కొత్త‌గా గృహ‌రుణం.. ఈఎమ్ఐ త‌గ్గించుకోవడం ఎలా? 

గృహ విలువ‌లో ఎల్‌టీవీ రేషియో త‌గ్గితే ఈఎమ్ఐ త‌గ్గుతుంది. కాబ‌ట్టి డౌన్‌పేమెంట్ ఎక్కువ‌గా ఉండేట్లు చూసుకోవాలి.

Updated : 13 Jul 2021 18:51 IST

గృహ‌రుణం ఈఎమ్ఐను నిర్ణ‌యించేవి ప్ర‌ధానంగా రెండు అంశాలు.. మొద‌టిది వ‌డ్డీ రేటు, రెండు చెల్లింపుల‌కు ఎంచుకునే కాల‌ప‌రిమితి. కొత్త‌గా గృహ రుణం తీసుకున్న వారు దిగువన పేర్కొన్న మూడు అంశాల‌ను దృష్టిలో ఉంచుకుంటే ఈఎమ్ఐను త‌గ్గించుకోవ‌చ్చు. 

1. త‌క్కువ ఎల్‌టీవీ..

ఆస్తి విలువలో బ్యాంకులు లేదా ఇత‌ర రుణ సంస్థ‌ల‌ నుంచి పొందే రుణ శాతమే ఎల్‌టీవీ రేషియో. మిగిలిన మొత్తాన్ని రుణ గ్ర‌హీత సొంతంగా స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. సాధార‌ణంగా గృహ మొత్తం విలువ‌లో 80 నుంచి 85 శాతం వ‌ర‌కు రుణం ఇస్తుంటాయి. మ‌రికొన్ని సంస్థ‌ల‌యితే 90 శాతం వరకు కూడా ఆఫ‌ర్ చేస్తాయి. అయితే ఇంటి మొత్తం విలువ‌లో ఎల్‌టీవీ రేషియోని త‌గ్గించుకుంటే .. త‌క్కువ వ‌డ్డీకే రుణం ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా ఈఎమ్ఐ కూడా త‌గ్గుతుంది. అంటే బ్యాంకులు ఎంత ప‌రిమితి వ‌ర‌కు రుణం ఇస్తాయో.. అంత మొత్తం తీసుకోకుండా, సాధ్య‌మైనంత వ‌ర‌కు సొంతంగా స‌మ‌కూర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. మ‌రోవిధంగా చెప్పాలంటే క‌నీస డౌన్‌పేమెంట్ చెల్లించి.. మిగిలిన మొత్తం రుణం తీసుకోకుండా.. డౌన్‌పేమెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. 

"ఎల్‌టీవీ రేషియో త‌గ్గితే, రుణ దాత‌ల‌కు క్రెడిట్ రిస్కు త‌గ్గుతుంది. అందుకే త‌క్కువ వ‌డ్డీ రేటుకే గృహ రుణాల‌ను ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఇది వ‌డ్డీతో పాటు, అప్పు తీసుకునే వారి ఈఎమ్ఐ భారాన్ని త‌గ్గిస్తుంది." అని పైసాబ‌జార్‌.కామ్ గృహ రుణాల హెడ్ ర‌త‌న్ చౌద‌రి తెలిపారు. 

2. ఎక్కువ కాల‌ప‌రిమితి..

కొత్త‌గా గృహ రుణం తీసుకునే వారు ఎక్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌డం ద్వారా ఈఎమ్ఐ భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఎక్కువ కాల‌ప‌రిమితితో ఈఎమ్ఐ త‌గ్గుతుంది కానీ వ‌డ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వ‌స్తుంది. త‌క్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకుంటే ఈఎమ్ఐ ఎక్కువైనా వ‌డ్డీ మొత్తం త‌గ్గుతుంది. ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకునే వారి గృహ రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందే అవ‌కాశాలు ఎక్కువ‌. కార‌ణం.. కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా ఉంటే ఈఎమ్ఐ త‌క్కువ ఉంటుంది. దీంతో అప్పు తీసుకున్న వ్య‌క్తి సుల‌భంగా ఈఎమ్ఐలు చెల్లించ‌గ‌లుగుతారు. రుణం ఎగవేసే ప్ర‌మాదం త‌క్కువ‌గా ఉంటుంది. 

3. ఆన్‌లైన్లో రేట్ల‌ను పోల్చండి..

గృహ‌రుణం కోసం ఏదైనా బ్యాంకును, రుణ సంస్థ‌ను ఎంచుకునే ముందు ఆన్‌లైన్‌లో వివిధ సంస్థ‌లు ఆఫ‌ర్ చేస్తున్న‌ గృహ రుణాల వ‌డ్డీ రేట్ల‌ను పోల్చి చూడాలి. స‌రైన రుణం పొందేందుకు ప్ర‌స్తుతం అనేక వెబ్‌సైట్‌లు స‌హాయ‌ప‌డుతున్నాయి. ఆన్‌లైన్ పోర్ట‌ల్స్.. వివిధ సంస్థ‌లు అందించే రుణాలు, వాటికి సంబంధించిన‌ వ‌డ్డీ రేట్లు, ఫీజులు, ఇత‌ర ఛార్జీలు గురించి స‌వివ‌రంగా తెలియ‌జేస్తున్నాయి. మెరుగైన‌ గృహ రుణం పొందేందుకు స‌రైన రీతిలో అన్నింటిని ప‌రిశీలించి స‌రైన గృహ‌ రుణం ఎంచుకోవ‌డం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని