కవర్ బీమా మొత్తం సాధారణ ఆరోగ్య బీమా పాలసీకి 4 నుంచి 5 రెట్లు ఉండాలి.

జీవిత బీమా :

ఒకవేళ పాలసీదారుడు ఆకస్మికంగా మరణిస్తే, పాలసీదారుడి కుటుంబానికి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ టర్మ్ లో ప్రమాదం నుంచి బయటపడితే సంస్థ ఎలాంటి హామీ మొతాన్ని చెల్లించదు, పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత మీరు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీని ఎంత చిన్న వయస్సులో తీసుకుంటే అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ పాలసీని తీసుకోవాలనుకుంటే పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మీరు మొదటిసారి పాలసీని కొనుగోలు చేసినప్పుడు ఎంతైతే ప్రీమియంను చెల్లించారో, ఆఖరి వరకు మీకు అదే ప్రీమియం వర్తిస్తుంది. అందుకే చిన్న వయస్సులోనే పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం అవుట్‌గో తక్కువగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు